డేంజర్‌ చౌరస్తా.. డబుల్‌రోడ్లు వేసినప్పటికీ ప్రమాదాలు

Accident Prone Area In Karimnagar - Sakshi

సాక్షి, ఇబ్రహీంపట్నం(కరీంనగర్‌): గ్రామాలకు వెళ్లేందుకు డబుల్‌రోడ్లు వేసినప్పటికీ ప్రధాన కూడళ్ల వద్ద ఎలాంటి హెచ్చరిక బోర్డులు, స్పీడ్‌ బ్రేకర్లు పెట్టకపోవడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇబ్రహీంపట్నం మండల కేంద్రానికి రావడానికి జాతీయ రహదారి నుంచి సింగిల్‌రోడ్డును 10 ఏళ్ల క్రితం డబుల్‌రోడ్డుగా మార్చారు. దీంతో వాహనాలు అతివేగంగా వస్తూ ప్రమాదాలు జరుగుతున్నాయి. 

నిత్యం రద్దీ..
మండల కేంద్రంలోని ఇందిరాగాంధీ చౌరస్తా వద్ద నాలుగు గ్రామాలకు వెళ్లే రోడ్డును డబుల్‌రోడ్డుగా చేశారు. ఈ చౌరస్తా నుంచి మెట్‌పల్లి, ఇబ్రహీంపట్నం వస్తుండగా ఇబ్రహీంపట్నం నుంచి గోదూర్‌ మీదుగా నిర్మల్‌ జిల్లాకు, ఖానాపూర్‌కు ఇబ్రహీంపట్నం నుంచి మూలరాంపూర్, ఇబ్రహీంపట్నం నుంచి వర్షకొండ మీదుగా నిర్మల్‌ జిల్లాకు నిత్యం వందలాది వాహనాలు వెళ్తుంటాయి. మహారాష్ట్ర నుంచి నిర్మల్‌ జిల్లా మీదుగా ఇబ్రహీంపట్నం నుంచి ఇతర జిల్లాలకు తక్కువ దూరం అవుతున్నందున అనేక వాహనాలు వెళ్తుంటాయి.

ఇబ్రహీంపట్నం ఇందిరాగాంధీ చౌరస్తా వద్ద ఎలాంటి హెచ్చరిక బోర్డులు, స్పీడ్‌బ్రేకర్‌లు లేకపోవడంతో వాహనాలు అతివేగంగా వస్తు అప్పుడప్పుడు ప్రమాదాలు గత సంవత్సరం గోదూర్‌ వైపు నుంచి బైంసాకు వెళ్తున్న ఓ కారు బైకు ను ఢీ కొనడంతో ఓ మహిళతో పాటు యువతికి తీవ్ర గాయాలయ్యాయి. ఇదే సంవత్సరం కోమటి కొండాపూర్‌కు చెందిన భార్యభర్తలు బైక్‌పై గోదూర్‌ నుంచి కోమటికొండాపూర్‌కు వెళ్తుండగా అతివేగంగా కారును ఢీ కొట్టి కిందపడగా తీవ్రగాయాలయ్యాయి. ఈ చౌరస్తా గుండా నిత్యం బైక్‌లతో పాటు భారీ వాహనాలు అతివేగంగా వెళ్తుండడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. 

హెచ్చరిక బోర్డులు, స్పీడ్‌ బ్రేకర్లు లేకనే..
ఇందిరాగాంధీ చౌరస్తా వద్ద నాలుగు గ్రామాలకు వెళ్లే రోడ్లు ఉండడంతో నిత్యం వందలాది వాహనాలు వెళ్తుంటాయి. ఇక్కడ ఎలాంటి హెచ్చరిక బోర్డులు, స్పీడ్‌బ్రేకర్లును ఆర్‌అండ్‌బీ అధికారులు ఏర్పాటు చేయకపోవడంతో ప్రమాదాల చౌరస్తాగా మారింది. చౌరస్తా వద్ద వాహనాలు వేగంగా వెళ్లడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని మండల ప్రజలు ఆరోపిస్తున్నారు. అధికారులు ఇప్పటికైనా పట్టించుకొని హెచ్చరిక బోర్డులు, స్పీడ్‌ బ్రేకర్లు ఏర్పాటు చేసి ప్రమాదాలను అరికట్టాలని మండల ప్రజలు కోరుతున్నారు.

ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టాలి
చౌరస్తా వద్దనే మా షాపు ఉంది. నిత్యం వాహనాలు వేగంగా వెళ్లడంతో అప్పుడప్పుడు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఆర్‌అండ్‌బీ అధికారులు చౌరస్తా వద్ద ప్రమాదాలు జరగకుండా, వాహనాలు వేగంగా వెళ్లకుండా చర్యలు తీసుకోవాలి. 

– పోలకొండ సుధాకర్‌ వర్మ, ఇబ్రహీంపట్నం

ప్రతిపాదనలు పంపాం
చౌరస్తా వద్ద నాలుగుదారులకు వెళ్లే చోట హెచ్చరిక, సూచికల బోర్డులు ఏర్పాటు చేయడానికి రూ.2లక్షలతో ప్రతిపాదినలు తయారుచేసి మంజూరు కోసం పై అధికారులకు పంపాం. నిధులు మంజూరు కాగానే హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తాం.

– వేణు, ఆర్‌అండ్‌బీ, ఏఈ, మెట్‌పల్లి   

చదవండి: మద్యానికి బానిసైన కొడుకును మందలించినందుకు...

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top