ఏం చేద్దాం.. ఎలా చేద్దాం? | 25 lakh acres of assigned land in Telangana | Sakshi
Sakshi News home page

ఏం చేద్దాం.. ఎలా చేద్దాం?

Jul 5 2026 4:18 AM | Updated on Jul 5 2026 4:18 AM

25 lakh acres of assigned land in Telangana

అసైన్డ్‌ భూములపై హక్కుల కల్పన విషయంలో సర్కారు తర్జనభర్జనలు 

రాష్ట్రంలో 25లక్షల ఎకరాల అసైన్డ్‌ భూమి 

పేదలకు సంపూర్ణ హక్కులు ఇవ్వడంపై మంత్రుల మధ్య కుదరని ఏకాభిప్రాయం 

పూర్తిస్థాయి అధ్యయనానికి కేబినెట్‌ సబ్‌ కమిటీ లేదా నిపుణుల కమిటీ ఏర్పాటుకు నిర్ణయం 

పీవోటీ చట్టసవరణ ముసాయిదా తయారుచేయాలని అధికారులకు ఆదేశం

సాక్షి, హైదరాబాద్‌: ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 25 లక్షల ఎకరాలు. రాష్ట్రంలోని పేదలకు దశాబ్దాలుగా ప్రభుత్వాలు పంపిణీ చేసిన భూమి ఇది. ఈ భూములపై అసైనీలకు సంపూర్ణ హక్కులు కల్పిస్తామని గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ హామీ ఇచ్చింది. అసైన్డ్‌ భూములకే కాదు దాదాపు 7 లక్షల ఎకరాల పోడు భూములపై కూడా హక్కులిస్తామని మేనిఫెస్టోలో పేర్కొంది. కానీ అధి కారంలోకి వచ్చి రెండున్నరేళ్లు అవుతుండగా..అప్పటినుంచి ఇప్పటివరకు అసైన్డ్‌ భూముల విషయంలో ఏం చేయాలి? ఎలా చేయాలి? అన్న దానిపై కాంగ్రెస్‌ ప్రభుత్వం తర్జనభర్జనలు పడుతూనే ఉంది. అయితే తాజాగా.. మంత్రివర్గ భేటీలో దీనిపై చర్చ జరిగిన నేపథ్యంలో.. దీనికి సంబంధించి పలు ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తోంది. 

హక్కుల కల్పనతో పాటు ల్యాండ్‌ పూలింగ్, రెగ్యులరైజేషన్, పరిమిత అధికారాల కల్పన లాంటి ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తున్నప్పటికీ అసైన్డ్‌ భూములు కలిగిన పేదలకు ఉచితంగా హక్కులు కల్పించాలనే నిర్ణయానికే ఎక్కువ మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. అయితే దీనిపై అన్నివిధాలా అధ్యయనం చేసేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేయాలని సూత్రప్రాయ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. మరోవైపు ఈ భూముల విషయంలో ఏం చేయాలన్నా తెలంగాణ అసైన్‌మెంట్‌ భూముల బదలాయింపు నిషేధ చట్టానికి (1977) సవరణలు చేయాల్సి ఉన్నందున చట్ట సవరణ ముసాయిదాను తయారు చేయాలని అధికారులకు ఆదేశాలిచ్చినట్టు తెలుస్తోంది.  

కేబినెట్‌లో ఏం జరిగింది? 
విశ్వసనీయ సమాచారం ప్రకారం..పేదలకు హక్కులు కల్పించడం, తదుపరి పరిణామాలు, ప్రత్యామ్నాయాలపై మంత్రివర్గ భేటీలో ఏకాభిప్రాయం కుదరలేదు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు పేదలకు సంపూర్ణ హక్కులు కల్పిస్తేనే బాగుంటుందని కొందరు అభిప్రాయపడగా, అలా చేస్తే పేదల చేతుల్లో ఉండే కొద్దిపాటి భూములు అన్యాక్రాంతమవుతాయని, కాబట్టి ప్రత్యామ్నాయాలను పరిశీలించాలని కొందరు చెప్పారు. మరికొందరు.. పూర్తి హక్కుల కల్పన కాకుండా నాలా తరహాలో భూమి వినియోగ మార్పిడి అధికారాలు కల్పిస్తే సరిపోతుందని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ద్వారా అన్ని లక్షల ఎకరాల భూమి ఒకేదఫాలో మార్కెట్‌లోకి వస్తే రియల్‌ ఎస్టేట్‌ రంగంపై ప్రభావం పడే అవకాశముందని, అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని ఇంకొందరు చెప్పారు. ఈ నేపథ్యంలో దీనిపై మంత్రివర్గం ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదు. దీనిపై పూర్తిస్థాయి అధ్యయనానికి మంత్రుల కమిటీ లేదా భూచట్టాల నిపుణులు, అధికారులతో కూడిన కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు తెలిసింది.  

