● బీజేపీ కేంద్ర కమిటీ సమావేశం
సాక్షి,చైన్నె: చైన్నెలోని తమిళనాడు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయం కమలాలయంలో బీజేపీ జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శిబి.ఎల్. సంతోష్ అధ్యక్షతన పార్టీ కేంద్ర కమిటీ కీలక సమావేశం ఆదివారం జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన ఏర్పాట్లు , రాష్ట్ర బీజేపీ సంస్థాగత మార్పులపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించారు. బీజేపీ జాతీయ సంస్థాగత కార్యదర్శి బి.ఎల్. సంతోష్, జాతీయ కార్యదర్శి ఎం. వెంకటేశన్, రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్, మాజీ రాష్ట్ర అధ్యక్షులు పొన్. రాధాకృష్ణన్, తమిళిసై సౌందరరాజన్, జాతీయ కార్యవర్గ సభ్యుడు హెచ్. రాజా, ఎమ్మెల్యే వానతి శ్రీనివాసన్ తదితర కీలక నేతలు ఈ భేటీకి హాజరయ్యారు.
అక్టోబర్ 11న ప్రధాని మోదీ పర్యటన
పూంద మల్లి – వడపళని మెట్రో రైలు సేవలతో పాటు పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అక్టోబర్ 11న తమిళనాడుకు రానున్నారు. ప్రధానికి ఘన స్వాగతం పలికేందుకు చేపట్టాల్సిన ఏర్పాట్లు, ప్రత్యేక కమిటీల ఏర్పాటుపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు.కాగా, తమిళనాడు బీజేపీకి నూతన నిర్వాహకులు, ముఖ్య నాయకుల నియామకంపై ఈ సమావేశంలో చర్చలు జరిగాయి. సీనియర్ నటుడు, బీజేపీ నేత ఆర్. శరత్‌కుమార్‌ను తమిళనాడు బీజేపీ తదుపరి రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించే అవకాశం ఉందనే వార్తల నేపథ్యంలో, ఈ ప్రతిపాదనపై కేంద్ర కమిటీలో ప్రత్యేకంగా మాట్లాడినట్లు సమాచారం. కేంద్ర కమిటీ సమావేశం అనంతరం రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్, తమిళిసై సౌందరరాజన్ సహా పలువురు ముఖ్య నేతలు శరత్‌కుమార్ నివాసానికి వెళ్లి ఆయనతో సంప్రదింపులు జరపడం రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.


