అయ్యప్పస్వామిపై భైరి నరేష్‌ వివాదాస్పద వ్యాఖ్యలు.. పరిగెత్తించి కొట్టిన స్వాములు

Ayyappa devotees Angry With Bairi Naresh Controversy Comments - Sakshi

సాక్షి, నారాయణపేట:  హిందూ దేవుళ్లు, అయ్యప్ప స్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఓయూ భైరి నరేష్‌పై అయ్యప్ప మాలధారులు, హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. శుక్రవారం కోస్గి మండల కేంద్రంలో భైరి నరేష్‌ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా నిరసనలు, రాస్తారోకో చేస్తున్న క్రమంలో ఓ వ్యక్తిపై దాడి జరిగినట్లు తెలుస్తోంది. 

బాలరాజు అనే వ్యక్తిని పరిగెత్తిస్తూ మాలధారులు చితకబాదినట్లు తెలుస్తోంది. దీంతో అక్కడ ఉద్రిక్తవాతావరణం నెలకొనగా.. పోలీసులు కలుగుజేసుకుని అతన్ని అక్కడి నుంచి తరలించారు. ఆపై చికిత్స కోసం అతన్ని ఆస్పత్రికి తరలించగా.. అతని పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు సమాచారం. వీడియోలు తీస్తూ అనుమానాదాస్పదంగా కనిపించడం, నిలదీస్తే పొంతన లేని సమాధానాలు ఇవ్వడంతోనే అతనిపై దాడి జరిగినట్లు తెలుస్తోంది. 

ఇక రెండు రోజుల కిందట కొడంగల్‌లో ఓ సభలో హిందూ దేవుళ్లు, అయ్యప్ప స్వామిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశాడు భైరి నరేష్‌. ఈ వ్యాఖ్యలు అనుచితంగా ఉన్నాయంటూ హిందూ సమాజం భగ్గుమంది. రాష్ట్రవ్యాప్తంగా ఆ వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి.

మరోవైపు భైరి నరేష్ యూట్యూబ్ ఛానల్‌ను పూర్తిగా నిషేధించాలనే డిమాండ్‌ వినిపిస్తోంది. వీడియోలన్నింటిని యూట్యూబ్‌ నుంచి తొలగించాలని డిమాండ్‌ చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రశాంత వాతావరణాన్ని భైరి నరేష్‌ భగ్నం కలిగిస్తున్నాడని,  కులాల, మతాల మధ్య ద్వేషం రగిలిస్తున్నాడని, ఉద్దేశపూర్వకంగా హిందూ మతాన్ని, హిందూ దేవతలను అవమాన పరుస్తున్నాడని  విమర్శిస్తున్నారు. 

హిందూ దేవతలను అశ్లీల అసభ్య పదాలతో వర్ణించడంతో యావత్ హిందూజాతి చాలా అవమానం, బాధకు గురవుతుందని నిరసనకారుల్లో పలువురు విమర్శిస్తున్నారు. భైరి నరేష్ పై పీడీ యాక్ట్ కేసు నమోదు చేయాలని, వెంటనే అరెస్ట్‌ చేయాలని జడ్చర్ల పట్టణంలోని నేతాజీ కూడలిలో అయ్యప్ప స్వాముల ధర్నా చేపట్టారు.

మరోవైపు నల్లగొండ  జిల్లా నకిరేకల్ లో ఇందిరా గాంధీ చౌరస్తా వద్ద ఆందోళనకు దిగారు అయ్యప్ప స్వామి భక్తులు. నకిరేకల్  అయ్యప్ప స్వామి భక్త మండలి అద్యర్యం లో రాస్తా రోకో ధర్నా చేపట్టారు. మనోభావాలు దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేసిన నరేష్ పై చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు వాళ్లు.
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top