హక్కుల కల్పనకు సిఫారసులు 
అసైన్డ్‌ భూములపై పేదలకు హక్కులు కల్పించాలని ప్రభుత్వానికి పలు సిఫారసులు వచ్చాయి. ధరణి పోర్టల్‌ పునర్నిర్మాణ కమిటీతో పాటు వ్యవసాయ కమిషన్‌ తమ సిఫారసులు పంపాయి. ప్రపంచ బ్యాంకు, ఇతర అరి్థక సంస్థలు, భూ విధానాలపై పనిచేసే అంతర్జాతీయ సంస్థలు కూడా ఇదే తరహా అభిప్రాయాన్ని తమ నివేదికల్లో పేర్కొన్నాయి. భూమి అమ్మకాలు, కొనుగోళ్లపై ఆంక్షలు ఉండకూడదని, అలా ఉండడం పేదల ఆర్థికాభివృద్ధికి అడ్డంకిగా మారుతుందని, దేశ ఆర్థిక వృద్ధి కూడా నెమ్మదిస్తుందని వెల్లడించాయి. మార్కెట్‌లోని ఇతర వస్తువులు మాదిరిగా ల్యాండ్‌ మార్కెట్‌ కూడా సరళంగా ఉండాలని, అలా ఉన్నప్పుడే పేదలకు న్యాయం జరుగుతుందనే అభిప్రాయం కూడా ఈ నివేదికల్లో వ్యక్తమైంది.  

తర్వాతి పరిణామాలపై మల్లగుల్లాలు 
ఇంతవరకు బాగానే ఉన్నా.. హక్కుల కల్పన తర్వాత ఏం జరుగుతుందన్న దానిపైనే ప్రభుత్వ పెద్దలు ప్రధానంగా మల్లగుల్లాలు పడుతున్నట్టు సమాచారం. ముఖ్యంగా గత 20 ఏళ్ల కాలంలో దేశ వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీల చేతుల్లో ఉన్న భూకమతాల సంఖ్య తగ్గిపోతోందని పలు నివేదికలు చెపుతున్నాయని, తెలంగాణలోనూ ఇదే పరిస్థితి ఏర్పడే అవకాశం ఉందని, పేదలకు భూములు లేకుండా పోతాయనే అభిప్రాయంతో ఉన్నట్టు తెలుస్తోంది. అలాగే కొందరు మంత్రులు అభిప్రాయపడినట్టుగా.. ఇంత పెద్ద మొత్తంలో భూములు ఒకేసారి మార్కెట్‌లోకి వస్తే రియల్‌ ఎస్టేట్‌ రంగం ఒడిదుడుకులకు లోనవుతుందనే మీమాంస కూడా ప్రభుత్వ పెద్దలను అయోమయంలో పడేస్తోందనే చర్చ జరుగుతోంది.  

రెండు ప్రధాన ప్రత్యామ్నాయాలు..! 
ఒకవేళ పేదలకు అసైన్డ్‌ భూములపై సంపూర్ణ హక్కులు కల్పించని పక్షంలో ప్రభుత్వం ముందు రెండు ప్రధాన ప్రత్యామ్నాయాలు ఉన్నట్టు సమాచారం. కాగా ఇవి రెండూ గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో పరిశీలించినవే కావడం గమనార్హం. అందులో ల్యాండ్‌ పూలింగ్‌ (పేదల వద్ద ఉన్న అసైన్డ్‌ భూములను ప్రభుత్వమే సమీకరించి వారికి ఆ భూమిలో సంపూర్ణ హక్కులు కల్పిస్తూ కొంత భాగం ఇవ్వడం) ఒకటి కాగా ఈ విషయంలో సాంకేతిక సమస్యలు వచ్చాయి. దీంతో ల్యాండ్‌ పూలింగ్‌ అంశాన్ని అధ్యయనం చేయాలని కాంగ్రెస్‌ ప్రభుత్వం భావిస్తోంది. ఇదిలావుండగా అసైనీల చేతుల నుంచి దాదాపు 10 లక్షల ఎకరాల వరకు అన్యాక్రాంతమైనట్టుగా గణాంకాలు ప్రభుత్వం వద్ద ఉన్నాయి. ఈ నేపథ్యంలో పేదల వద్ద ఉన్న అసైన్డ్‌ భూములను వారికి ఉచితంగానే ఇచ్చేసి, ఇతరుల చేతుల్లో ఉన్న భూములను ప్రభుత్వ విలువకు క్రమబద్ధీకరించే వీలుంది. ఇలా చేయడం ద్వారా ప్రభుత్వ ఖజానాకు రూ.30 వేల కోట్ల వరకు ఆదాయం సమకూరుతుందనే అంచనాలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో అసైన్డ్‌ భూముల విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. 

చిక్కులున్నా హక్కులు కల్పిస్తే మేలు 
అసైన్డ్‌ భూముల విషయంలో చాలా చిక్కులున్నాయి. భూరికార్డులు సరిగా లేవు. పట్టా మార్పిడి జరగడం లేదు. కొత్త పుస్తకాలు రావడం లేదు. విస్తీర్ణంలో వ్యత్యాసాలున్నాయి. ఈ రికార్డులను సరిచేసి పేదలకు భద్రమైన భూమి హక్కులు కల్పించగలగాలి. భూముల జియో ట్యాగింగ్‌ చేయాలి. తాత్కాలిక భూదార్‌ ఇవ్వాలి. ఆ తర్వాత అన్నీ సరి చేసి శాశ్వత భూదార్‌ ఇవ్వాలి. ఏది ఏమైనా పేదలకు అసైన్‌ చేసిన భూమిపై వారికి పూర్తి హక్కులు ఇస్తే మేలు జరుగుతుంది. 25 లక్షల ఎకరాల భూమిలో అందరూ అమ్ముకోవాలనుకునే వారుండరు. 
– ఎం.సునీల్‌కుమార్, భూచట్టాల నిపుణుడు   

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement