డెంగీతో బాలుడి మృతి
కొరుక్కుపేట: పల్లాడంలో డెంగీతో నాలుగేళ్ల బాలుడు మృతి చెందాడు. తిరుప్పూర్ జిల్లాలోని పశ్చిమ పల్లాడంకు చెందిన ప్రవీణ్‌కుమార్ కుమారుడు తమిళ (4), అతను పల్లాడంలోని వడుగపాలయంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్నాడు. అతను గత కొన్ని సంవత్సరాలుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు. కొన్ని రోజులుగా జ్వరంతో బాధపడుతూ పల్లాడంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తూ వస్తున్నారు. వైద్య పరీక్షల అనంతరం, అతనికి డెంగీ జ్వరం ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. అతను కోయంబత్తూరు ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నాడు. ఈ పరిస్థితుల్లో తమిళ్‌కు చికిత్స చికిత్స ఫలించక, శుక్రవారం రాత్రి మరణించాడు.
యువకుడి పై దాడి
పళ్ళిపట్టు: యువకుడిపై దాడిచేసి హత్య బెదిరింపులకు పాల్పడ్డ టీవీకే కార్యకర్తను పోలీసులు అరెస్టు చేశారు. ఆర్కేపేట సమీపంలోని రాజానగరం గ్రామానికి చెందిన సత్య (28) శుక్రవారం రాత్రి కేజీ.కండ్రిగ నుంచి బైకులో ఇంటికి వెళ్లుతుండగా, కృష్ణాకుప్పానికి చెందిన మాజీ సైనికుడు, టీవీకే కార్యకర్త కార్తికేయన్(38) సత్యను చూసి అసభ్య పదజాలాలతో మాట్లాడినట్లు, ప్రశ్నించడంతో దాడికి పాల్పడినట్లు దీంతో అక్కడ నుంచి బైకులో వెళ్లిన సత్యను కార్తికేయన్ వెంబడించి ఆర్కేపేట బజారులో అడ్డుకుని దాడిచేసి హత్య బెదిరింపులు చేసినట్లు గాయపడ్డ సత్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన ఆర్కేపేట పోలీసులు కార్తికేయన్‌ను శనివారం అదుపులోకి తీసుకున్నారు.
రోడ్డు రోలర్‌లో
డీజిల్ చోరీ
తిరుత్తణి: రోడ్డు రోలర్‌లో డీజిల్ చోరీ చేసిన డ్రైవర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. చైన్నె తిరుపతి జాతీయ రహదారి విస్తరణ పనులు ఓ ప్రైవేటు సంస్థ ద్వారా జరుగుతున్నాయి. తిరుత్తణి వద్ద రోడ్డు విస్తరణ పనుల కోసం ఉత్తరప్రదేశ్‌కు చెందిన రాజ్‌కేశరి(27) రోడ్డు రోలర్ డ్రైవర్‌గా పనిచేసేవాడు. అతను శుక్రవారం మురుక్కంపట్లు వద్ద రోడ్డు రోలర్ నుంచి 60 లీటర్ల డీజిల్ చోరీ చేస్తుండగా ప్రయివేటు సంస్థ మేనేజర్ సత్యనారాయణన్ రెడ్ హ్యేండడ్‌గా పట్టుకుని పోలీసులకు అప్పగించారు. తిరుత్తణి పోలీసులు కేసు నమోదు చేసి రాజ్‌కేశరిని అరెస్టు చేశారు.
అవగాహన ర్యాలీ
అన్నానగర్: చెంగల్పట్టు జిల్లా మానసిక ఆరోగ్య ప్రాజెక్ట్ తరపున జిల్లా వైద్య శాఖ ఆధ్వర్యంలో, ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా శుక్రవారం మధురాందకంలో అవగాహన ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీకి మధురాందకం ఎమ్మెల్యే మరగదం కుమారవేల్ తదితరులు ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరై, మానసిక అనారోగ్యాన్ని నిర్మూలించడానికి ప్రతిజ్ఞ చేశారు. దీని అనంతరం, ఎమ్మెల్యే కళాశాల విద్యార్థుల అవగాహన ర్యాలీని ప్రారంభించారు.మధురాంతకం బస్టాండ్ నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ, ప్రధాన రహదారుల గుండా సాగి మధురాంతకం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ముగిసింది. ఇందులో పాల్గొన్న ప్రైవేట్ కళాశాలల విద్యార్థులు మానసిక అనారోగ్యం, మద్యపానం, డిప్రెషన్, అనుమానాస్పద మరణాలు, మతిమరుపు వంటి నినాదాలతో కూడిన బ్యానర్లను ప్రదర్శించి, ప్రజలలో అవగాహన కల్పించారు. ఈ ర్యాలీకి చెంగల్పట్టు జిల్లా డాక్టర్ మలర్ విళన్‌తో పాటు పలువురు వైద్యులు, నర్సులు పాల్గొన్నారు.
తిరుత్తణి ఆలయ జాయింట్ కమిషనర్‌గా నిత్య
తిరుత్తణి: తిరుత్తణి సుబ్రహ్మణ్యస్వామి ఆలయ జాయింట్ కమిషనర్‌గా నిత్య నియమితులైయ్యాయి.ఈ మేరకు హిందు దేవాదాయ శాఖ కార్యర్శి రాజారామన్ ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటి వరకు తిరుత్తణి ఆలయ జాయింట్ కమిషనర్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ వచ్చిన రమణి, చైన్నెలోని హిందుదేవాదాయ శాఖ కార్యాలయం భాగం 3 కు స్థాన చలనం కల్పించారు. ఆమె స్థానంలో చైన్నెలోని తిరువెళ్లిక్కుని పార్థసారథి ఆలయ డిప్యూటీ కమిషనర్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ వచ్చిన నిత్య పదోన్నతి పొంది తిరుత్తణి ఆలయ జాయింట్ కమిషనర్‌గా నియమితులయ్యారు. ఆమె త్వరలో కొత్త బాధ్యతలు స్వీకరించనున్నారు.
ఇద్దరు మానసిక వికలాంగులైన బాలికలు అదృశ్యం
అన్నానగర్: చైన్నెలోని పుళల్ సమీపంలో ఉన్న కదిర్వేడు సత్యమూర్తి నగర్ ప్రాంతంలో బాలికల కోసం ఒక ఉచిత ఆశ్రమం ఉంది. ఇది 2017 నుండి నడుస్తోంది. ఈ ఆశ్రమం మానసిక వికలాంగులైన బాలికలు, తల్లిదండ్రులచే విడిచిపెట్టబడిన బాలికలతో సహా 36 మంది పిల్లలను సంరక్షిస్తోంది. వీరిలో, అగల్య (15), దివ్య (14) అనే ఇద్దరు బాలికలు 21వ తేదీ రాత్రి ఆశ్రమంలోని మొదటి అంతస్థు లో ఉన్న చెట్టు పై నుంచి కిందకు దిగిపోయినట్లు తెలుస్తోంది. చాలా చోట్ల వెతికినా వారి ఆచూకీ లభించలేదు. ఈ నేపథ్యంలో, ఆశ్రమం నిర్వాహకురాలు శైలజ భాస్కర్ పుళల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి, ఆ ఇద్దరు బాలికల కోసం గాలిస్తున్నారు. ఆశ్రమం నుంచి బాలికలు అదృశ్యం కావడంతో ఆ ప్రాంతంలో కలకలం ఏర్పడింది.


