
కర్నూలు జిల్లా: ఇద్దరు వ్యాపారస్తుల మధ్య నెలకొన్న పోటీతో ఆదివారం చికెన్ చౌక ధరకు లభించింది. కోడుమూరులోని బళ్లారి రోడ్డులో ఇటీవల కర్నూలుకు చెందిన ఓ వ్యాపారి నూతనంగా చికెన్ వ్యాపారం ప్రారంభించాడు. తన వ్యాపారం వృద్ధి చేసుకునేందుకు మార్కెట్ రేటు కంటే తక్కువకు చికెన్ అమ్మకాలను చేపట్టాడు. దీంతో అప్పటికే చికెన్ వ్యాపారం చేస్తున్న మరో వ్యాపారి కూడా ఆ వ్యాపారి ఇచ్చే రేటు కంటే తక్కువగా చికెన్ అమ్ముతూ వస్తున్నాడు.
ఈ క్రమంలో ఆదివారం కర్నూలుకు చెందిన వ్యాపారి కిలో చికెన్ రూ.110 పెట్టగా, స్థానిక పాత వ్యాపారి రూ.10 తగ్గించి రూ.100కే కిలో చికెన్ అంటూ బోర్డు పెట్టాడు. దీంతో జనం బారులు తీరారు. పట్టణ వాసులతో పాటు, చుట్టు పక్కల గ్రామాల ప్రజలు సైతం కోడుమూరుకు వచ్చి చికెన్ కొనుగోలు చేశారు. ప్రస్తుతం మార్కెట్లో కిలో చికెన్ ధర రూ.180 పలుకుతుండగా, స్కిన్ లెస్ చికెన్ రూ.200 పలుకుతోంది.