All Political Parties Special Focus On Munugode By-Poll Result 2022 - Sakshi
Sakshi News home page

మునుగోడు ఫలితాలు.. లెక్క తప్పిందెక్కడ?

Nov 8 2022 11:14 AM | Updated on Nov 8 2022 11:50 AM

All political Parties Special Focus On Munugode Bypoll Results - Sakshi

సాక్షి ప్రతినిధి, నల్లగొండ: మునుగోడు ఉప ఎన్నికలో అన్ని పార్టీలు గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డాయి. ఎన్నికల్లో మెజారిటీ తగ్గిందని, రావాల్సిన ఓట్లు రాలేదంటూ విజయం సాధించిన పార్టీతోపాటు అపజయం పాలైన పార్టీలు భావిస్తున్నాయి. ఈ ప్రక్రియలో లెక్క ఎక్కడ తప్పింది? ఓట్లు ఎందుకు తారుమారయ్యాయి..? అన్న దానిపై అన్ని ప్రధాన పార్టీలు పోస్టుమార్టం చేస్తున్నాయి. భారీ మెజారిటీ వస్తుందని టీఆర్‌ఎస్, తప్పకుండా గెలుస్తామన్న ధీమాలో బీజేపీ, మహిళా సెంటిమెంట్‌ పని చేస్తుందని, ఎక్కువ ఓట్లు వస్తాయని కాంగ్రెస్‌ భావించినా వారి అంచనాలను మునుగోడు ప్రజలు తారుమారు చేశారు.

భారీ మెజారిటీ అంచనా వేసుకున్న టీఆర్‌ఎస్‌ 
ముఖ్యంగా అధికార టీఆర్‌ఎస్‌ 30 వేల నుంచి 40 వేల మెజారిటీ వస్తుందని అంచనా వేసుకుంది. అన్ని మండలాల్లోనూ ఆధిక్యంలోనే ఉన్నా తక్కువ మెజారిటీ రావడానికి గల కారణాలపై ఆరా తీస్తోంది. ముఖ్యమంత్రి రెండుసార్లు బహిరంగ సభలకు రావడంతోపాటు 12 మంది మంత్రులు, 80 మంది ఎమ్మెల్యేలు నియోజకవర్గంలోనే తిష్టవేసి పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు. నామినేషన్‌ మొదలుకొని పోలింగ్‌ చివరి వరకు నియోజకవర్గంలో ఉండి. ఆ తర్వాత నియోజకవర్గ పొలిమేరల్లో ఉండి మరీ పర్యవేక్షించారు. బీజేపీకి 86 వేలకు పైగా ఓట్లు వస్తాయని ఊహించలేదు. 2018 ఎన్నికల్లో కేవలం 12వేలకు పైగా ఓట్లతో సరిపెట్టుకున్న బీజేపీ ఒకేసారి 86 వేలకు పైగా రావడంతో టీఆర్‌ఎస్‌ పార్టీకి మెజారిటీ పెద్ద ఎత్తున తగ్గింది. దీనిపై పార్టీ నేతలు పోస్టుమార్టం చేస్తున్నాయి. ఏ మండలంలో ఎందుకు మెజారిటీ తగ్గిందన్న అంశంపై దృష్టి సారిస్తున్నారు.

గెలుస్తామనుకున్న బీజేపీ
బీజేపీ ఈ ఎన్నికల్లో కొద్దిపాటి ఓట్లతేడాతోనైనా గెలుస్తామని భావించింది. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ధర్మయుద్ధం పేరుతో టీఆర్‌ఎస్‌ను, ముఖ్యమంత్రి కేసీఆర్‌ను టార్గెట్‌ చేసి మరీ ప్రచారం చేశారు. ఆ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్‌ తదితరులంతా ప్రచారం నిర్వహించారు. ప్రభుత్వం మెడలు వంచాలంటే బీజేపీనే ప్రత్యామ్నాయమని చెబుతూ ఆ పార్టీ జాతీయ నాయకత్వం పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించింది. ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు ఉన్న ఏ ఒక్క అవకాశాన్నీ వదులుకోలేదు. అయినా 10 వేలకు పైగా ఓట్ల తేడాతో బీజేపీ ఓడిపోయింది. ఈ నేపథ్యంలో ఎక్కడ పొరపాటు జరిగిందన్న విశ్లేషణల్లో పడింది. 15 రౌండ్ల ఓట్ల లెక్కింపులో 3 రౌండ్లలోనే బీజేపీకి ఆధిక్యం వచ్చిందని, మిగతా రౌండ్లలోని పోలింగ్‌ బూత్‌ల పరిధిలో పార్టీ ప్రచారం, ఓటర్లను ప్రభావితం చేయడంలో వైఫల్యాలను అంచనా వేసుకునే పనిలో పడింది. 

వైఫల్యాలే కారణమా..
కాంగ్రెస్‌ పార్టీ ప్రచార వైఫల్యం వల్లే ఓట్లు తగ్గాయన్న భావనలో ఉంది. టీఆర్‌ఎస్, బీజేపీలు ప్రచారంలోనూ ఇతర ఓటర్లను ప్రభావితం చేయడంలోనూ పోటీ పడ్డాయి. కాంగ్రెస్‌ మాత్రం వాటితో పోటీ పడలేని పరిస్థితి. ఇదే సందర్భంలో రాహుల్‌గాంధీ జోడో యాత్ర తెలంగాణకు రావడంతో రేవంత్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్, భట్టి విక్రమార్క, ఇతర రాష్ట్ర నేతలంతా జోడో యాత్రలోనే ఉన్నారు. దీంతో చివరి దశలో ప్రచారం పెద్దగా చేయని పరిస్థితి నెలకొంది. చివరికి పోలింగ్‌ రోజున ఓటర్లను డబ్బు పంపిణీ విషయంలోనూ వెనుకబడింది. అయినా మహిళా సెంటిమెంట్, మాజీ మంత్రి పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి కూతురు అన్న భావనతో ఓట్లు భారీ ఎత్తున వస్తాయన్న అంచనాలు వేసుకుంది. అయినా వెనుకబడిపోయింది. ఈ విషయంలో పార్టీలో అంతర్గత సమస్యలు కారణమన్న అంచనాకు వచ్చింది. అయినప్పటికీ స్రవంతికి 23 వేలకు పైగా ఓట్లు వచ్చాయంటే మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రెస్‌ క్యాడర్‌ బాగానే ఉందన్నది నిరూపితమైంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement