బీటెక్‌లో ప్రమోషన్‌కు 20 క్రెడిట్స్..! | 20 credits for promotion in BTech | Sakshi
Sakshi News home page

బీటెక్‌లో ప్రమోషన్‌కు 20 క్రెడిట్స్..!

May 21 2025 4:44 AM | Updated on May 21 2025 4:44 AM

20 credits for promotion in BTech

త్వరలో అన్ని వర్సిటీలకు ఒకే విధానం 

సెకెండియర్‌లో ఫస్టియర్‌ బ్యాక్‌లాగ్స్‌లేకుండా చూసుకోవాలి 

అధికారుల నివేదికకు కేబినెట్‌ సబ్‌ కమిటీ ఆమోదం.. ఈ ఏడాది నుంచే అమల్లోకివచ్చే అవకాశం 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల్లో ఏకీకృత ప్రమోషన్‌ విధానాన్ని ప్రవేశ పెట్టనున్నారు. కనీసం 20 క్రెడిట్స్‌ ఉంటే ప్రమోట్‌ చేయనున్నారు. సాంకేతిక విద్య అధికారులతో కూడిన కమిటీ ఈ మేరకు తాజాగా ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. దీన్ని కేబినేట్‌ ఉప కమిటీ ఆమోదించినట్టు, 2025–26 విద్యా సంవత్సరం నుంచే ఇది అమల్లోకి రానుందని విశ్వసనీయంగా తెలిసింది. కొన్ని రోజుల క్రితం అన్ని విశ్వవిద్యాలయాల వీసీలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఏకీకృత విధానం అమలుపై ఇందులో ఏకాభిప్రాయం కుదిరింది. 

ఇంజనీరింగ్‌లో ఒక ఏడాది తర్వాత మరో ఏడాదికి వెళ్లేందుకు (ప్రమోట్‌ అయ్యేందుకు) ఒక్కో యూనివర్సిటీలో ఒక్కో విధానం ఉంది. దీనివల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని వర్సిటీల అధికారులు చెబుతున్నారు. గత అసెంబ్లీ సమావేశాల్లో కొంతమంది సభ్యులు సైతం ఈ అంశం సభ దృష్టికి తెచ్చారు. దీనిపై స్పందించిన ప్రభుత్వం.. ఏకీకృత విధానం అమలుపై అధికారుల నుంచి నివేదిక కోరింది. 

ప్రస్తుతం హైదరాబాద్‌  జేఎన్‌టీయూహెచ్‌లో అనుసరిస్తున్న విధానాన్ని ప్రామాణికంగా తీసుకోవాలని వర్సిటీల ఉప కులపతులు అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో ప్రధానంగా ఉస్మానియా, మహాత్మాగాం«దీ, జేఎన్‌టీయూహెచ్, కాకతీయ యూనివర్సిటీల పరిధుల్లో ఇంజనీరింగ్‌ విద్య కొనసాగుతోంది.  

ఒక్కో చోట ఒక్కో విధానం 
ఉస్మానియా, మహాత్మాగాంధీ వర్సిటీల్లో బీటెక్‌ మొదటి ఏడాది నుంచి రెండో ఏడాదికి వెళ్లాలంటే విద్యార్థి ఫస్టియర్‌లో 50 శాతం క్రెడిట్స్‌ సాధించాలి. కానీ జేఎన్‌టీయూహెచ్, కాకతీయ విశ్వవిద్యాలయాల్లో 25 శాతం క్రెడిట్స్‌ పొందితే సరిపోతుంది. ఆ తదుపరి సంవత్సరాల్లో ప్రమోట్‌ కావాలన్నా ఒక్కో వర్సిటీలో ఒక్కో క్రెడిట్‌ విధానం ఉంది. 

ఒక్కో సెమిస్టర్‌కు 20 చొప్పున ఏడాదికి 40 క్రెడిట్స్, నాలుగేళ్ళకు కలిపి మొత్తం 160 క్రెడిట్స్‌ ఉంటాయి. ఒక్కో వర్సిటీకి ఒక్కో విభిన్నమైన సిలబస్‌ ఉండటం వల్ల కూడా క్రెడిట్‌ విధానంలో తేడా ఉంటోంది. సిలబస్, పీరియడ్స్‌ను బట్టి 3 లేదా 4 చొప్పున క్రెడిట్స్‌ ఉంటాయి. జేఎన్‌టీయూహెచ్‌లో ఫస్టియర్‌ ఇంజనీరింగ్‌లో ఐదు థియరీ సబ్జెక్టులు, 3 ల్యాబ్‌లు ఉంటాయి. 

ఒక సబ్జెక్టు పాసయితే దానికి సంబంధించిన క్రెడిట్స్‌ విద్యార్థి ఖాతాలో పడతాయి. అయితే ఎక్కడ తేలికగా ప్రమోట్‌ అవుతారో ఆ యూనివర్సిటీలను విద్యార్థులు ఎంచుకుంటున్నారు. జేఎన్‌టీయూహెచ్‌ కన్నా ఉస్మానియా యూనివర్సిటీలో ప్రమోట్‌ కావడం కష్టమని విద్యార్థులు భావిస్తున్నారు. 

20 క్రెడిట్స్‌ ఉంటే ప్రమోట్‌ 
ప్రస్తుతం కనీసం 20 క్రెడిట్స్‌ ఉంటే తర్వాతసంవత్సరానికి ప్రమోట్‌ చేసే విధానంతెచ్చే యోచనలో ఉన్నారు. అంటే ఏటా ఆ ఏడాదికి సంబంధించిన సగం క్రెడిట్స్‌ విద్యార్థి సాధించాల్సి ఉంటుంది. దీంతోపాటే క్రెడిట్స్‌ విధానాన్ని మార్చాలని భావిస్తున్నారు. తొలి ఏడాది ఇంజనీరింగ్‌లో చేరిన విద్యార్థికి రెండో సంవత్సరంలో సబ్జెక్టుపై కాస్త అవగాహన ఉంటుంది. 

కాబట్టి రెండో సంవత్సరంలో ఫస్టియర్‌ బ్యాక్‌లాగ్స్‌ లేకుండా చూసుకోవాలి. మూడో సంవత్సరం నుంచి 40% క్రెడిట్స్‌ సాధించాలి. ఇక ఆఖరి ఏడాదిలో పూర్తి క్రెడిట్స్‌ పొంది ఉండాలనే విధానం ఖరారు చేసినట్టు సమాచారం. నాలుగు వర్సిటీల అధికారులు ఇప్పటికే ఈ విధానంపై కసరత్తు పూర్తి చేశారు. త్వరలో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు. విద్యాశాఖ అంగీకారం పొందాక దీన్ని అమల్లోకి తెస్తారని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.      

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement