
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాజకీయ ప్రకంపనలు రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు.. సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సిట్ విచారణ పేరుతో తమను వేధిస్తున్నారంటూ ఆయన పిటిషన్ దాఖలు చేశారు. తరచూ పోలీస్ స్టేషన్‌కు పిలిచి వేధిస్తున్నారని ప్రభాకర్‌రావు పిటిషన్ దాఖలు చేయగా.. మరో వైపు ప్రభాకర్‌రావుకు ఇచ్చిన రిలీఫ్‌ను కొట్టివేయాలంటూ పోలీసులు కోరారు. ప్రభాకర్‌రావు పిటిషన్.. ఆగస్టు 4వ తేదీన విచారణకు రానుంది.
కాగా, ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ల్యాప్‌టాప్, ఫోన్‌ను సిట్ అధికారులు సీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే నిందితులు, బాధితుల స్టేట్మెంట్ ఆధారంగా సిట్ అధికారులు ప్రభాకర్ రావును విచారిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో 2023 నవంబర్ 15 నుంచి 30 మధ్యే ప్రభాకర్‌రావు నేతృత్వంలోని ఎస్‌ఐబీ 4,013 ఫోన్లపై నిఘా ఉంచినట్లు సిట్ గుర్తించిన సంగతి తెలిసిందే.
వీటిలో 618 రాజకీయ నాయకులకు సంబంధించినవిగా తేల్చింది. మరోపక్క కేసులో మరో నిందితుడు ప్రణీత్‌రావు ఫోన్ నుంచి సిట్ అధికారులు కొన్ని ఆడియోలు సేకరించారు. వాస్తవానికి రాష్ట్రంలో ప్రభుత్వం మారిన వెంటనే ప్రభాకర్‌రావుతో పాటు ఆయన టీమ్ మొత్తం తమ ఫోన్లలో ఉన్న డేటాను డిలీట్ చేయడంతో పాటు ఫోన్లను ధ్వంసం చేసింది. అయితే ప్రణీత్‌కు సంబంధించిన ఓ ఫోన్‌లో మాత్రం డేటా డిలీట్ కాకపోవడంతో అది సిట్ చేతికి చిక్కింది.