సాక్షి, చైన్నె: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతి నెలా చివరి ఆదివారం నిర్వహించే రేడియో ప్రసంగం ‘మన్ కీ బాత్’ లో తమిళనాడుకు చెందిన చరిత్ర పరిశోధకుడు, అధ్యాపకుడు ఎ. సెల్వరాజ్ చేసిన సేవలను ప్రత్యేకంగా కొనియాడారు. గతాన్ని వర్తమానంతో జోడించే కృషి: మన చరిత్ర, పురాతన సంప్రదాయాలతో ఉన్న అనుబంధం నేటికీ సజీవంగా ఉందంటే దాని వెనుక కొందరు వ్యక్తుల అంకితభావం , నిరంతర కృషి దాగి ఉన్నాయని ప్రధాని తెలిపారు. తమిళనాడులోని తిరుచిరాపల్లి (తిరుచ్చి) జిల్లా మనప్పరైకి చెందిన ఎ. సెల్వరాజ్ ఒక కళాశాలలో తమిళ విభాగానికి అనుబంధంగా పనిచేస్తున్నారని గుర్తుచేశారు. తన విద్యార్థుల నుంచి లభించిన ప్రాథమిక ఆధారాల ద్వారా పరిశోధనలు చేపట్టి, అనేక ప్రాచీన శిల్పాలు , పురాతన దేవాలయాలను వెలుగులోకి తెచ్చారని వివరించారు. చరిత్రను, సంస్కృతిని మరింత లోతుగా అధ్యయనం చేసేందుకు ఇటువంటి ప్రయత్నాలు ఎంతగానో ఉపకరిస్తాయని, దేశంలోని ఇతర ప్రాంతాల యువత కూడా ఇలాంటి పరిశోధనాత్మక ప్రయత్నాలు చేపట్టాలని మోదీ పిలుపునిచ్చారు.


