ఇప్పట్లో స్థానిక సంస్థల ఎన్నికలు లేనట్టే..! | - | Sakshi
Sakshi News home page

ఇప్పట్లో స్థానిక సంస్థల ఎన్నికలు లేనట్టే..!

Oct 22 2026 7:08 AM | Updated on Oct 22 2026 7:08 AM

● 28 జిల్లాల్లో ప్రత్యేక అధికారుల పదవీకాలం పొడిగింపు

సాక్షి, చైన్నె: తమిళనాడులో స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పట్లో నిర్వహించే అవకాశాలు లేదన్నది తాజాగా స్పష్టమైంది. వార్డుల పునర్విభజన, సరిహద్దుల నిర్ధారణ పనులు పూర్తి కాకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం 28 జిల్లాల్లోని స్థానిక సంస్థల ప్రత్యేక అధికారుల పదవీకాలాన్ని మరో 6 నెలల పాటు 2027 ఏప్రిల్‌ 19 వరకు పొడిగించింది. అదే సమయంలో కాంచీపురం, చెంగల్పట్టు, తిరునెల్వేలి సహా 9 జిల్లాలకు కొత్త ప్రత్యేక అధికారులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా 28 జిల్లాల్లో గ్రామ పంచాయతీలు, పంచాయతీ యూనియన్లు, జిల్లా పరిషత్తులలోని స్థానిక ప్రతినిధుల పదవీ కాలం గత ప్రభుత్వ హయంలోనే ముగిసిన విషయం తెలిసిందే. ఎన్నికల నిర్వహణలో జాప్యంతో ప్రత్యేక అధికారులను గత పాలకులు రంగంలోకి దించారు.వీరి పదవీ కాలం అక్టోబర్‌ 19న ముగిసింది. దీంతో మరోసారి పాలనా కాలాన్ని పొడిగించారు.

9 జిల్లాలకు ప్రత్యేక అధికారులు

కొత్తగా ఏర్పాటైన కాంచీపురం, చెంగల్పట్టు, విల్లుపురం, కల్లకురిచ్చి, వెల్లూరు, రాణిపేట, తిరుపత్తూరు, తిరునెల్వేలి, తెన్కాసి జిల్లాల్లో ప్రతినిధుల పదవీకాలం ఇటీవల ముగియడంతో 6 నెలల కాలానికి ప్రత్యేక అధికారులను నియమించారు. గ్రామ పంచాయతీలకు సబ్‌–డివిజనల్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్లు పంచాయతీ యూనియన్లుకు గ్రామీణాభివృద్ధి శాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్లు, జిల్లా పరిషత్తులకు, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థలు , అదనపు కలెక్టర్లు, జాయింట్‌ డైరెక్టర్లు లేదా ప్రాజెక్ట్‌ డైరెక్టర్లు ప్రత్యేక అధికారులుగా ఉంటారు. ఇదిలా ఉండగా ఎన్నికల నిర్వహణకు జాప్యంగురించి అధికార వర్గాలు పేర్కొంటూ, 46 గ్రామీణ స్థానిక సంస్థలను పట్టణ ప్రాంతాల్లో విలీనం చేయడం , కొత్తగా సరిహద్దులను సవరించే పనులు జరుగుతున్నాయని వివరించారు. గ్రామీణాభివృద్ధి శాఖ 9 కొత్త పంచాయతీ యూనియన్లు, 93 కొత్త గ్రామీణ పరిపాలను ఖరారు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చిందని వివరిస్తూ ఇదికూడా ఓ కారణంగా తెలిపారు. అలాగే కోర్టు ఆదేశాల ప్రకారం ఎస్సీ, ఎస్టీ మహిళల రిజర్వేషన్లు, వార్డుల పునర్విభజన ప్రక్రియ పూర్తిగా ముగిసిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement