వీరు మారరా..? | ACB Officials Caught Dharur SI While Taking Bribe | Sakshi
Sakshi News home page

వీరు మారరా..?

Feb 13 2025 11:43 AM | Updated on Feb 13 2025 11:47 AM

ACB Officials Caught Dharur SI While Taking Bribe

ముఖ్యమంత్రి సొంత జిల్లాలో డబ్బులిస్తేనే పని 

అక్రమార్కులకు నేతల అండదండలు 

తాజాగా రూ.30 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన ఎస్‌ఐ 

మరికొన్ని శాఖలపైనా ఏసీబీ నజర్‌  

ఒకప్పుడు అవినీతి నిరోధక శాఖ( Anti-Corruption Bureau) పేరు వినిపిస్తేనే అధికారులు హడలిపోయేవారు. ప్రస్తుతం లంచం తీసుకోవడం.. ఏసీబీకి చిక్కడం.. సాధారణమయింది. వారికి చిక్కినా మళ్లీ ఉద్యోగం ఉంటుందనే భరోసా లంచావతారులుగా మారుస్తోంది. నెల గడవక ముందే ముగ్గురు అధికారులు ఏసీబీకి చిక్కడం కలకలం రేపుతోంది.

వికారాబాద్‌/ధారూరు: ముఖ్యమంత్రి, శాసన సభాపతి సొంత ఇలాకాలో కీలక శాఖల్లో పనిచేస్తున్న అధికారులు లంచావతారులుగా మారారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలో తరచూ చోటు చేసుకుంటున్న ఘటనలు ఇందుకు బలాన్ని చేకూరుస్తున్నాయి. ధారూరు ఎస్‌ఐ, అతని డ్రైవర్‌ మంగళవారం లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కిన విషయం విదితమే. ఓ మైనర్‌ను కేసు నుంచి తప్పించడంతో పాటు మిగిలిన వారికి స్టేషన్‌ బెయిల్‌ ఇచ్చేందుకు జరిగిన ఒప్పందంలో భాగంగా ఈ డబ్బు తీసుకున్నట్లు సమాచారం.

 బాధితుడు ఏసీబీని ఆశ్రయించడంతో అవినీతి నిరోధక శాఖ( Anti-Corruption Bureau) అధికారుల బృందం వేసిన వలలో ధారూరు ఠాణా ఎస్‌హెచ్‌ఓగా పనిచేస్తున్న ఎస్‌ఐ, అతని డ్రైవర్‌ లంచం తీసుకుంటూ చిక్కారు. ఈ మేరకు వారిని బుధవారం రిమాండ్‌కు తరలించారు. గతేడాది డిసెంబర్‌లో  తాండూరులో ఓ తహసీల్దార్, ఆర్‌ఐ క్యాడర్‌ అధికారులు పెద్ద మొత్తంలో లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కి రెండు నెలలు గడవకముందే ధారూరు ఘటన జరగడంతో జిల్లా యంత్రాంగం ఒక్కసారిగా ఉలిక్కి పడింది.  

నేతల అండదండలు..? 
అవినీతి అధికారులకు నేతలు, ప్రజా ప్రతినిధుల అండదండలున్నాయనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రజాప్రతినిధులకు ముడుపులు చెల్లించి పోస్టింగులు తీసుకుని వస్తున్న అధికారులు వసూళ్లకు తెగబబడుతున్నారు. పోస్టింగ్‌కు వెచ్చించిన సొమ్ము ఎలా పూడ్చుకోవాలని కొందరి ముందు అధికారులు మొహమాటం లేకుండా చెబుతున్నారట. దీంతో ఉన్నత స్థాయి పర్యవేక్షణాధికారులకు ఇది అడ్డంకిగా మారుతోంది. న్యాయం కోసం స్టేషన్‌ మెట్లెక్కితే ఎస్‌ఐ(Dharur SI ) జలగలా పీడిస్తున్నారని.. రాజీ పేరిట బలవంతపు వసూళ్లకు పాల్పడతున్నారని వేణుగోపాల్‌ గౌడ్‌ వచి్చన నాటి ఇదే తంతు కొనసాగుతోందని ఆరోపణలున్నాయి. 

డిపార్ట్‌మెంట్‌ డ్రైవర్‌ను పెట్టుకోకుండా ప్రైవేట్‌ డ్రైవర్‌ను ఏర్పాటు చేసుకుని అక్రమ వసూళ్లు చేశారని పోలీసులే చెప్పడం గమనార్హం. డ్రైవర్‌ వసూలైన డబ్బులో చేతివాటం ప్రదర్శించడంతో కొత్త డ్రైవర్‌ను నియమించుకుని ఇసుక ట్రాక్టర్లు, లోడ్‌తో వెళుతున్న లారీల డ్రైవర్లను బెదిరించి డబ్బు వసూలు చేశాడని పలువురు ఆరోపిస్తున్నారు. నిందితులకు స్టేషన్‌ బెయిల్‌ ఇవ్వడానికి రూ.వేలల్లో వసూలు చేయడం ధారూరు ఠాణాలో చూశామని బాధితులు వాపోతున్నారు. కేసు ఏదైనా డబ్బు ముట్టజెప్పాల్సిందేనని ఫిర్యాదుదారులు, నిందితులు బాహాటంగానే చెబుతున్నారు. రెవెన్యూ, హెల్త్, పోలీస్, మున్సిపల్‌ శాఖల్లో విధులు నిర్వహించే పలువురిపై ఏసీబీ అధికారుల నిఘా కొనసాగుతున్నట్టు సమాచారం.   

