అసెంబ్లీ సమావేశాలు వారమే?

Assembly Meetings Updates Telangana  - Sakshi

రాష్ట్ర శాసనసభ వర్షాకాల సమావేశాలను వచ్చే నెల 7 నుంచి నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలన్న సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు అధికారులు సన్నాహాలు ప్రారంభించారు. కనీసం 15–20 రోజులు సమావేశాలు నిర్వహించాలని సీఎం పేర్కొన్నప్పటికీ కరోనా పరిస్థితుల నేపథ్యంలో 7–10 పనిదినాలు మాత్రమే సమావేశాలు నిర్వహంచే అవకాశం ఉన్నట్లు తెలిసింది.

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర శాసనసభ వర్షాకాల సమావేశాలను సెప్టెంబర్‌ ఏడో తేదీ నుంచి నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలన్న సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు అధికారులు సన్నాహాలు ప్రారంభించారు. అనేక ముఖ్యమైన అంశాలపై చర్చించడంతోపాటు నిర్ణయాలు తీసుకొనేందుకు కనీసం 15–20 రోజులు సమావేశాలు నిర్వహించాలని సీఎం పేర్కొన్నప్పటికీ కరోనా పరిస్థితుల నేపథ్యంలో 7–10 పనిదినాలు మాత్రమే సమావేశాలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. శాసనమండలిని 5 రోజులపాటు జరపాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం. రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ సమావేశాలను ఈ ఏడాది మార్చి 6 నుంచి 20 వరకు నిర్వహించాలనుకున్నా కరోనా వల్ల మార్చి 16నే ముగించారు. 

సీటింగ్‌పై కసరత్తు మొదలు.. 
కరోనా నిబంధనలకు అనుగుణంగా శాసనసభలో సభ్యులు భౌతికదూరం పాటించేలా సీట్ల ఏర్పాటుపై అధికారులు కసరత్తు ప్రారంభించారు. శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్‌ వి.నర్సింహాచార్యులు మంగళవారం అసెంబ్లీ సమావేశ మందిరం తోపాటు విజిటర్స్, ప్రెస్‌ గ్యాలరీని సందర్శించారు. ఒకట్రెండు రోజుల్లో మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డిని కలసి ఏర్పాట్లపై చర్చించే అవకాశం ఉంది. దీనిపై స్పష్టత వచ్చాక సమావేశాలు నిర్వహించాల్సిన తీరుపై సీఎం కేసీఆర్‌తో భేటీ అయ్యే అవకాశం ఉంది. 

పలు తీర్మానాలు, విధానాలపై చర్చ 
ఇటీవల మరణించిన దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డికి సంతాపం తెలిపే తీర్మానంతోపాటు పలు బిల్లులను ఈ సమావేశాల్లో ఆమోదించనున్నారు. ప్రైవేటు యూనివర్సిటీల సవరణ బిల్లు, తెలంగాణ పబ్లిక్‌ హెల్త్‌ ఎమర్జెన్సీ, ఎఫ్‌ఆర్‌బీఎం, టీచింగ్‌ హాస్పిటల్స్‌లో పనిచేసే అధ్యాపకుల రిటైర్మెంట్‌ వయసు 65 ఏళ్లకు పెంపు వంటి ఆర్డినెన్స్‌లు చర్చకు వచ్చే అవకాశం ఉంది. అలాగే సాగునీటి విభాగం పునర్వ్యవస్థీకరణ, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పాలసీ, నియంత్రిత సాగు, నూతన సచివాలయ భవన నిర్మాణం వంటి అంశాలపైనా అసెంబ్లీ చర్చించి కీలక నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top