చర్చలో మాట్లాడుతున్న అభిజిత్ బెనర్జీ. చిత్రంలో కిన్నెరమూర్తి, షెయనా ఒలివర్
ఇందులోని కొన్ని అంశాలపై అధికారపక్షంలోనే భిన్నాభిప్రాయాలున్నాయి...
నిధుల పరంగా కేంద్రం పాత్రను తగ్గించుకోవడం సరికాదు
ప్రముఖ ఆర్థికవేత్త అభిజిత్ బెనర్జీ వెల్లడి
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఆమోదించిన వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ ఆజీవికా మిషన్ (గ్రామీణ్) (వీబీ–జీ రామ్ జీ) చట్టానికి సవరణలు చేస్తుందని ఆశిస్తున్నామని ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ అవార్డు గ్రహీత అభిజిత్ బెనర్జీ పేర్కొన్నారు. ఈ చట్టం ఇంకా సమగ్రరూపం తీసుకోలేదని భావిస్తున్నామన్నారు. మహాత్మాగాంధీ గ్రామీణ జాతీయ ఉపాధిహామీ చట్టం స్థానంలో తెచ్చిన ఈ చట్టంపై అధికార పక్ష (బీజేపీ) నేతల్లోనే భిన్నాభిప్రాయాలు ఉన్నాయని చెప్పారు. వీబీ–జీ రామ్‌జీ చట్టంలో తెచ్చిన కొన్ని మార్పులు చింతాజనకంగా ఉన్నా యని అభిప్రాయపడ్డారు.
నిధులు, విధానాలు, ఇతర అంశాల పరంగా కేంద్రం తన పాత్రను తగ్గించుకోవడం సరికాదని చెప్పారు. కేంద్రం నిధుల తగ్గింపు వల్ల పేద రాష్ట్రాలు ఈ పథకానికి చేసే వ్యయం తగ్గుతుందని, దీంతో పేదరికాన్ని తగ్గించాలనే లక్ష్యం నెరవేరదని చెప్పారు. సోమవారం హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్–2026 (హెచ్‌ఎల్‌ఎఫ్) ప్లీనరీలో భాగంగా... అభిజిత్ బెనర్జీ రచించిన ‘చౌంక్: ఆన్ ఫుడ్, ఎకనమిక్స్ అండ్ సొసైటీ’పుస్తకంపై జరిగిన చర్చలో హెచ్‌ఎల్‌ఎఫ్ డైరెక్టర్ బి.కిన్నెరమూర్తి సమన్వయకర్తగా వ్యవహరించారు.
హైదరాబాద్ బిర్యానీ బెస్ట్
కిన్నెరమూర్తి చర్చను ప్రారంభిస్తూ అభిజిత్ పుస్తకంలో దక్షిణాది మరీ ముఖ్యంగా తెలంగాణ వంటకాలను భాగం చేయకపోవడంపై తాము ఫిర్యాదు చేస్తున్నామన్నారు. భారత్ వైరుధ్యాలతో కూడిన దేశమని, పేదల గురించి ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ప్రస్తుతం భారత్ ఉన్న పరిస్థితుల్లో మెరిట్ అనేది అసంబద్ధమైన పదంగా మారిందని, మెరిట్ అనేది సామాజిక పరిస్థితుల నుంచి ఉద్భవించిందని అభిజిత్ పేర్కొన్నారు. తన తల్లిదండ్రులిద్దరూ టీచర్లు కావడంతో ఇంట్లో పుస్తకాలనేవి తనకు ఒక ప్రివిలేజ్‌గా లభించాయన్నారు. తాను ఆయా వంటకాలపై రచనలు చేయడమే కాదు... దక్షిణ భారత వంటలు కూడా బాగా తయారుచేయగలనని చెప్పారు.
భారత్‌లో రిజర్వేషన్ల పాలసీ అనేది ఉద్రిక్తతలకు దారితీస్తోందని, ఇది చాలామందికి నచ్చడం లేదన్న ప్రశ్నకు అభిజిత్ స్పందిస్తూ... మధ్యతరగతి కోరుకుంటున్న ఉద్యో గాలు దొరకక, ప్రభుత్వరంగంలోనే కాక ప్రైవేట్‌రంగంలోనూ తగిన ఉద్యోగాలు లభించక నిరుద్యోగం పెరగడంతో ఈ సమస్య తీవ్రమవుతోందన్నారు. బియ్యం ధరల పెరుగుదల ఒకందుకు మంచిదేనని, దీనివల్ల ఇతర ఆహార ప్రాధాన్యతల వైపు మళ్లే అవకాశం ఉంటుందన్నారు.
వరి పంటలు అధికంగా వేయడం వంటివి పరోక్షంగా గ్లోబల్ వారి్మంగ్ వంటి విపరిణామాలకు దారితీస్తుందనే విషయాన్ని గ్రహించాలని చెప్పారు. హైదరాబాద్ బిర్యానీకి ఏ రేటింగ్ ఇస్తారని ఐఏఎస్ అధికారి జయేశ్ రంజన్ అడిగిన ప్రశ్నకు అభిజిత్ స్పందిస్తూ... దేశంలో ఒక్కోచోట ఒక్కోరకమైనది అందుబాటులో ఉన్నా ప్రత్యేక సందర్భాల్లో బిర్యానీ తీసుకోవాలని.. అలాంటి సందర్భాల్లో హైదరాబా ద్ బిర్యానీని బెస్ట్‌గా పరిగణిస్తామని బదులిచ్చారు.


