తిరువొత్తియూరు: తిరువళ్లూరు సమీపంలోని తామరైపాక్కం ఎల్లాపురం యూనియన్ గురువాయల్ పంచాయతీ పరిధిలోని బాషికాపురం గ్రామంలో వందలాది ఎకరాల వ్యవసాయ భూము ల్లో వరి సాగు చేశారు. ఈ ప్రాంతానికి చెందిన రైతులు తాము పండించిన వడ్లను బాషికాపురం – అళింజివాక్కం మధ్య ఉన్న కొసస్థలై నది వంతెనపై కుమ్మరించి ఆరబోస్తున్నారు. ఆ తర్వాత ఆ వడ్లను బస్తాల్లో నింపి చెంగల్పట్టు సహా పలు ప్రాంతాలకు తీసుకెళ్లి విక్రయిస్తున్నారు. ఈ వంతెనను 20కి పైగా గ్రామాలకు చెందిన రైతులు, ప్రజలు చెంగల్పట్టు, తిరువళ్లూరు, ఆవడి తదితర ప్రాంతాలకు వెళ్లడానికి ఉపయోగిస్తున్నారు. వంతెనపై వడ్లను కుమ్మరించి ఆరబోయడం వల్ల వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈనేపథ్యంలో ప్రభు త్వం వరి ఆరబోసేందుకు ప్రత్యేకంగా కల్లాలు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. రైతులు మాట్లాడుతూ, ‘మేం పండించిన వడ్లను బాషికాపురం – అళింజివాక్కం మధ్య ఉన్న కొసస్థలై నదికి అడ్డంగా నిర్మించిన వంతెనపై కుమ్మరించి ఆరబెట్టి, ఆ తర్వాతే విక్రయిస్తున్నాం. ఈ మార్గంలో వెళ్లే వాహనాల వల్ల మాకు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి బాషికాపురం గ్రామంలో వరి ఆరబోసేందుకు కల్లాలు ఏర్పాటు చేసి ఇవ్వాలి‘ అని కోరారు.


