
తెలంగాణకు 10.26, ఏపీకి 4 టీఎంసీలు
కృష్ణా బోర్డు ఉత్తర్వులు జారీ
సాక్షి, హైదరాబాద్/ నాగార్జునసాగర్: తాగునీటి అవసరాల కోసం తెలంగాణకు 10.26, ఆంధ్రప్రదేశ్‌కు 4 టీఎంసీల కృష్ణా జలాలను కేటాయిస్తూ కృష్ణా నది యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) చైర్మన్ అతుల్ జైన్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్ తాగునీటి అవసరాల కోసం నాగార్జునసాగర్ కుడి కాలువ ద్వారా ఈనెల 22 నుంచి అంటే గురువారం నుంచే రోజుకు 5,500 క్యూసెక్కుల చొప్పున 4 టీఎంసీలను విడుదల చేయాలని సాగర్ సీఈని ఆదేశించారు.
శ్రీశైలం ప్రాజెక్టులో జూలై 31 నాటికి 800 అడుగుల స్థాయిలో నీరు నిల్వ ఉండేలా చూసి.. మిగతా నీటిని విడ్యుదుత్పత్తి చేస్తూ సాగర్‌కు తరలించాలని తెలంగాణ ప్రభుత్వానికి సూచించారు. ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌లలో నీటి లభ్యతను సమీక్షించి.. కేటాయింపులపై బోర్డు చైర్మన్‌కు సిఫార్సు చేసేందుకు ఈనెల 5న హైదరాబాద్‌లో త్రిసభ్య కమిటీ సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశానికి తెలంగాణ ఈఎన్‌సీ హాజరుకాగా, ముందస్తు షెడ్యూలు వల్ల ఏపీ ఈఎన్‌సీ హాజరుకాలేదు.
కాగా, రాష్ట్రంలో తాగునీటి అవసరాల కోసం 10.26 టీఎంసీలు కేటాయించాలని తెలంగాణ ఈఎన్‌సీ త్రిసభ్య కమిటీ సమావేశంలో కోరారు. అలాగూ తాగునీటి అవసరాల కోసం పది టీఎంసీలు విడుదల చేయాలని ఈనెల 20న ఏపీ ఈఎన్‌సీ కృష్ణా బోర్డు చైర్మన్‌కు లేఖ రాశారు. శ్రీశైలంలో ఈనెల 5 నాటికి 800 అడుగులకు ఎగువన, సాగర్‌లో 510 అడుగులకు ఎగువన 10.81 టీఎంసీలు మాత్రమే లభ్యతగా ఉన్నాయని తెలంగాణ ఈఎన్‌సీ కృష్ణా బోర్డుకు లేఖ రాశారు.
ఇదిలా ఉండగా రెండు రాష్ట్రాల తాగునీటి అవసరాలు తీర్చడానికి శ్రీశైలంలో 800 అడుగుల వరకూ.. సాగర్‌లో 505 అడుగుల స్థాయి వరకూ నీటిని వినియోగించుకోవాలని కృష్ణా బోర్డు నిర్ణయించింది. బుధవారం సాయంత్రానికి శ్రీశైలం ప్రాజెక్టులో 800 అడుగులకు ఎగువన 8.422, సాగర్‌లో 505 అడుగులకు ఎగువన 12.793.. వెరసి మొత్తం 21.215 టీఎంసీలు లభ్యతగా ఉన్నట్లు బోర్డు లెక్కగట్టింది. ఇందులో 4.243 టీఎంసీలు ఆవిరి, ప్రవాహ నష్టాలుపోనూ 16.972 టీఎంసీల్లో తెలంగాణకు 10.26, ఆంధ్రప్రదేశ్‌కు 4 టీఎంసీల చొప్పున బోర్డు కేటాయించింది.
కాగా, కేఆర్‌ఎంబీ ఆదేశాలతో ప్రాజెక్టు అధికారులు సాగర్ కుడికాలువకు గురువారం 5,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. రోజుకు 5,500 క్యూసెక్కుల చొప్పున 8 రోజుల పాటు 4 టీఎంసీల నీటిని విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు. కుడి కాలువ పరిధిలోని చెరువులు, కుంటలను నింపుకొని తాగునీటి అవసరాలకు వాడుకోవాలని బోర్డు అధికారులు సూచించారు.