భట్టి.. అక్రమాలను కప్పిపుచ్చుతున్నారు
బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి
ఎస్సార్పీ ఓసీపీ సందర్శనకు వెళ్లగా.. అనుమతి లేదని అడ్డుకొని వెనక్కి పంపిన పోలీసులు
శ్రీరాంపూర్: సింగరేణిలో జరుగుతున్న అవినీతి, అక్రమాలను నిగ్గు తేల్చడానికి హౌస్ కమిటీ వేయాలని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఆ పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేల బృందం శుక్రవారం మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ గనుల్లోæ భరోసా యాత్ర నిర్వహించింది. ఎస్సార్పీ ఓసీపీ సందర్శనకు వెళ్లగా.. పోలీసులు అనుమతి లేదంటూ లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. రెండు గంటలపాటు రోడ్డుపైనే ఆపేశారు. అక్కడి నుంచి వెనుదిరిగి పీవీఆర్ గార్డెన్‌లో మీడియాతో మాట్లాడారు.
సింగరేణిలో 40 లక్షల టన్నుల బొగ్గు మాయమైందని, దీనిపై విచారణ చేయాలని మహేశ్వర్‌రెడ్డి డిమాండ్ చేశారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో జైపూర్ ఎస్టీపీపీలో ప్లాంటు ఏర్పాటు, విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు, బాయిలర్ లీకేజీ వంటి ఘటనలతో సుమారు రూ.982 కోట్ల నష్టం జరిగిందన్నారు.తాడిచెర్ల బొగ్గు బ్లాకును కూడా నాటి ప్రభుత్వం వారికి అనుకూలంగా ఉన్న ఏఎంఆర్ అనే సంస్థకు కట్టబెట్టి రూ.కోట్ల అవినీతికి పాల్పడిందని విమర్శించారు.
నాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మల్లు భట్టి విక్రమార్క, రేవంత్‌రెడ్డి ఈ అవినీతిని ప్రశ్నించారని, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు విచారణ చేపట్టడం లేదని ప్రశ్నించారు. కంపెనీలో 36 ఓబీ సంస్థలకు ఎక్సెస్ టెండర్లతో పనులు కట్టబెట్టి రూ.23,486 కోట్ల నష్టం చేశారన్నారు. సైట్ విజిట్ పేరుతో రేవంత్‌రెడ్డి చుట్టానికి వీకేఓసీపీ ఓబీ పనులు అక్రమంగా కట్టబెట్టారని ఆరోపించారు. బొగ్గు నిల్వల మాయంపై బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి సింగరేణికి లేఖ రాస్తే దానికి సమాధానం ఇవ్వడం లేదని మండిపడ్డారు.
పోలీసులతో వాగ్వాదం..
భరోసా యాత్ర సందర్భంగా పోలీసులు ఓసీపీ వద్ద పెద్ద ఎత్తున మోహరించారు. లోపలికి వెళ్లకుండా అడ్డుకోవడంతో ఎమ్మెల్యేలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తాము శాసనసభ్యులమని, తమను ఎలా అడ్డుకుంటారని ప్రశ్నించారు. ఓసీపీ చెక్‌పోస్టు వద్దనే ఎమ్మెల్యేల కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా ఎమ్మెల్యేలను బలవంతంగా తీసుకువచ్చి వారి వాహనాల్లో కూర్చోబెట్టారు. ఈ సందర్భంగా పోలీసులు, నేతలకు మధ్య తీవ్ర పెనుగులాట జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పైడి రాకేశ్‌రెడ్డి, కె.వెంకటరమణారెడ్డి, రామారావు పటేల్, పాల్వాయి హరీశ్‌బాబు, దన్‌పాల్ సూర్యనారాయణగుప్తా, ఎమ్మెల్సీ అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


