దారి లేక.. దవాఖానా లేక ఆగిన ఊపిరి

4 Months Baby Passed Away While Going To Hospital In Bhadradri Kothagudem - Sakshi

వాహనాలు వెళ్లేందుకు వీలులేని స్థితిలో రోడ్డు

ఏడుస్తున్న చిన్నారిని భుజాన వేసుకుని ఆస్పత్రికి వెళుతుండగా కన్నుమూత

బూర్గంపాడు: గుక్కపట్టి ఏడుస్తున్న నాలుగు నెలలు చిన్నారి బాబు.. ఎందుకు ఏడుస్తున్నాడో తెలియక ఆస్ప త్రికి తీసుకు వెళదామంటే సైకిల్‌ కూడా వెళ్లలేని స్థితిలో బురద రోడ్డు.. మరో పక్క వర్షం. చిన్నారి యాతన చూడ లేక భుజాన వేసు కుని ఆస్పత్రికి బయలుదేరిన తల్లిదండ్రులకు కడు పుకోతే మిగిలింది. బురద దారిపై వెళ్తుండగా చి న్నారి ఏడుపు ఆగిపోయినా ఆశతో ఆస్పత్రికి తీసు కెళ్లేసరికి ప్రాణం పోయిందని వైద్యులు నిర్ధారించడంతో వారి ఆవేదనకు అంతులేకుండా పోయింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గురువారం ఉదయం ఈ ఘటన జరిగింది. 

బూర్గంపాడు మండలం సారపాకకు కూతవేటు దూరంలోని శ్రీరాంపురం ఎస్టీ కాలనీకి చెందిన చెందిన శ్యామల వెంకయ్య, రత్తమ్మ దంపతులకు నాలుగు నెలల కొడుకు ఉన్నాడు. ఆ చిన్నారి గురువారం ఉదయం గుక్కపట్టి ఏడుస్తుండగా, ఆస్పత్రికి తీసుకెళ్లాలని అనుకున్నారు. అయితే ఓ పక్క భారీ వర్షం.. దానికి తోడు వీరి కాలనీ నుంచి ప్రధాన రహదారికి వెళ్లే రోడ్డు బురదతో నిండిపోయి కనీసం సైకిల్‌ కూడా వెళ్లలేని స్థితికి చేరింది.

చిన్నారి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో తల్లిదండ్రులు భుజాన వేసుకుని బురద దారిలోనే కాలినడకన బయలుదేరారు. అంతలోనే గుక్కపట్టి ఏడుస్తున్న చిన్నారి మధ్యలో ఒక్కసారిగా ఏడుపు ఆపేశాడు. ఉలుకూపలుకూ కూడా లేదు. అయినా తల్లిదండ్రులు ఉరుకులు, పరుగులపై సారపాక చేరుకుని అక్కడి నుంచి ఆటోలో భద్రాచలంలోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే బాబు మృతిచెందినట్లు వైద్యులు వెల్లడించారు. దీంతో ఆ తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. 

ఛత్తీస్‌గఢ్‌ నుంచి వచ్చి..
ఇరవై ఏళ్ల క్రితం ఛత్తీస్‌గఢ్‌కు చెందిన 150 ఆదివా సీ కుటుంబాలు సారపాకకు మూడు కిలోమీటర్ల దూరంలోని శ్రీరాంపురం కాలనీకి వచ్చి ఆవాసా లు ఏర్పాటు చేసుకున్నాయి. వీరందరికీ ఆధార్, రేషన్‌కార్డులతోపాటు ఓటుహక్కు కూడా ఉంది. అయితే అటవీ ప్రాంతంలో ఉండడంతో గ్రామాని కి తాగు నీరు, విద్యుత్‌ సహా ఎలాంటి వసతులు లేవు. సరైన దారి కూడా లేదు. అత్యవసర పరిస్థితుల్లో 108 వాహనం వచ్చే పరిస్థితి లేకపోవడంతో ఈ కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top