పిండం 'పొల్యూషన్‌' గండం | Air pollution is having a serious impact on the development of unborn babies | Sakshi
Sakshi News home page

పిండం 'పొల్యూషన్‌' గండం

Jun 4 2026 4:05 AM | Updated on Jun 4 2026 4:05 AM

Air pollution is having a serious impact on the development of unborn babies

తక్కువ బరువుతో జననాలు, మానసిక సమస్యలు

ఆందోళన కలిగిస్తున్న పట్టణ వాయు కాలుష్యం

ఢిల్లీ ఎయిమ్స్‌ అధ్యయనంలో వెల్లడి

గర్భిణీల వైద్య పరీక్షల్లో పొల్యూషన్‌ మానిటరింగ్‌ చేర్చాలని సూచన

సాక్షి, హైదరాబాద్‌: నగరాల్లో పెరిగిపోతున్న వాయు కాలుష్యం గర్భస్థ శిశువుల ఎదుగుదలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. పీఎం 2.5, పీఎం 10 ధూళి కణాలు గర్భాశయ పొరను దాటి లోపలికి ప్రవేశిస్తున్నట్లు ఢిల్లీ ఎయిమ్స్, ఐసీఎంఆర్‌ సంయుక్త పరిశోధనలో తేలింది. ఈ సూక్ష్మ ధూళి కణాలు పిండం ఎదుగుదలలో అత్యంత కీలకంగా వ్యవహరించే ఐజీఎఫ్‌బీపీ3 అనే ప్రొటీన్‌ ఉత్పత్తిని నిరోధిస్తున్నాయని గుర్తించింది. 

ఫలితంగా తల్లి నుంచి పిండానికి అందాల్సిన పోషకాలు నిలిచిపోతున్నాయని, దీంతో పిండం శారీరక, మానసిక ఎదుగుదల దెబ్బతింటోందని ఆందోళన వ్యక్తం చేసింది. దీని ప్రభావం బాల్యం ముగిసే వరకు ఉంటుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. గర్భిణీలకు నిర్వహించే వైద్య పరీక్షల్లో పొల్యూషన్‌ మానిటరింగ్‌ను భాగంగా చేర్చాల్సిన అవసరం ఉందని ఎయిమ్స్‌ అధ్యయనం స్పష్టం చేస్తోంది.

జన్యువుల పనితీరుపై...
ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌), ఢిల్లీ ఎయిమ్స్‌ బయోకెమిస్ట్రీ విభాగం సంయుక్తంగా వాయు కాలుష్య ప్రభావం అధికంగా ఉన్న ఢిల్లీ, తక్కువ కాలుష్యం ఉన్న జార్ఖండ్‌లోని దేవ్‌గఢ్‌ పట్టణాల్లో మొత్తం 994 మంది గర్భి ణీలపై అధ్యయనం చేసింది. ప్రసవ నివేదికల ఆధారంగా చూస్తే ఢిల్లీలో పీఎం 2.5 ప్రభావంతో పుట్టే పిల్లలు త క్కువ బరువుతో జన్మించారు. గర్భధారణ సమయంలో రక్తపో టు వంటి సమస్యలు ఎక్కువగా ఉన్నట్లు గర్తించారు. 

పుట్టిన పిల్లలు నడవడంలో సమన్వయ లోపం, విపరీతమైన ఆందోళన, ఒత్తిడి, నరాల బలహీనత వంటి లక్షణాలు కనిపించాయని ఎయిమ్స్‌ వైద్యులు స్పష్టం చేస్తున్నారు. వాయు కాలుష్యం వల్ల జన్యు వుల పనితీరు శాశ్వతంగా దెబ్బతింటున్నట్లు అధ్యయనంలో తేలింది. మనుషులతోపాటు ఎలుకలపై జరిగిన ప్రయోగాల్లో మరింత ఆందోళనకరమైన విషయాలు వెలుగుచూశాయి. ఢిల్లీలో కాలుష్య ప్రభావంతో ఎలుకల్లో పుట్టే పిల్లల సంఖ్య 25 శాతం తగ్గింది.

గ్రేటర్‌లో కాలుష్య కోరలు 
వాయు కాలుష్యం విషయంలో హైదరాబాద్‌ మహానగరం ఢిల్లీతో పోటీపడుతోంది. వాయు నాణ్యత సూచీ (ఏక్యూఐ) 50 ఉండాల్సి ఉండగా, హైదరాబాద్‌లో 150 నుంచి 300 మధ్య నమోదవుతోంది. ఢిల్లీలో ఏక్యూఐ 250 నుంచి 450 మధ్య ఉంటోంది. 

ఈ ఏడాది జనవరిలో రికార్డు స్థాయిలో హైదరాబాద్‌ కాలుష్య గణాంకాలు నమోదయ్యాయి. 2026 ఫిబ్రవరి 14 రాత్రి 8.31 గంటల సమయంలో మణికొండ ప్రాంతంలో ఏక్యూఐ 2,063గా నమోదైంది. వాయుకాలుష్యం వల్ల నగరంలో సామాన్య వ్యక్తుల్లోనూ శ్వాసకోశ సంబంధిత వ్యాధుల తీవ్రత పెరుగుతోందని వైద్యులు పేర్కొంటున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement