స్పాట్‌ పెట్టేస్తున్నాయ్‌.. సైబరాబాద్‌ పరిధిలో 43 బ్లాక్‌స్పాట్లు! | 43 Dangerous Road Areas Under Cyberabad Police Commissionerate | Sakshi
Sakshi News home page

స్పాట్‌ పెట్టేస్తున్నాయ్‌.. సైబరాబాద్‌ పరిధిలో 43 బ్లాక్‌స్పాట్లు!

Jun 3 2026 8:13 AM | Updated on Jun 3 2026 8:13 AM

43 Dangerous Road Areas Under Cyberabad Police Commissionerate

మూడేళ్లలో 320 రోడ్డు ప్రమాదాల్లో 251 మంది మృత్యువాత

అత్యంత ప్రమాదకరంగా ఎన్‌హెచ్‌– 65 ఓల్డ్‌ ముంబై హైవే

ఈ మార్గంలో 156 ప్రమాదాలు.. 111 మంది దుర్మరణం

షార్ప్‌ కర్వ్‌లు, అసంపూర్తి రోడ్డు పనులే కారణం

సాక్షి, హైదరాబాద్‌: సైబరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో 43 ప్రమాదకర ప్రాంతాలు (బ్లాక్‌ స్పాట్స్‌) ప్రాణాంతకంగా మారాయి. గత మూడేళ్లలో 320 రోడ్డు ప్రమాదాలు జరగగా.. 251 మంది మరణించారు. మూల మలుపులు, అసంపూర్ణ రహదారి పనులు, వెలుతురు సరిగా లేకపోవడం, వాహనాల మార్గానికి అడ్డంగా చెట్లు ఉండటం వంటి కారణాలుగా గుర్తించారు. అనేక ప్రమాదకర ప్రాంతాల చుట్టూ నివాస కాలనీలు, వాణిజ్య సంస్థలు, పెట్రోల్‌ బంక్‌లు, మెట్రో కారిడార్లు ఏర్పడ్డాయి. దీంతో ఆయా మార్గాలలో పాదచారులు, స్థానిక ప్రయాణికులు నిత్యం రోడ్డు ప్రమాదాల బారిన పడుతున్నారు.

ట్రాఫిక్‌ పోలీసు అధికారులు, శాంతి భద్రతల పోలీసు స్టేషన్లు, మోటార్‌ వెహికిల్‌ ఇన్‌స్పెక్టర్లు, రోడ్‌ ఇంజినీరింగ్‌ ఏజెన్సీల బాధ్యులు బ్లాక్‌ స్పాట్లను తనిఖీ చేసి నివేదిక రూపొందించారు. గుర్తించిన ప్రమాదకర ప్రాంతాల్లో 90 శాతానికి పైగా మేడ్చల్‌ జోన్‌ పరిధిలోకి వస్తాయి. 50 శాతానికి పైగా ప్రమాదకర ప్రాంతాలలో ఎన్‌హెచ్‌–65 మార్గం అత్యంత ప్రమాదకరమైందిగా గుర్తించారు. 43 బ్లాక్‌ స్పాట్లలో 22 ముంబై హైవే (ఎన్‌హెచ్‌–65)కి చెందినవే ఉండటం గమనార్హం.

అత్యంత ప్రభావిత ప్రాంతాలివీ..

  • పటాన్‌చెరు శాంతి నగర్‌ కమాన్‌ నుంచి బజాజ్‌ ఎల్రక్టానిక్స్‌ మార్గం అత్యంత ప్రభావితమైన ప్రాంతాలలో ఒకటి. ఇక్కడ 24 ప్రమాదాలు జరగగా.. 11 మంది మరణించారు.

  • పటాన్‌చెరులోని ఇస్నాపూర్‌ క్రాస్‌ రోడ్‌లో అలాగే ఆర్సీపురంలోని శ్రీమణికాంత షాపింగ్‌ కాంప్లెక్స్‌ నుంచి ఏషియన్‌ జ్యోతి థియేటర్‌ వరకు ఒక్కో మార్గంలో 10 మరణాలు సంభవించాయి.

  • పటాన్‌చెరులోని నోవాపన్‌ టీ–జంక్షన్‌ మరో ప్రమాదకర ప్రాంతంగా నిలిచింది. ఇక్కడ 10 రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు మరణించారు.

  • ఎన్‌హెచ్‌–765డీ పై కుత్బుల్లాపూర్‌ ఎక్స్‌ రోడ్‌ నుంచి మాంగల్య షాపింగ్‌ మాల్‌ వరకు ఉన్న మార్గంలో 16 ప్రమాదాల్లో 10 మంది మృత్యువాత పడ్డారు. గండిమైసమ్మ ఎక్స్‌ రోడ్‌లో 14 ప్రమాదాల్లో 14 మంది చనిపోయారు.

  • ఎన్‌హెచ్‌–65తో పాటు అధికారులు ఎన్‌హెచ్‌–44 నాగ్‌పూర్‌ రోడ్డుపై 7, ఎన్‌హెచ్‌–765డీ మెదక్‌–నర్సాపూర్‌ రోడ్డుపై 6, స్టేట్‌ హైవే (ఎస్‌హెచ్‌–1) రాజీవ్‌ రహదారిపై ఒకటి, నల్లగండ్ల ఫైఓవర్, హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ మెయిన్‌ గేట్‌ నుంచి ఓల్డ్‌ ముంబై హైవే వరకు ఉన్న మార్గంలో 5 ప్రమాదాలతో సహా 7 ప్రమాదకర ప్రాంతాలను గుర్తించారు.

  • ఎన్‌హెచ్‌–44పై రేకులబాయి క్రాస్‌ రోడ్, భారత్‌ పెట్రోల్‌ మధ్య మార్గంలో 11 ప్రమాదాల్లో 11 మంది చనిపోయారు. మేడ్చల్‌లోని ఎస్సీ హోటల్, సంప్రదా మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి మధ్య మార్గంలో 10 యాక్సిడెంట్లలో 8 మంది మృత్యువాత పడ్డారు.

కారణాలివీ..

  • అసంపూర్తిగా ఉన్న నిర్మాణ పనుల వల్ల అనేక మార్గాలు ప్రభావితమయ్యాయి. రోడ్లను తవ్వి చాలాకాలం పాటు అసంపూర్తిగా వదిలేశారు. రోడ్లపైనే నిర్మాణ సామగ్రి పెట్టడం, దెబ్బతిన్న క్యారేజ్‌వేలు, పాక్షికంగా పూర్తి చేసిన రోడ్డు పనులు అనేక ప్రాంతాలలో రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నాయి.

  • రోడ్డు పక్కన ఉన్న చెట్లు క్యారేజ్‌వేల పైకి చొచ్చుకురావడం, చెట్లు ఎండిపోయి అనేక ప్రాంతాలలో క్యారేజ్‌వేలకు అడ్డుగా ఉన్నట్లు తనిఖీలలో పోలీసులు గుర్తించారు. మూలమలుపులు, ఎత్తుపల్లాలు ఉండటం, రాత్రి వేళల్లో ఆయా మార్గాలలో వీధి దీపాలు లేకపోవడం, ఉన్నా వెలుతురు సరిగా లేకపోవడం. రాత్రి వేళల్లో అధిక వేగంతో వాహనాలు తిరిగే హైవే మార్గాలలో హెచ్చరిక బోర్డులు లేకపోవడం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement