ఆమె యాదిలో వేములవాడలో విజ్ఞాన కేంద్రం
నేడు ప్రథమ వార్షికోత్సవం
సిరిసిల్ల: ‘మా అక్క రంగవల్లి.. రగుల్ జెండావు.. పోరులో ఒరిగినావో ఓ తల్లి.. పోరులో ఒరిగినావు.. పొలికేకలయినావు.. ధనికింట్లో పుట్టిన బిడ్డా.. దళితుల్లో పెరిగీనాదీ.. సింపిరిగుడ్డల ఉన్నా.. సినిగీనా బతుకుల చూసి.. చెట్ల కిందా బతుకులాకు చేవనయి ఉంటానందీ.. గుడిసెలాకు నిట్టాడోలే.. గూడెంలో నిలిసినాదీ.. మా అక్క రంగవల్లి మా రగుల్ జెండావు..’ అంటూ.. రంగవల్లి స్మృతిగీతాలు.. ‘రగల్‌జెండా రంగవల్లి’ ఆడియో క్యాసెట్‌లో అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య రెండున్నర దశాబ్దాల కిందట పాటలను విడుదల చేసింది. ఆ పాటలు ఊరూరా.. వాడవాడనా.. మారుమోగాయి.
ఎవరీ రంగవల్లి..
రంగవల్లి సొంతూరు నిజామాబాద్ జిల్లా వర్ని మండలం వకీల్‌ఫారం. 1959 డిసెంబరు 31న గిరిజ– ఎస్‌వీఎల్. నర్సంహారావు దంపతులకు పుట్టింది. ఆమె తండ్రి నర్సింహారావు బాన్స్‌వాడ ఎమ్మెల్యేగా పనిచేశారు. బోధన్ మండలం పంటాకుర్ద్‌లో ఎస్సెస్సీ వరకు చదివింది. ఇంటర్ సీఈసీ(ఇంగ్లిష్ మీడియం) పూర్తి చేసి ఫస్ట్‌క్లాస్‌లో ఉత్తీర్ణులయ్యారు. బోధన్‌లో డిగ్రీ చదివి, ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ ఇంగ్లిష్, సైకాలజీలో పీజీలు చేశారు. అప్పటికే ఉస్మానియా యూనివర్సిటీలో బీఈ ఇంజినీరింగ్‌లో గోల్డ్‌మెడల్ సాధించిన వేములవాడకు చెందిన కూర రాజన్న అలియాస్ రాజేందర్‌తో ఉన్న స్నేహం ప్రేమగా మారి పెళ్లి చేసుకున్నారు. వారికి ఒక అబ్బాయి జన్మించాడు. కొడుకును పుట్టింటిలో వదిలిపెట్టిన రంగవల్లి అడవిబాట పట్టింది. పీడీఎస్‌యూలో చేరి.. క్రమంగా జనశక్తి సాయుధ ఉద్యమంలోకి వెళ్లారు.
26 ఏళ్ల కిందట ఎన్‌కౌంటర్..
గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో కూలీలను ఏకం చేసి భూపోరాటాన్ని సాగించిన రంగవల్లి గోదావరి లోయ ప్రతిఘటన పోరాటానికి నాయకత్వం వహించారు. సీపీఐ(ఎంఎల్) జనశక్తి రాష్ట్ర కమిటీ సభ్యురాలిగా, వరంగల్ జిల్లా జనశక్తి పార్టీ కార్యదర్శిగా పనిచేశారు. 1999 నవంబరు 11న ములుగు జిల్లా జగ్గన్నగూడెం వద్ద జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించారు. ఆమెతోపాటు జాన్‌రెడ్డి, చీపురు సంతోష్, వాంకుడోత్ అనిత ఎన్‌కౌంటర్‌లో ప్రాణాలు కోల్పోయారు. ఆమె పుట్టినిల్లు నిజామాబాద్ అయినా.. కూర రాజన్న సహచర్యంతో మెట్టినిల్లు వేములవాడ అయింది. రంగవల్లి ఎన్‌కౌంటర్‌లో అసువులుబాసి నవంబరు 11 నాటికి సరిగ్గా 26 ఏళ్లు అవుతుంది. ఈ సందర్భంగా ఆమె పేరిట నెలకొల్పిన ‘రంగవల్లి విజ్ఞాన కేంద్రం’ ప్రథమ వార్షికోత్సవం సభను ఈనెల 11న నిర్వహించాల్సి ఉండగా.. ప్రజాకవి అందెశ్రీ అంత్యక్రియలు ఉండడంతో సభను గురువారం నాడు నిర్వహిస్తున్నారు.
నేడు ఆర్‌వీకే ప్రథమ వార్షికోత్సవం..
నేడు జరిగే సభా పరిచయం పోకల సాయికుమార్(న్యాయవాద విద్యార్థి) చేయనుండగా.. అరుణోదయ విమలక్క (ఆర్‌వీకే అధ్యక్షురాలు) అధ్యక్షతన జరుగనుంది. ‘సంక్షోభ కాలం.. సామాజిక మార్పు’ అనే అంశంపై ప్రొఫెసర్ కొల్లాపురం విమల వక్తగా సమావేశం జరుగుతుంది. “ప్రజా గ్రంథాలయం ఆవశ్యకత’ అంశంపై కవి జూకంటి జగన్నాథం మాట్లాడుతారు. ఆర్‌వీకే సభ్యులు చెన్నమనేని పురుషోత్తమరావు వందన సమర్పన చేయనున్నారు. ఈ సభకు ఉమ్మడి కరీంనగర్‌తోపాటు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుంచి పలువురు హాజరుకానున్నారు.


