‘న్యాయవాద దంపతులది సర్కార్‌ హత్యే’

Bandi Sanjay Alleged TRS Government Over Lawyer Couple Murder - Sakshi

సాక్షి, పెద్దపల్లి ‌: పెద్దపల్లి జిల్లాలో హైకోర్టు న్యాయవాదులు వామన్‌రావు, నాగమణిల హత్యను ప్రభుత్వ హత్యగానే పరిగణిస్తున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. టీఆర్‌ఎస్‌ నేతలు, ప్రజాప్రతినిధుల అక్రమాల చిట్టా వారి వద్ద ఉందని, వాటి ఆధారంగా హైకోర్టులో కేసులు దాఖలు చేసినందునే పోలీసు అధికారుల సహకారంతో వారిని పక్కాగా అంతమొందించారని సంజయ్‌ ఆరోపించారు. పెద్దపల్లి జిల్లా ప్రభుత్వాస్పత్రిలో న్యాయవాద దంపతుల మృతదేహాలను గురువారం ఆయన పరిశీలించారు. అనంతరం మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించి మాట్లాడారు. 

హత్య వెనుక టీఆర్‌ఎస్‌ హస్తం: ఉత్తమ్‌ 
సాక్షి, హైదరాబాద్‌: న్యాయవాదులు గట్టు వామన్‌రావు దంపతుల హత్య వెనుక టీఆర్‌ఎస్‌ హస్తం ఉందని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. గురువారం గాంధీభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, వామన్‌రావు హత్యపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. ఇది కచ్చితంగా టీఆర్‌ఎస్‌ చేసిన హత్యేనని, ఇప్పటివరకు సీఎం కేసీఆర్, టీఆర్‌ఎస్‌ నేతలు హత్యను ఖండించకపోవడమేంటని ప్రశ్నించారు. హత్యపై హైకోర్టు న్యాయమూర్తిని కలిసి ఫిర్యాదు చేస్తానని, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాస్తానని, పార్లమెంట్‌లో ఈ అంశంపై ప్రస్తావన తీసుకొస్తానని తెలిపారు.

సిట్టింగ్‌ జడ్జితో విచారణ చేయించాలి: జీవన్‌రెడ్డి 
సాక్షి, హైదరాబాద్‌: లాయర్‌ దంపతులను హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. కేసును సీబీఐ విచారణకు ఆదేశించి, సిట్టింగ్‌ జడ్జితో విచారణ చేయించాలన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్‌ ప్రజలకు కాదని.. టీఆర్‌ఎస్‌ నేతలకేనని ఓ ప్రకటనలో విమర్శించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top