పళ్ళిపట్టు: దీపావళి పురస్కరించుకుని పళ్లిపట్టులో బాణసంచా దుకాణాల్లో అధికారుల బృందం శుక్రవారం తనిఖీ చేపట్టారు. దేశవ్యాప్తంగా నవంబర్ 8న దీపావళి పండుగ సందర్భంగా బాణసంచా విక్రయాలు ఊపందుకున్నాయి. పళ్లిపట్టులోని ఐదు పర్మినెంట్ బాణసంచా దుకాణాల్లో సబ్ కలెక్టర్ సత్యమూర్తి ఆధ్వర్యంలో ఆరోగ్యశాఖ జిల్లా అధికారి ప్రియ, తహసీల్దారు మలర్‌విళి, అగ్నిమాపక శాఖ అధికారి సంపత్ తదితరుల బృందం దుకాణాల్లో తనిఖీ చేపట్టి దుకాణం పర్మిట్ సర్టిఫికెట్లను పరిశీలించి దుకాణంలో ఏర్పాటు చేసిన భద్రత ఏర్పాట్లు, వాహనాలు నిలిపేందుకు స్థలం, అనుమతించిన మొత్తంలో పేలుడు పదార్ధాలు నిల్వకు సంబందించి తనిఖీలు చేపట్టారు. బహిరంగ ప్రదేశాల్లో బాణసంచా విక్రయించరాదని, ముందస్తు జాగ్రత్తలు పాటించి నియమ నిబంధనలకు లోబడి టపాసుల వ్యాపారం చేపట్టాలని అధికారులు దుకాణాదారులకు సూచించారు. తాత్కాలిక బాణసంచా దుకాణాలకు సంబంధించి తనిఖీలు పూర్తిచేసి అర్హత వున్న తాత్కాలిక దుకాణాలకు నవంబర్ 1న అనుమతులు ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు.


