బెట్టింగ్‌కు బానిసై.. | 27 Year Old Man Demise Due To Online Betting In Peddapalli | Sakshi
Sakshi News home page

బెట్టింగ్‌కు బానిసై..

May 5 2025 5:51 AM | Updated on May 5 2025 5:51 AM

27 Year Old Man Demise Due To Online Betting In Peddapalli

నష్టాలతో మనస్తాపం.. యువకుడి బలవన్మరణం

బలిరామగిరి(మంథని): ఆన్‌లైన్‌ బెట్టింగ్‌కు మరో యువకుడు బలయ్యాడు. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సెంటినరీ కాలనీలో  ఆదివారం జరిగిన ఈ సంఘటనపై ఎస్‌ఐ చంద్రకుమార్‌ కథనం ప్రకారం.. సెంటినరీ కాలనీ టీ2– 185 క్వార్టర్‌లో నివసిస్తున్న వేముల విజయ, రవిశంకర్‌ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. విజయ గృహిణి కాగా, రవిశంకర్‌ ఓసీపీ–2 షావెల్‌ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. వీరి పెద్ద కుమారుడు హైదరాబాద్‌లో నివసిస్తున్నాడు. చిన్న కుమారుడు వేముల వసంత్‌ కుమార్‌ (27) ఆర్జీ–3 ఏరియా ఓసీపీ–2 పరిధిలోని సీ–5 కంపెనీలో వోల్వో ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు.

కొంతకాలంగా ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లకు అలవాటు పడ్డాడు. బెట్టింగ్‌ యాప్‌లో నష్టాలు రావడంతో.. ఇకనుంచి వాటి జోలికి వెళ్లవద్దని గతేడాది డిసెంబర్‌లో తండ్రి రవిశంకర్‌ మందలించాడు. రూ. 4 లక్షల వరకు అప్పు తీర్చాడు. కానీ మళ్లీ ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లకు పాల్పడిన వసంత్‌ కుమార్‌.. నష్టాలు రావడంతో ఎవరికీ చెప్పుకోలేక తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఆదివారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో రేకుల పైప్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

బంధువుల ఇంట్లో ఒకరు మృతి చెందడంతో.. వారిని పరామర్శించేందుకు వెళ్లి వచ్చిన దంపతులు.. కుమారుడి ఆత్మహత్యతో నిశ్చేష్టులయ్యారు. వెంటనే తేరుకుని సమీప డిస్పెన్సరీకి తరలించగా అప్పటికే వసంత్‌ కుమార్‌ మృతి చెందాడని వైద్యులు నిర్ధారించారు. కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్‌ఐ చంద్రకుమార్‌ వివరించారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం పెద్దపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 

Advertisement
 
Advertisement
Advertisement