ఏసీబీ వలలో జిల్లా యంత్రాంగం 
తాజాగా పోలీసు శాఖలో పనిచేసే ఎస్‌ఐ అతని డ్రైవర్‌ లంచం తీసుకుంటూ పట్టుబడగా.. ఇరవై రోజుల క్రితం తాండూరులో ఇద్దరు రెవెన్యూ అధికారులు లంచం తీసుకుంటూ పట్టబడిన విషయం తెలిసిందే. ఇలా తరచూ బాధితులు లంచావతారుల బాధలు తట్టుకోలేక ఏసీబీ అధికారులను ఆశ్రయిస్తూనే ఉన్నారు. గతంలో తాండూరులో ఓ సబ్‌ రిజిస్టార్, పరిగిలో ఎంపీడీఓ, ఈజీఎస్‌ ఉద్యోగులు, డిప్యూటీ తహసీల్దార్, వికారాబాద్‌ ఎస్పీ కార్యాలయంలో ఓ పోలీసు అధికారి, వికారాబాద్‌లో(Vikarabad) ఓ ఇంజనీర్‌  లంచాలు తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన విషయం విదితమే.

 తాజాగా పట్టుబడిన వారు పోలీసు, రెవెన్యూ శాఖలకు సంబంధించిన వారు కాగా.. మిగిలిన శాఖల్లోనే ఇదే పరిస్థితి దాపురించిందని బాధితులు వాపోతున్నారు. ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్, ఆర్‌డబ్ల్యూఎస్, మున్సిపల్, మైనింగ్, సబ్‌ రిజి్రస్టార్, ఎస్టీఓ, డీటీఓ, ఆర్టీఏ, పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌ ఏదయినా సరే పర్సెంటేజీలు వసూలు చేస్తున్నారని బాధితులు వాపోతున్నారు. వీరు చేసిన వసూళ్లో నియోజకవర్గ స్థాయి, జిల్లా స్థాయి ప్రజా ప్రతినిధులకు సైతం ముడుపులు అందుతాయని అందుకే వారు కూడా నోరుమెదపరని ఆరోపణలున్నాయి.  

జిల్లాలో మరి కొందరిపై నిఘా!
తాజా ఘటన నేపథ్యంలో ఆ శాఖ ఉన్నతాధికారులు ఘటనపై చర్చించి పునారవృతం కాకుండా చూసుకోవాలని హెచ్చరించినట్లు తెలుస్తోంది. తక్కువ ధరకు బంగారం ఇప్పిస్తామని అమాయకుల వద్ద డబ్బు తీసుకుని రూ.కోట్లతో ఉడాయించిన కేసులో దీపక్‌ వైష్టవ్‌ అనే వ్యాపారి నుంచి రూ. 30లక్షల వరకు వసూలు చేసి కేసు నీరుగార్చారనే ఆరోపణలున్నాయి. ఇటీవల ఓ ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు నమోదుకాగా అతన్ని అరెస్టు చేయకుండా ఉండేందుకు పెద్దమొత్తంలో లంచం తీసుకున్నారని సమాచారం. కేసు నమో దు చేసి 70 రోజులు గడిచినా నిందితుడిని అరె స్టు చేయకుండా తాత్సారం చేశారనే ఆరోపణలు వినిపించాయి. దీంతో ఉన్నతాధికారులు ఆ కేసు సీసీఎస్‌ పోలీసులకు అప్పగించగా వారు 24 గంటల్లో నిందితులను అరెస్టు చేశారు. 

గత డిసెంబర్‌లో ఐదుగురు ఆర్‌ఎంపీ డాక్టర్లపై మెడికల్‌ కౌన్సిల్‌ సభ్యులు కేసు నమోదు చేయగా వీరికి స్టేషన్‌ బెయిల్‌ ఇచ్చేందుకు రూ.1.10లక్షలు తీసుకున్నట్లు బాధితులు చెబుతున్నారు. వికారాబాద్‌తో పాటు పరిగి, కొడంగల్, తాండూరు సర్కిళ్ల పరిధిలోనూ కొందరు ఎస్‌హెచ్‌ఓలతో పాటు పర్యవేక్షణాధికారులమీద ఆరోపనలు వస్తున్నాయి. పరిగి సబ్‌ డివిజన్‌ పరిధిలో ఓ బోరు బండిని పట్టుకుని వదిలేసిన కేసులో, రేసింగ్‌కు వినియోగించే పావురాలను పట్టుకున్న కేసులోనూ పెద్ద మొత్తంలో ముడుపులు అందినట్టు ప్రచారం జరుగుతోంది.

 రోజు వారీగా కేసులు నమోదులో వచ్చే మామూళ్లతో పాటు కొందరు ఎస్‌హెచ్‌ఓలు నెలవారీ మామూళ్లు మాట్లాడుకుని వ్యవహారం నడిపిస్తున్నారనే విమర్శలున్నాయి.రేషన్‌ బియ్యం, కిరోసిన్, అక్రమ ఇసుక, మట్టి, కలప రవాణా చేసే వ్యక్తులతో పాటు మద్యం దుకాణాల నుంచి నెలవారీ మా మూళ్లు వసూలు చేస్తున్నట్టు ఆరోపనలు ఉన్నా యి. కాగా వారం రోజుల క్రితమే ఎస్‌ఐ వద్ద డ్రైవర్‌గా చేరిన బీరప్పను  బలిపశువు చేశారని కుటుంబ సభ్యులు మంగళవారం రాత్రి పీఎస్‌ ఎదుట ఆందోళన చేపట్టగా ఏసీబీ అధికారులు నచ్చజెప్పి ఆందోళనను విరమింపజేశారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement