అవినీతి రహిత పోలీసు శాఖే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

అవినీతి రహిత పోలీసు శాఖే లక్ష్యం

Oct 22 2026 7:08 AM | Updated on Oct 22 2026 7:08 AM

● పోలీస్‌ స్టేషన్ల రోజువారీ ఖర్చుల నిధి రూ. 71 కోట్లకు పెంపు ● ప్రభుత్వం జీవో జారీ

సాక్షి, చైన్నె : తమిళనాడులో అవినీతి రహిత పాలన అందించడంలో భాగంగా , పోలీస్‌ స్టేషన్ల రోజువారీ నిర్వహణను మరింత పారదర్శకంగా మార్చేందుకు సీఎం జోసఫ్‌ విజయ్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని అన్ని పోలీస్‌ స్టేషన్ల రోజువారీ చిల్లర, ఆకస్మిక ఖర్చుల నిధిని భారీగా పెంచుతూ మొత్తం రూ. రూ. 71.01 కోట్లు కేటాయిస్తూ ఉత్తర్వులను బుధవారం జారీ చేశారు. 2026–27 పోలీస్‌ శాఖ పద్దుల కేటాయింపు సమయంలో అసెంబ్లీలో సీఎం ఇచ్చిన హామీ మేరకు ఈ చర్యలు చేపట్టినట్లు ప్రభుత్వం ప్రకటించింది. పోలీస్‌ స్టేషన్లలో స్టేషనరీ, రవాణా, కేసుల విచారణ, నిర్వహణ ఖర్చుల కోసం అధికారులు అనధికార మార్గాలపై (లంచాలు లేదా బయటి నిధులపై) ఆధారపడే పరిస్థితిని తొలగించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. అలాగే పోలీస్‌ స్టేషన్ల ఖర్చులకే నిధుల కొరత ఏర్పడితే అవినీతికి దారితీసే అవకాశం ఉన్నందున, ప్రభుత్వమే నేరుగా కేటాయింపులను పెంచి అవినీతి రహిత వాతావరణాన్ని సృష్టించేందుకు చర్యలు తీసుకున్నారు. మహిళలు, పిల్లలకు సురక్షిత వాతావరణం కల్పించడం, సైబర్‌ నేరాలు, మాదకద్రవ్యాల నిర్మూలనలో పోలీసుల పనితీరును మరింత వేగవంతం చేయడం, పోలీస్‌ స్టేషన్లలో నమోదయ్యే నేరాల సంఖ్య , పనిభారం ఆధారంగా వాటిని మూడు వర్గాలుగా విభజించి, నెలకు ఇచ్చే అలవెన్స్‌లను భారీగా పెంచారు. కేటగిరి ఒకటిలో ఇది వరకు రూ. 3,750గా ఉన్న ఖర్చును తాజాగా రూ. 30 వేలకు , కేటగిరి 2లో రూ. 6 వేలుగా ఉన్నఖర్చును రూ. 40 వేలకు, కేటగిరి 3లో రూ. 8,250గాఉన్న ఖర్చును రూ. 50 వేలుగా పెంచారు. ఇదిలా ఉండగా మరోవైపు గ్రామీణ ఉపాధి పథకం 100 రోజుల నుంచి 125 రోజులకు పెంచేందుకు రూ. 100 కోట్లను కేటాయిస్తూ సీఎం విజయ్‌ మరో ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఈ పెంపు కంటి తుడుపు చర్య అని, ఈ మొత్తం ఏ మూలకూ సరిపడదని పీఎంకే అధ్యక్షుడు అన్బుమణి రాందాసు అసంతృప్తిని వ్యక్తంచేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement