సాక్షి, చైన్నె: తక్కువ వసతులు ఉన్న గిరిజన వర్గాలకు సుస్థిర ఇంధన పరిష్కారాలను అందించే దిశగా ఒక ప్రతిష్టాత్మక అడుగు పడింది. సి.కె. కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, సుస్థిర అభివృద్ధి మండలి సంయుక్తంగా తమిళనాడులోని ఊటీలో ’ప్రాజెక్ట్ రే...సుస్థిర వీధి దీపాల మిషన్‌ను ప్రారంభించాయి. ఏస్ డీసీ పర్యావరణ , సుస్థిరత విభాగమైన ’సీరక్కు’ ప్రతిపాదించిన ఈ సత్సంకల్పంలో భాగంగా, నీలగిరి జిల్లా గూడలూరు తాలూకాలోని కూడమూల గిరిజన గ్రామంలో 20 సౌరశక్తితో పనిచేసే వీధి దీపాలను ఏర్పాటు చేసి మొదటి దశను విజయవంతంగా పూర్తి చేశారు. సుమారు 120 గిరిజన కుటుంబాలు నివసిస్తున్న కూడమూల గ్రామంలో ఇప్పటివరకు కేవలం నాలుగు వీధి దీపాలు మాత్రమే ఉండేవి. ప్రసిద్ధ ముదుమలై టైగర్ రిజర్వ్ అటవీ సరిహద్దుల్లో ఉన్న ఈ గ్రామంలో చీకటి పడిన తర్వాత అడవి జంతువుల సంచారం వల్ల గ్రామస్తులు బయటకు రావడానికి తీవ్ర భయాందోళనలు చెందేవారు. ఈ సమస్యకు పరిష్కారంగా గ్రామానికి వచ్చే ప్రధాన ప్రవేస,నిష్క్రమణ మార్గాలు, పాదచారుల దారులు, పాఠశాల విద్యార్థులు సంచరించే ముఖ్యమైన ప్రాంతాలలో విద్యుత్ గ్రిడ్‌తో సంబంధం లేకుండా స్వతంత్రంగా పనిచేసే సోలార్ వీధి దీపాలను అమర్చారు. దీనివల్ల రాత్రి వేళల్లో రాకపోకలు సురక్షితంగా మారడమే కాకుండా, అడవి జంతువుల సంచారాన్ని ముందే గుర్తించే అవకాశం గ్రామస్తులకు కలిగింది. ఈప్రారంభోత్సవ కార్యక్రమానికి అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ శ్రీనివాసన్, మున్సిపల్ ఇంజినీర్ త్యాగరాజన్ ముఖ్య అతిథులుగా హాజరై దీపాలను ప్రారంభించారు. ఈఈ పర్యావరణ విభాగం డైరెక్టర్ దినేష్ ఎస్.పి., ఆ విద్యాసంస్థ ప్రిన్సిపల్ డా. శరవణన్ ఎస్, ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు.
గిరిజన విద్యార్థులకు
‘సోలార్ ల్యాంప్స్’ తయారీలో శిక్షణ
వీధి దీపాల ఏర్పాటుతో పాటు, యునెస్కో యూత్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ ‘‘డూ ఇట్ యువర్ సెల్ఫ్ – సోలార్ ల్యాంప్ ఇనిషియేటివ్ కింద ఒక ప్రత్యేక శిక్షణా కార్యక్రమాన్ని ఈ సందర్భంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌డీసీ ఛైర్‌పర్సన్, సి.కె. గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అముధవల్లి రంగనాథన్ మాట్లాడుతూ విద్య , సంస్థాగత పురోగతి యొక్క నిజమైన విలువ సమాజానికి ఉపయోగపడినప్పుడే సార్థకమవుతుందన్నారు. ఒకరి జీవితాన్ని ఉన్నతీకరించినప్పుడు తరతరాలను ఉన్నతీకరించవచ్చని బలంగా నమ్ముతున్నానని పేర్కొన్నారు. భవిష్యత్‌లో కూడా స్థానిక అవసరాలను బట్టి విద్య, సాంకేతికత, నైపుణ్యాభివృద్ధి వంటి రంగాలలో గిరిజన యువతను సాధికారులను చేయడానికి మా ప్రయత్నాలు కొనసాగుతాయన్నారు.


