సాక్షి, చైన్నె: తిరుప్పూర్ జిల్లా ధారాపురం నియోజకవర్గ ఉప ఎన్నికల గొడవ తాజాగా అక్కడ రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించింది. నామ్ తమిళర్ కచ్చి (ఎన్‌టీకే ) తరఫున పోటీ చేసిన అభ్యర్థి, ఆ పార్టీ రాష్ట్ర మహిళా విభాగం కార్యదర్శి కార్తీక, ఆమె భర్త మురుగ కుమారవేల్ సహా మొత్తం 10 మందిని పోలీసులు అరెస్టు చేశారు. రహదారి దిగ్బంధనం, పోలీస్ స్టేషన్ ముట్టడి , అధికారుల విధుల నిర్వహణకు అంతరాయం కలిగించినందుకు గానూ వారిపై ఐదు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
నేపథ్యం ఇదీ..
ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం విజయ్ ధారాపురంలో పర్యటించిన సమయంలో, సీఎం ప్రయాణించే మార్గంలో నామ్ తమిళర్ పార్టీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను, బోర్డులను పోలీసులు తొలగించారు. వీటి తొలగింపును నిరసిస్తూ ఎన్‌టీకే అభ్యర్థి కార్తీక , పార్టీ నిర్వాహకులు రోడ్డుపై బైఠాయించి తీవ్ర నిరసన తెలిపారు. అనంతరం దారాపురం పోలీస్ స్టేషన్ వద్ద గందరగోళం సృష్టించి, ఆందోళన చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన ఆధారంగా కార్తీక దంపతులతో సహా 11 మందిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. కాగా కోయంబత్తూరులో ఉన్న కార్తీక, ఆమె భర్తను ప్రత్యేక పోలీసు బృందం బుధవారం వేకువ జామున అదుపులోకి తీసుకుని, వైద్య పరీక్షల కోసం దారాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కార్తీకను నైటీలోనే ఉండగా అ రెస్టు చేయడం వివాదానికి దారి తీసింది. తాము ఇంట్లో నిద్రిస్తుండగా 5 గంటలకు పోలీసులు వచ్చి తనను తన భర్తను అరెస్టు చేశారని కార్తీక ఆవేదన వ్యక్తంచేశారు. డ్రస్సు కూడా మార్చుకోనివ్వకుండా అరెస్టు చేశారన్నారు. కార్తీకతో పాటు ఇసై మదివానన్, సంజయ్ గాంధీ, మూలనూర్ కందస్వామి, షేక్‌పరీద్, సూర్య, గోకుల్ తదితర ముఖ్య నిర్వాహకులను వివిధ ప్రాంతాల్లో అరెస్టు చేశారు. ఈ అరెస్టును డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ తీవ్రంగా ఖండించారు. అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ప్రతిపక్ష నాయకులను అరెస్టు చేయడం టీవీకే ప్రభుత్వ సంకుచిత మనస్తత్వానికి నిదర్శనమని ఆరోపించారు. నామ్ తమిళర్ కట్చి నేత సీమాన్ స్పందిస్తూ, అక్రమ కేసులు బనాయించి అరెస్టులు చేయడం టీవీకే ప్రభుత్వ దిగజారుడు రాజకీయామని, ఈ ప్రభుత్వానికి ప్రజలే తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. పీఎంకే నాయకుడు అన్బుమణి, డీఎండీకే నేత ప్రేమలత, ఏఎంఎంకే టీటీవీ దినకరన్, ప్రధాన ప్రతి పక్ష నేత ఉదయనిధి స్టాలిన్, ఎంపీ కనిమొళి తదితరులు కూడా ఈ అరెస్టులను తీవ్రంగా తప్పుపట్టారు.


