అభయ్‌ సింగ్‌కు సీఎం విజయ్‌ అభినందనలు | - | Sakshi
Sakshi News home page

అభయ్‌ సింగ్‌కు సీఎం విజయ్‌ అభినందనలు

Sep 28 2026 7:51 AM | Updated on Sep 28 2026 7:51 AM

● లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కై లాసనాథన్‌ ● సౌందర కై లాసం స్మతిలో రూ. 2 లక్షల సాహిత్య పురస్కారం

సాక్షి, చైన్నె: జపాన్‌లో జరుగుతున్న 20వ ఆసియా క్రీడల్లో పురుషుల సింగిల్స్‌ స్క్వాష్‌ విభాగంలో రజత పతకం సాధించిన తమిళనాడు క్రీడాకారుడు అభయ్‌ సింగ్‌ను సీఎం విజయ్‌ అభినందించారు. ఈ మేరకు ఆయన సోషల్‌ మీడియా వేదికగా అభినందనలు తెలుపుతూ ప్రత్యేక ప్రకటన విడుదల చేశారు. ఇందులో జపాన్‌ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడలలో అభయ్‌ సింగ్‌ అద్భుత ప్రతిభ కనబరిచి పురుషుల సింగిల్స్‌ స్క్వాష్‌లో రజత పతకం గెలవడం తమిళనాడుతో పాటు దేశం మొత్తానికే గర్వకారణమని సీఎం ప్రశంసించారు. అభయ్‌ సింగ్‌ సాధించిన ఈ విశిష్ట విజయాన్ని గుర్తించి, తమిళనాడు ప్రభుత్వం తరఫున రూ. 50 లక్షల భారీ నగదు ప్రోత్సాహకాన్ని అందజేయనున్నట్లు ప్రకటించారు. అభయ్‌ సింగ్‌ విజయం రాష్ట్రంలోని యువ క్రీడాకారులు, క్రీడాకారిణులకు గొప్ప స్ఫూర్తినిస్తుందని, భవిష్యత్తులోనూ ఆయన మరిన్ని అంతర్జాతీయ పతకాలు సాధించి దేశకీర్తిని ఇనుమడింపజేయాలని ఆకాంక్షించారు. కాగా, ఇప్పటికే పలువురు తమిళ క్రీడాకారులు ఆసియా క్రీడలలో మెరిసిన విషయం తెలిసిందే. వారందరికీ ప్రభుత్వం తరపున అందజేయనున్న ప్రోత్సాహం గురించి ఈసందర్భంగా సీఎం గుర్తు చేశారు.

పుదుచ్చేరి – కేరళ విమాన

సర్వీసుల విస్తరణ

సాక్షి, చైన్నె: పుదుచ్చేరిని కేరళలోని వివిధ ప్రాంతాలు, మాహేతో అనుసంధానించేందుకు విమాన సర్వీసులను ప్రారంభించే ఆలోచనలో ఉన్నామని పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కై లాసనాథన్‌ తెలిపారు. పుదుచ్చేరి కేరళ సమాజ్‌ ఆధ్వర్యంలో జరిగిన ఓనం కుటుంబ సమేత మేళా వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా ఆదివారం పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, కేంద్ర ప్రభుత్వ ఉడాన్‌ పథకం కింద పుదుచ్చేరి నుండి కన్నూర్‌, కోలికోడ్‌, కొచ్చిలకు ప్రత్యక్ష విమాన సర్వీసులను ప్రారంభించే ప్రతిపాదనలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ఇందు కోసం పుదుచ్చేరి విమానాశ్రయ రన్‌వేను 2,500 మీటర్లకు విస్తరించనున్నట్లు ప్రకటించారు. దీని ద్వారా భవిష్యత్తులో భారీ అంతర్జాతీయ విమాన సర్వీసులను నడపడానికి అవకాశం ఏర్పడుతుందని, విల్లియనూరు వద్ద కొత్త రైల్వే టెర్మినల్‌ ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధం చేశామని, దీనికోసం కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ రూ. 2,000 కోట్లు కేటాయించేందుకు అంగీకరించిందని లెఫ్టినెంట్‌ గవర్నర్‌ స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య బీమా పథకం కింద 70 ఏళ్లు పైబడిన వయోవృద్ధులకు రూ. 5 లక్షల వరకు ఉచిత వైద్య బీమా అందుతోందని, అర్హులైన వారందరికీ ఈ ప్రయోజనం దక్కేలా కేరళ సమాజ్‌ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియల్లో సహాయపడాలని కోరారు.

ఘనంగా ‘సడవు’ పుస్తకావిష్కరణ

కొరుక్కుపేట: యువ రచయితలను ప్రోత్సహించేందుకు తమిళ సాహిత్య సంఘం ప్రతి సంవత్సరం ’ సౌందరకై లాసం సాహిత్య పురస్కారం’ అనే పేరుతో నవలల పోటీని నిర్వహిస్తుంది. ప్రతిసారీ ఈ పోటీల కోసం ముగ్గురు సభ్యులతో కూడిన న్యాయనిర్ణేతను ఏర్పాటు చేసి, ఉత్తమ నవలలను ఎంపిక చేసి పురస్కారాలు అందజేస్తారు. ఈ విషయంలో, రచయిత ఎస్‌. ఏక్‌ నాథ్‌రాజ్‌ రచించిన ’సడవు’ నవల 2025 సంవత్సరానికి గాను సౌందర కై లాష్‌ సాహిత్య పురస్కారాన్ని గెలుచుకుంది. చైన్నెలోని ’కవిత పబ్లిషింగ్‌ హౌస్‌’లో ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో, మాజీ కేంద్ర మంత్రి , ఎంపీ చిదంబరం , కవి వైర ముత్తు చేతుల మీదుగా రచయిత ఎస్‌. ఏక్‌నాథ్‌ రాజుకు రూ. 2 లక్ష చెక్కు అవార్డు సర్టిఫికేట్‌ అందజేశారు. ఈ పుస్తకం మొదటి ప్రతిని ఇస్రో శాస్త్రవేత్త తమిళనాడు పాఠ్యప్రణాళిక ముసాయిదా కమిటీ ఛైర్మన్‌ అయిన మైల్సామి అన్నా దురై సమర్పించారు. కవికి ఒక వజ్రపు ముత్యం లభించింది.కవిత పబ్లిషింగ్‌ హౌస్‌ తరపున సేతు. చోక్కలింగం స్వాగతోపన్యాసం చేయగా, జ్యూరీ సభ్యుడు ఎన్‌. శ్రీరామ్‌ పుస్తక పరిచయం చేశారు. రచయిత్రి ఎ. వెన్నిల పుస్తక సమీక్షను అందించారు. కార్యక్రమంలో పండితుడు మయిల్స్వామి అన్నదురై మాట్లాడుతూ, ’సడవు’ ఎలాంటి శ్రమ లేకుండా చదివే అనుభవాన్ని అందిస్తుందని అన్నారు. మాజీ కేంద్ర మంత్రి పి. చిదంబరం తన ప్రసంగంలో, ‘ఈ బహుమతికి నవలను ఎంపిక చేసే జ్యూరీలో పనిచేయడం అంత సులభమైన పని కాదు‘ అని అన్నారు. సాహిత్య సంఘం ట్రస్టీ అయిన కార్తీక్‌ చిదంబరం ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement