Loknath Reddy Vs Niranjan Reddy: వనపర్తి: ‘పదవులపై.....

- - Sakshi

వనపర్తి: ‘పదవులపై వ్యామోహంతోనో.. అక్రమార్జన కోసమో రాజకీయాల్లో కొనసాగడం లేదు. మావంతుగా ప్రజలకు సేవ చేద్దామని వస్తే.. అడుగడుగునా ఆంక్షలు, అడ్డంకులు సృష్టిస్తూ ఉద్దేశపూర్వకంగా కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. ఆత్మాభిమానం చంపుకోలేక.. పార్టీలో ఉండలేక రాజీనామా చేస్తున్నాం..’ అని జెడ్పీచైర్మన్‌ లోక్‌నాథ్‌రెడ్డి, మరికొంతమంది ప్రజాప్రతినిధులు వెల్లడించారు. గురువారం ఖిల్లాఘనపురం మండలం సల్కెలాపూర్‌లో విలేకర్ల సమావేశం ఏర్పాటుచేశారు. ఈమేరకు జెడ్పీచైర్మన్‌, ఇద్దరు ఎంపీపీలు, 11 మంది సర్పంచులు, ఆరుగు ఎంపీటీసీ సభ్యులు, పలువురు ఉపసర్పంచులు, సింగిల్‌విండో మాజీ అధ్యక్షులు, డైరెక్టర్లతో కలిసి రాజీనామా పత్రాలపై సంతకాలు చేసి బీఆర్‌ఎస్‌ జిల్లా పార్టీ అధ్యక్షుడికి పంపించారు. అనంతరం జెడ్పీచైర్మన్‌ విలేకర్లతో మాట్లాడారు.

తాను రాజకీయాలకు వచ్చింది డబ్బు సంపాదించడానికి, పదవులు అనుభవించడానికి కాదని, నా వంతుగా ప్రజలకు మంచి చేయాలని రెండు దశాబ్దాలుగా పలు పదవుల్లో కొనసాగుతున్నానన్నారు. కానీ, పంచాయతీ వార్డు సభ్యుడి నుంచి జెడ్పీచైర్మన్‌ వరకు అందరి విధులు తానే చేయాలని మంత్రి అనుకోవడం, నిధుల ఖర్చు కూడా తాను చెప్పినట్లే చేయాలనుకుంటే మేమంతా ఎందుకు అని ప్రశ్నించారు. రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో పాలన ఇలాగే ఉందా.. ఒక్క వనపర్తిలోనే ఉందా అని ప్రశ్నించారు.

జిల్లా ఏర్పాటు తర్వాత తొలి జెడ్పీ చైర్మన్‌గా పదవీ బాధ్యతలు చేపట్టి గ్రామీణ ప్రాంతంలో విద్య, వైద్య సౌకర్యాలను మెరుగుచేయాలని ప్రమాణస్వీకారం చేసిన నాడే సంకల్పించుకున్నానని ఆయన అన్నారు. కానీ ఏ పనిచేసేందుకు ముందుకెళ్లినా ఆంక్షలు పెడుతూ జెడ్పీకి ప్రభుత్వం కేటాయించిన నిధులు సైతం తాను చెప్పిన పనులకు వెచ్చించాలని చెప్పగా దానిని ప్రశ్నించానన్నారు. నాటి నుంచి కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతూ కార్యక్రమాలకు రానివ్వకుండా, కనీసం మాట్లాడేందుకు సమయం ఇవ్వలేదన్నారు. అలాగే, నిధులు వెచ్చించేందుకు సమావేశాలకు జెడ్పీటీసీలను రానివ్వకుండా పార్టీని వీడేలా చేసింది మంత్రి కాదా అని ప్రశ్నించారు. రేపటి నుంచి ప్రజాక్షేత్రంలోకి వెళ్లి వారి అభిప్రాయం మేరకు ఏ పార్టీలో చేరాలి, కార్యాచరణ ఏమిటనే విషయం వెల్లడిస్తానని లోక్‌నాథ్‌రెడ్డి అన్నారు.

రూ.కోట్లు వెచ్చించి సాగునీరు తెప్పించాం

రూ.కోట్లు వెచ్చించి రాత్రింబవళ్లు కష్టపడి దగ్గరుండి కాల్వల పనులు చేయించి సాగునీళ్లు తీసుకొస్తే.. బినామీ పేర్లతో ఎంబీలు చేసుకుని నిధులు, నీళ్ల నిరంజన్‌రెడ్డి అనే పేరును మంత్రి తెచ్చుకున్నాడని పెద్దమందడి ఎంపీపీ మేఘారెడ్డి విమర్శించారు. నియోజకవర్గంలో కాల్వలు తవ్వి న అంశం, నీళ్లు ఎలా వచ్చాయనే విషయంపై చర్చకు వస్తే.. తాను ఎప్పుడైనా రెడీ అని సవాలు విసిరారు. పాలన రాష్ట్రంలో ఒకలా.. వనపర్తిలో ఒకలా నడుస్తోందని, ఎమ్మెల్యే కార్యాలయంలో ఒకే కుర్చీ ఉంటుందని, ప్రజాప్రతినిధులు, అధికారులు అంటే అంత చులకన ఎందుకని ప్రశ్నించారు. తామంతా సహకరించి 2018 ఎన్నికల్లో పని చేస్తేనే ఎమ్మెల్యేగా గెలుపొందావనే విషయం మంత్రి విస్మరించటం సరికాదన్నారు.

విభజించి పబ్బం గడపడం సరికాదు

చిన్న కుగ్రామం నుంచి జిల్లా కేంద్రం వరకు ప్రతిచోట రెండు గ్రూపులుగా నాయకులను విభజించి పబ్బం గడుపుకోవడం మంత్రి హోదాకు తగదని, అభివృద్ధి పనులు చేసింది లేదు, నిధులు ఇచ్చింది లేదు.. చివరికి గౌరవం లేకుండా ప్రవర్తించడం ఏమిటని వనపర్తి ఎంపీపీ కిచ్చారెడ్డి ప్రశ్నించారు. 25 ఏళ్లుగా ఓటమిలేని నాయకుడిగా ఎదిగిన నేను.. అభివృద్ధి పనుల కోసం ఈ సారైనా అధికార పక్షంలో ఉండాలని, మీ ఆహ్వానం మేరకు గులాబీ కండువా కప్పుకున్నానని, కానీ ఏ హామీ నెరవేర్చలేదన్నారు. సొంత పార్టీ యువకుడిని పోలీసులతో ఇష్టానుసారంగా కొట్టించటమా సుపరిపాలన అంటే అని ప్రశ్నించారు. ఇదిలాఉండగా, రాజీనామా చేసిన ప్రజాప్రతినిధులతోసుమారు వంద మందికిపైగా కార్యకర్తలు వారి వెంట ఉన్నారు. రాజీనామా చేసిన వారిలో ప్రధానంగా మాజీ జెడ్పీటీసీ సభ్యులు రమేష్‌గౌడ్‌, మాజీ సింగిల్‌ విండో అధ్యక్షుడు ఐ.సత్యారెడ్డి, సాయిచరణ్‌రెడ్డి ఉన్నారు.

Read latest Jogulamba News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top