నిజాం పాలకులు అప్పగించిన ‘ఈజిప్టు మమ్మీ’తో పురావస్తు శాఖకు కష్టాలు.. గతంలో రూ. 58 లక్షలకు మమ్మీ గ్లాస్ చాంబర్ కొనుగోలు
ప్రస్తుతం అది పనిచేయక పాడవుతున్న మమ్మీ
గ్లాస్ చాంబర్ మరమ్మతుకు రూ.82 లక్షలు అడిగిన విదేశీ సంస్థ.. అంత ఖర్చు భరించలేమన్న ప్రభుత్వం
దేశంలో ఆ గాజు పెట్టెల తయారీ లేక పురావస్తు శాఖకు తలెత్తుతున్న చిక్కులు
సాక్షి, హైదరాబాద్: ఈజిప్టు మమ్మీని పరిరక్షించే చర్యల్లో భాగంగా ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ఫ్రీ నైట్రోజన్ ఎయిర్‌టైట్ గ్లాస్ చాంబర్‌ను రూ. 58 లక్షలకు కొనుగోలు చేశారు... ఇప్పుడు అందులో కొన్ని పరికరాలు పాడవటంతో పనిచేయట్లేదు. దాన్ని మరమ్మతు చేయాలని సంబంధిత కంపెనీని సంప్రదిస్తే రూ. 82 లక్షలు ఖర్చవుతాయని చెప్పింది. చేతిలో చిల్లిగవ్వ లేని పురావస్తు శాఖ (హెరిటేజ్ తెలంగాణ) ప్రభుత్వానికి ఫైలు పంపగా నెలల తరబడి పెండింగ్‌లో పెట్టి చిన్న రిపేర్‌కు అన్ని నిధులివ్వలేమని.. మిగతా మ్యూజియాలలో ఏం చేస్తున్నారో తెలుసుకోవాలని సూచించింది. వెరసి ఇప్పుడు మమ్మీ అంటేనే పురావస్తు శాఖ బెంబేలెత్తుతోంది. ఈజిప్టుకు వెళ్లి మరీ కొనుక్కొచ్చిన మమ్మీని నిజాం పాలకులు పురావస్తు శాఖకు అప్పగించగా ఇక్కడి వాతావరణానికి ఏమాత్రం తట్టుకోలేని ఆ మమ్మీ ఇప్పుడు ఖజానాకు పెద్ద భారంగా మారింది. దాన్ని అలాగే వదిలేస్తే శిథిలమై ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందన్న భయం.. కాపాడుదామంటే రూ. లక్షలు వదులుతాయన్న ఆందోళన వెంటాడుతోంది.
చిన్న గాజు పెట్టె ఇక్కడ కరవై...
దాదాపు 2,100 ఏళ్ల నాటి ఈజిప్టు యువరాణి నాసిహు మృతదేహాన్ని మమ్మిఫికేషన్ చేసి భద్రపరచగా దాన్ని 1920లలో ఆరో నిజాం అల్లుడు నవాబ్ నజీర్ నవాజ్ జంగ్ ఈజిప్టులో ఈ మమ్మీని కొనుగోలు చేసి ఏడో నిజాంకు బహుమతిగా ఇచ్చాడు. దాన్ని నిజాం ఈ మ్యూజియంలో ఉంచాడు. అది అలాగే ఉంటూ వచ్చింది. ఆక్సిజన్ తగిలితే ఆ మృతదేహం శిథిలమవుతుందన్న విషయం తెలియక తొలుత దానిని సాధారణ గాజు పెట్టెలో ఉంచారు. దీంతో అది కొంత శిథిలం కావడంతో 10 ఏళ్ల క్రితం ఈజిప్టు నిపుణుల సూచనతో ఆక్సిజన్ చేరని నైట్రోజన్ ఎయిర్‌టైట్ గాజు చాంబర్‌లో ఉంచాలని నిర్ణయించారు. అయితే మన దేశంలో అలాంటి నైట్రోజన్ గాజు పెట్టెల తయారీ లేకపోవడంతో గ్లోబల్ టెండర్లు పిలవగా ఓ జర్మనీ కంపెనీ రూ. 58 లక్షలకు దాన్ని తెచ్చి అమర్చింది.
ఈ ప్రక్రియ జరిగి దాదాపు ఐదేళ్లు గడిచింది. రెండేళ్ల క్రితం నైట్రోజన్ వాయువు అందులో నిండుకోవటంతోపాటు ఏసీ వ్యవస్థ, ఇతర కొన్ని పరికరాలు పాడయ్యాయి. దీంతో జర్మన్ కంపెనీని సంప్రదిస్తే దాని రిపేర్‌కు రూ. 82 లక్షలు అవుతుందని పేర్కొంది. ఇదే విషయాన్ని పురావస్తు శాఖ ప్రభుత్వానికి నివేదించినప్పటికీ రెండేళ్లుగా ఏమీ తేల్చలేదు. ఇటీవల మ్యూజియం సందర్శనకు వచ్చిన పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు గ్లాస్ చాంబర్ రిపేర్‌కు అంత ఖర్చేమిటని ఆశ్చర్యపోయారు. దేశంలోని ఇతర మ్యూజియంలలో ఉన్న మమ్మీల పరిరక్షణ ఎలా జరుగుతోందో తెలుసుకోవాలని ఆదేశించారు. ప్రస్తుతం దేశంలో ఆరు మమ్మీలు మాత్రమే ఉన్నాయి. మిగతా మ్యూజియంలలో అవుతున్న ఖర్చు ఎంతో తెలుసుకునేందుకు అధికారులు ఇప్పుడు పరుగుపెడుతున్నారు.
మళ్లీ పాడైతే ఏంటి?
అంత ఖర్చు చేసి మరమ్మతు చేయిస్తే, మళ్లీ రిపేరు వస్తే పరిస్థితి ఏంటన్నది ఇప్పుడు పురావస్తు శాఖ ముందున్న ప్రశ్న. ఒకసారి పాడైతే, దాని ఖరీదుకు మించిన ఖర్చు చేయాల్సి వస్తే, మరోసారి పాడైతే ఖర్చు రూ.కోటి దాటుతుందేమోనన్న అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. మ్యూజియంలలో ఇతర అంశాలకు నిధులిచ్చినా ఇవ్వకున్నా, మమ్మీ భద్రత, పరిర క్షణ చర్యలకు ప్రత్యేక ఫండ్ కావాల్సిందేనన్న అభిప్రాయాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు. దీన్ని బహుమతిగా ఇద్దామన్నా వేరే రాష్ట్రాల్లోని ఏ మ్యూజియం కూడా తీసుకునేందుకు సిద్ధంగా లేకపోవటంతో, ఇక దాన్ని ఎంత ఖర్చయినా పర్యవేక్షించాల్సిందే. రిపేర్ వచ్చి వదిలేస్తే, ఆక్సిజన్ సోకి అది శిథిలమై చెడ్డపేరు తీసుకొస్తుంది. లేదంటే భవిష్యత్తులో రూ.కోట్లు వెచ్చించి పరిరక్షించాల్సి వస్తుంది. దీంతో పురావస్తు శాఖకు మమ్మీ టెన్షన్ పట్టుకుంది.


