సివప్పు నక్షత్రం చిత్రానికి
తమిళ సినిమా: లీహరి పిక్చర్స్ పతాకంపై పీ.చిన్నతంబి, హరిశంకర్ కలిసి నిర్మిస్తున్న చిత్రం సివప్పు నక్షత్రం. ఈ చిత్రం టైటిల్‌ను దర్శక నటుడు సముద్రఖని తన సామాజిక మాధ్యమం ద్వారా విడుదల చేసి, మంచి సామాజిక దృక్పథంతో రూపొందిస్తున్న కథా చిత్రం అంటూ యూనిట్ సభ్యులను అభినందించారు. చిత్రం మంచి విజయాన్ని సాధించాలని శుభాకాంక్షలు తెలిపారు. ప్రకృతిలోని వనరులన్నీ మానవుల ఆకలిని తీర్చడానికే. అంతేకాని వాటిని కూడబెట్టి కృత్రిమ కొరతను కలిగించడానికి కాదు. ఇలాంటి చర్యలను పట్టించుకోకుండా బానిసల్లా బతికేస్తే సమస్యే ఉండదు. ఇందుకు వ్యతిరేకంగా జీవిస్తే అన్నీ సమస్యలే. ప్రేమ, విప్లవం, రాజకీయం, ఆర్థికపరమైన అంశాలు ఇతివృత్తంగా రూపొందుతున్న చిత్రం సివప్పు నక్షత్రం అని యూనిట్ వర్గాలు మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఇందులో డల్‌హౌసీ ప్రభు కథా నాయకుడిగా నటిస్తూ కథ, కథనం, మాటలు, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్నారు. నటి వర్ష నాయకిగా నటిస్తోంది. ఇందులో పోలీస్ అధికారిగా ఓకే.సుందర్, న్యాయమూర్తిగా కరు.పళనియప్ప, ప్రతి నాయకులుగా సిద్ధార్థ్, ధీరన్, బాలమురుగన్, డెల్టా వీరన్ నటిస్తున్నారు. పీకే ఛాయాగ్రహణంను, డీసీ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రం నిర్మాణ దశలో ఉంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు యూనిట్ వర్గాలు పేర్కొన్నారు.
తమిళ సినిమా: నటుడు జీవా కథా నాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం తగప్పన్. దీన్ని లార్క్ స్టూడియోస్ పతాకంపై కే.కుమార్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఆర్.వెంకట్ దర్శకత్వం వహిస్తున్నారు. నటి రజీషా విజయన్ నాయకిగా నటిస్తోంది. సంగీత దర్శకుడు అనిరుద్ తదితర ప్రముఖులు వద్ద పనిచేసిన ఇండిపెండెంట్ సంగీత దర్శకుడు మార్షల్ రాబిన్సన్ ఈ చిత్రానికి సంగీతాన్ని, టీ.ఉదయ్‌కుమార్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. తలైవన్ తంబి తలైమైయిల్ వంటి విజయవంతమైన చిత్రం తర్వాత నటుడు జీవా పూర్తిగా మదురై నేపథ్యంలో నటిస్తున్న చిత్రం ఇదని యూనిట్ వర్గాలు మీడియాకు తెలిపాయి. తండ్రి, కొడుకు మధ్య అనుబంధాన్ని ఆవిష్కరించే ఈ చిత్రం భావోద్వేగాలతో కూడిన కుటుంబ కథాంశంతో రూపొందుతున్నట్లు చెప్పారు. తెన్నావట్టు చిత్రం తర్వాత జీవా నటిస్తున్న గ్రామీణ కథా చిత్రం ఇదనీ, ఇది ఆయన సినీ కెరీర్‌లో ప్రత్యేకంగా నిలిచిపోతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ చిత్రానికి సంగీతం అదనపు బలంగా ఉంటుందన్నారు. చిత్రం విడుదలకు ముందే ఆడియో హక్కులను థింక్ మ్యూజిక్ సంస్థ, శాటిలైట్ హక్కులను జీ తమిళ్, ఓటీటీ హక్కులను జీ 5 సంస్థ కొనుగోలు చేసినట్లు చెప్పారు. మదురైలో షూటింగ్ నిర్వహిస్తున్న సమయంలో ఆ ప్రాంత ప్రజలు గుంపులు గుంపులుగా వచ్చి చూసి చిత్రం బాగుంటుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారని పేర్కొన్నారు. ప్రస్తుతం షూటింగ్‌ను పూర్తి చేసుకుని నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని డిసెంబర్ 24వ తేదీన విడుదల చేయనున్నట్లు యూనిట్ వర్గాలు అధికారికంగా విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.
తగప్పన్ చిత్రం విడుదల తేదీ ఖరారు


