సాక్షి,చైన్నె : కేరళలోని ఒక స్పాలో బలవంతంగా వ్యభిచార ఊబిలోకి నెట్టబడి, తీవ్ర లైంగిక వేధింపులకు గురైన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యువతిని కేరళ పోలీసులు రక్షించారు. ఈ దారుణ ఘటనకు సంబంధించిన కేసును తమిళనాడు పోలీసులు కూడా సీరియస్‌గా తీసుకుని, వండలూరు మహిళా పోలీస్ స్టేషన్ ద్వారా దర్యాప్తును వేగవంతం చేశారు. తల్లిదండ్రులను కోల్పోయిన ఓ యువతి, తన బంధువు ఒకరి ద్వారా కేరళకు వెళ్లింది. అక్కడ నకిలీ పత్రాలను సృష్టించి తన వయసు 20 ఏళ్లుగా చూపించి, కేరళలోని తిరువనంతపురం సమీపంలోని తిరువల్లం కోవలం ప్రాంతంలో స్పాలో చేర్పించారు. ఆ యువతిని అక్కడ బలవంతంగా వ్యభిచార ఊబిలో దించారు. అయితే కోవలంకు తరలించే ముందు, ఆమెను చైన్నె సమీపంలోని గుడువాంచేరి ప్రాంతంలోని ఒక ప్రైవేట్ నివాసంలో బంధించి, గత ఏప్రిల్, మే నెలల్లో తీవ్రమైన లైంగిక వేధింపులకు గురిచేశారని తెలింది.ఆ వ్యభిచార కూపం నుండి పారిపోవడానికి ప్రయత్నిస్తున్న సమయంలో కేరళ పోలీసులు ఆ యువతిని రక్షించి, కోవలం స్పా నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. కోవలం పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి, గుడువాంచేరి ప్రాంతంలో జరిగిన నేరానికి సంబంధించిన కేసును తదుపరి విచారణ నిమిత్తం వండలూరు మహిళా పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. బాధితురాలు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా, చైన్నె గుడువాంచేరిలో ఆ యువతిని ఎక్కడెక్కడ బంధించారు, ఈ మానవ అక్రమ రవాణా, లైంగిక వేధింపుల వెనుక ఉన్న అసలు ముఠా సభ్యులు ఎవరు అనే కోణంలో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
చైనా– వియత్నాం మీదుగా తూత్తుకుడికి రవాణా సేవలు
సాక్షి, చైన్నె : భారతదేశం, చైనా, వియత్నాంను అనుసంధానిస్తూ తూత్తుకుడి వి.ఓ. చిదంబరనార్ పోర్టుకు కొత్త నేరుగా సాగే కార్గో కంటైనర్ నౌక సేవలు ప్రారంభమయ్యాయి. రీజినల్ కంటైనర్ లైన్ ద్వారా ఏర్పాటైన ఈ కొత సేవలో భాగంగా ఎం.వి. నవత బూమ్ అనే కార్గో నౌక తొలిసారిగా తూత్తుకుడి పోర్టుకు చేరుకుంది. ఈ ఓడకు పోర్ట్ అథారిటీ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. ఈమేరకు వీవోసీ పోర్ట్ అథారిటీ ఛైర్మన్ సుశాంత్ కుమార్ పురోహిత్ స్పందించారు.
నౌక వివరాలు – ప్రయాణ మార్గం
147.82 మీటర్ల పొడవు, 23.38 మీటర్ల వెడల్పు గల ఈ భారీ నౌక ఒకేసారి 1,100 కంటైనర్లను రవాణా చేసే సామర్థ్యం కలిగి ఉంది. ఇది చైనా లోని కిన్జౌ పోర్ట్ నుండి బయలుదేరి, వియత్నాంలోని హైఫాంగ్, చూ లాయ్ పోర్టులు, భారతదేశంలోని కాట్టుపల్లి మీదుగా తూత్తుకుడికి చేరుకుంటుంది. చైనాలోని కిన్జౌ నుండి వియత్నాంకు 13 రోజులు, వియత్నాం నుండి తూత్తుకుడికి 12 రోజుల సమయం పడుతుంది. ప్రస్తుతం ఈ సర్వీస్ వారానికి రెండుసార్లు నడుస్తోంది. ఎగుమతిదారులు, దిగుమతిదారుల డిమాండ్‌ను బట్టి ఈ సేవల ఫ్రీక్వెన్సీని మరింత పెంచనున్నారు. ఈ కొత్త మార్గం వల్ల దక్షిణ చైనా, వియత్నాంలతో సముద్ర అనుసంధానం బలపడటమే కాకుండా, సోలార్ ప్యానెల్ తయారీ, ఎలక్ట్రిక్ వాహనాల రంగాలకు అదనపు వ్యాపార అవకాశాలు లభిస్తాయి. 2026–27 ఆర్థిక సంవత్సరంలో (ఏప్రిల్–సెప్టెంబర్) వివోసీ పోర్ట్ 4.42 లక్షల కంటైనర్లను నిర్వహించి, గతేడాదితో పోలిస్తే 3.18% వృద్ధిని నమోదు చేసింది. మూడో కంటైనర్ టెర్మినల్ , ఔటర్ హార్బర్ ప్రాజెక్ట్‌లు పూర్తయితే భారతదేశ తూర్పు తీరంలో తూత్తుకుడి పోర్ట్ ప్రధాన కంటైనర్ హబ్‌గా అవతరిస్తుందని అధికారులు పేర్కొన్నారు.
ఉమ్మిడి ఎతిరాజ్ కన్నుమూత
సాక్షి, చైన్నె : చారిత్రాత్మక సెంగోల్ రూపకర్త ఉమ్మిడి ఎతిరాజ్ (101) చైన్నెలో వయోభారంతో బుధవారం కన్నుమూశారు. ఈ సమాచారంతో ప్రధాని నరేంద్రమోదీ తన సంతాపం తెలియజేశారు. ఆయన పార్తీవ దేహానికి సాయంత్రం బీసెంట్‌నగర్ స్మశాన వాటికలో అంత్యక్రియలు జరిగాయి.ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలియజేయడంతో ఈ మేరకు ఎతిరాజ్ కుమారులు అమరేంద్రన్, జితేంద్ర ఉమ్మిడి ఒక ప్రకటన విడుదల చేశారు. దేశ సాంస్కతిక వారసత్వానికి, జాతి నిర్మాణానికి ఉమ్మిడి ఎతిరాజ్ అందించిన అసాధారణ సేవలను గుర్తించి, ఆయనకు ప్రధాని నరేంద్ర మోదీ నివాళులు అర్పించడం తమకు ఎంతో గర్వకారణమని పేర్కొన్నారు. 101 సంవత్సరాల అద్భుతమైన జీవితాన్ని గడిపిన ఉమ్మిడి ఎతిరాజ్ 1947లో రూపొందించిన చారిత్రాత్మక సెంగోల్ రూపంలో ఎప్పటికీ చిరస్మరణీయంగా నిలుస్తారని తెలిపారు. నేడు ఆ సెంగోల్ పార్లమెంట్‌లో లోక్‌సభ స్పీకర్ పీఠం వెనుక సగర్వంగా నిలబడి, ధర్మం, న్యాయం, దేశ శాశ్వత విలువలకు ప్రతీకగా నిలుస్తోందని కొనియాడారు. ఆయన మృతికి సంతాపం వ్యక్తం చేస్తూనే, భారత చరిత్రపై చెరగని ముద్ర వేసిన ఒక మహోన్నత జీవితాన్ని తలచుకుని తాము గర్విస్తున్నట్లు తెలిపారు.


