వేలూరు: క్యూఎస్ ప్రపంచ విశ్వవిద్యాలయాల ర్యాంకింగ్ జాబితాలో సస్టైనబిలిటీ విభాగంలో వేలూరు వీఐటీ విశ్వవిద్యాలయం ప్రపంచవ్యాప్తంగా 293వ స్థానాన్ని, భారతదేశంలో 5వ స్థానాన్ని సాధించింది. ఈ సందర్భంగా వేలూరు వీఐటీ యూనివర్సిటీ ఛాన్సలర్ జి. విశ్వనాథన్ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్న వివరాలు.. ప్రపంచ విశ్వవిద్యాలయాల సస్టైనబిలిటీ విభాగానికి సంబంధించిన ర్యాంకింగ్ జాబితాను క్యూఎస్ సంస్థ విడుదల చేసింది. సస్టైనబిలిటీ విభాగంలో పర్యావరణ ప్రభావం, సామాజిక ప్రభావం, పాలన అనే మూడు ప్రధాన ప్రమాణాల ఆధారంగా ర్యాంకింగ్ నిర్ణయిస్తారు. పర్యావరణ ప్రభావం విభాగంలో సస్టైనబిలిటీ, విద్య, పరిశోధనలను, సామాజిక ప్రభావం విభాగంలో సమానత్వం, జ్ఞాన మార్పిడి, విద్యా ప్రభావం, ఉపాధి, ఆరోగ్య సంక్షేమం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. మూడవదిగా పాలన అనే ప్రమాణాన్ని ఆధారంగా చేసుకుని ర్యాంకింగ్ లెక్కిస్తారు. క్యూఎస్ ప్రపంచ విశ్వవిద్యాలయాల ర్యాంకింగ్ జాబితాలో సస్టైనబిలిటీ విభాగంలో మొత్తంగా 81.2 పాయింట్లు సాధించిన వీఐటీ విశ్వవిద్యాలయం గత ఏడాదితో పోలిస్తే 59 స్థానాలు మెరుగుపడి ప్రపంచవ్యాప్తంగా 293వ స్థానాన్ని సాధించింది. భారతదేశంలో 5వ స్థానంలో నిలిచింది. 2025లో ప్రపంచవ్యాప్తంగా 352వ స్థానంలో, భారతదేశంలో 7వ స్థానంలో నిలిచి వీఐటీ ప్రత్యేకతను చాటుకుంది. 2027 ఎడిషన్‌లో క్యూఎస్ ప్రపంచ విశ్వవిద్యాలయ ర్యాంకింగ్ జాబితాలో సుమారు 2,000 విశ్వవిద్యాలయాలను మూల్యాంకనం చేశారు. ఇందులో వీఐటీ విశ్వవిద్యాలయం ప్రపంచంలోని టాప్ 300 విశ్వవిద్యాలయాల జాబితాలో స్థానం సంపాదించింది. వీఐటీ క్యాంపస్‌లోని సోలార్ కార్ల పార్కింగ్ ప్రదేశంలో 441 కిలోవాట్ల సోలార్ ప్యానెల్ రూఫ్ నిర్మాణాన్ని ఏర్పాటు చేశారు. దీని ద్వారా ఏటా 650 మెగావాట్ గంటల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. అలాగే సంవత్సరానికి 470 టన్నుల కార్బన్ డయాకై ్సడ్ ఉద్గారాలను నివారిస్తున్నారు. ఒకసారి మాత్రమే ఉపయోగించే ప్లాస్టిక్ వస్తువులను పూర్తిగా నిషేధించారు. విద్యార్థుల హాస్టళ్లలో సేకరించే ఆహార వ్యర్థాలను రీసైకిల్ చేసి 200 కిలోవాట్ గంటల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. ప్రతి సంవత్సరం 15 టన్నుల చెక్క వ్యర్థాలను కూడా ఇంధనంగా మారుస్తున్నారు. వీఐటీ క్యాంపస్ మొత్తం చెట్లను నాటి పచ్చదనంతో కళకళలాడుతోంది. దీంతో స్థానిక, కాలానుగుణ పక్షులకు ఇది ఆశ్రయంగా నిలుస్తోందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.


