పట్నా హైకోర్టుకు జస్టిస్‌ అభిషేక్‌రెడ్డి బదిలీ  | Advocates Protest Transfer Of Telangana High Court Judge To Patna | Sakshi
Sakshi News home page

పట్నా హైకోర్టుకు జస్టిస్‌ అభిషేక్‌రెడ్డి బదిలీ 

Nov 18 2022 12:48 AM | Updated on Nov 18 2022 8:47 AM

Advocates Protest Transfer Of Telangana High Court Judge To Patna - Sakshi

హైకోర్టు వద్ద ఆందోళన చేస్తున్న న్యాయవాదులు     

సాక్షి, ఢిల్లీ/హైదరాబాద్‌: తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ అభిషేక్‌రెడ్డిని పట్నా హైకోర్టుకు బదిలీ చేయాలని కేంద్రానికి సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని కొలీజియం సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈ సిఫార్సుపై రాష్ట్రపతి ఆమోదముద్ర వేయాల్సి ఉంది. జస్టిస్‌ అభిషేక్‌రెడ్డి 2019, ఆగస్టు 26న తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 

జస్టిస్‌ అభిషేక్‌రెడ్డి బదిలీని ఆపాల్సిందే: హెచ్‌సీఏఏ 
జస్టిస్‌ అభిషేక్‌రెడ్డి బదిలీ ప్రతిపాదనకు వ్యతిరేకంగా తెలంగాణ హైకోర్టు అడ్వొకేట్స్‌ అసోసియేషన్‌(హెచ్‌సీఏఏ) ఆధ్వర్యంలో న్యాయవాదులు గురువారం విధులు బహిష్కరించి ఆందోళన చేపట్టారు. బదిలీ ప్రతిపాదనను విరమించుకునే వరకు విధులకు దూరంగా ఉండాలని నిర్ణయించారు. విధి నిర్వహణలో నిజాయితీగా .. నిక్కచ్చిగా వ్యవహరించే జస్టిస్‌ అభిషేక్‌రెడ్డిని పట్నా కోర్టుకు బదిలీ చేస్తూ కొలీజియం సిఫార్సు చేయడాన్ని తప్పుబడుతూ న్యాయవాదులు మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో విధులు బహిష్కరించి ఆందోళన చేపట్టారు.

ఈ కార్యక్రమంలో పెద్దయెత్తున న్యాయవాదులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హెచ్‌సీఏఏ అధ్యక్షుడు వి.రఘునాథ్‌ మాట్లాడుతూ.. కొలీజియం నిర్ణయం అన్యామని, న్యాయ వ్యవస్థ స్వతంత్రతను దెబ్బతీసేలా ఉందన్నారు. ఏ మార్గదర్శకాలతో జస్టిస్‌ అభిషేక్‌రెడ్డి బదిలీ చేయనున్నారో పేర్కొనకపోవడాన్ని కూడా తప్పుబట్టారు. సుప్రీంకోర్టు కొలీజియం బదిలీ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని విజ్ఞప్తి చేశారు.

అప్పటివరకు న్యాయవాదులంతా విధులు బహిష్కరిస్తామని హెచ్చరించారు. ఒక్క హైకోర్టులోనే కాదు.. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బార్‌ అసోసియేషన్లలోని న్యాయవాదులంతా విధులు బహిష్కరించి నిరసన చేపట్టాలని పిలుపునిచ్చారు. సుప్రీంకోర్టు కొలీజియం తమ నిర్ణయాన్ని ఉపసంహరించుకునే వరకు వెనుకడుగు వేయొద్దన్నారు. అంతకు ముందు బదిలీని ఆపాలంటూ హెచ్‌సీఏఏలో ఏకగ్రీవ తీర్మానం చేశారు. అనంతరం హైకోర్టు ఎదురుగా రాస్తారోకో కార్యక్రమం చేపట్టారు. ‘అక్రమ బదిలీలకు వ్యతిరేకంగా పోరాడుతాం.. వియ్‌ వాంట్‌ జస్టిస్‌’.. అంటూ పెద్దెత్తున నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో హెచ్‌సీఏఏ కార్యదర్శి గడిపల్లి మల్లారెడ్డి, న్యాయవాదులు చిక్కుడు ప్రభాకర్, రాపోలు భాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement