పంద్రాగస్టు వచ్చిందంటే ఆ ఘాతుకం యాదికొస్తది.. కొబ్బరికాయ కొడుతున్న సమయంలో

17 Years For Mla Chittem Narsi Reddy 10 Others Killed In Maoist Attack At Narayanpet - Sakshi

సాక్షి, నారాయణపేట: నారాయణపేటలో పంద్రాగస్టు వచ్చిందంటే చాలు 2005, ఆగస్టు 15న జరిగిన మావోయిస్టుల ఘాతుకం ప్రతి ఒక్కరి మనసు కలచివేస్తోంది. ఈ ఘటనలో ఎమ్మెల్యే చిట్టెం నర్సిరెడ్డి, తనయుడు చిట్టెం వెంకటేశ్వర్‌రెడ్డితో పాటు మరో తొమ్మిది మంది మావోయిస్టుల తూటాలకు బలయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. అప్పటి ఎమ్మెల్యే నర్సిరెడ్డి మధ్యాహ్నం 1.25 గంటల సమయంలో పట్టణంలోని హరిజనవాడలో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసి పక్కనే ఉన్న ఆంజనేయస్వామి ఆలయ ప్రాంతంలో సీసీ రోడ్డు పనులు ప్రారంభించేందుకు కొబ్బరికాయ కొడుతున్న సమయంలో ఆ ప్రాంతంలో అప్పటికే కాపుకాసిన మావోయిస్టులు ఏకే 47తో కాల్పులు జరిపారు.

ఈ ఘటనలో ఎమ్మెల్యేతో పాటు మరో తొమ్మిది మంది మృతిచెందగా తనయుడు చిట్టెం వెంకటేశ్వర్‌రెడ్డి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతిచెందిన వారిలో ఎమ్మెల్యే చిట్టెం నర్సిరెడ్డి, తనయుడు వెంకటేశ్వర్‌రెడ్డి, అప్పటి మున్సిపల్‌ కమిషనర్‌ డీవీ రామ్మోహన్, గన్‌మెన్‌ రాజారెడ్డి, డ్రైవర్‌ శ్రీనివాసులు, ఆర్డీఓ కార్యాలయం అటెండర్‌ సాయిబన్న, మాగనూర్‌ మండలం యూత్‌ కాంగ్రెస్‌ నాయకుడు లోకేశ్వర్‌రెడ్డి, ఊట్కూర్‌ మండల తిప్రాస్‌పల్లికి చెందిన కాంగ్రెస్‌ నాయకుడు మోనప్పగౌడ్, రవీందర్‌గౌడ్‌ ఉన్నారు.

ఆ తర్వాత కొద్దిరోజుల వ్యవధిలోనే  ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నారాయణపేటకు చెందిన దూడం విజయ్‌కుమార్, చిట్టెం వెంకటేశ్వర్‌రెడ్డి వాహన డ్రైవర్‌ ఆరీఫ్‌ మృతిచెందారు. ఈ ప్రమాదంలో అప్పటి ఆర్డీఓ శివారెడ్డి, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ సుదర్శన్‌రెడ్డి, దివంగత నేత ఘన్‌శ్యాందాస్‌ధరక్, ఎమ్మెల్యే పీఏ భాస్కర్, అవుటి రాజశేఖర్, నాగేందర్, లొట్టి శ్రీనివాస్, సూరి గాయపడి త్రుటిలో తప్పించుకున్న వారిలో ఉన్నారు. 

వైఎస్సార్‌ దిగ్భ్రాంతి.. 
ఈ వార్త విన్న అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. వెంటనే అప్పటి పీసీసీ అధ్యక్షుడు కేశవరావు, ఎంపీ జైపాల్‌రెడ్డి ప్రత్యేక హెలికాప్టర్‌లో అదేరోజు సాయంత్రం నారాయణపేటకు చేరుకొని ప్రభుత్వ ఆస్పత్రిలో ఉన్న ఎమ్మెల్యే ఇతరుల మృతదేహాలను చూసి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం ఉద్యోగ అవకాశాలు కల్పించారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top