సాక్షి చైన్నె: చైన్నె కార్పొరేషనన్‌లో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. వారు విధులకు హాజరయ్యే ప్రతి రోజూకు రూ. 50 చొప్పున ఆహార భత్యం (ఫుడ్ అలవెన్స్) అందించేందుకు అనుమతినిస్తూ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి అవసరమైన రూ. 44.28 కోట్ల నిధులను కార్పొరేషన్ సొంత ఫండ్స్ నుంచి వ్యయం చేయడానికి పరిపాలనా ఆమోదం తెలిపింది. చైన్నె కార్పొరేషన్ పరిధిలో మొత్తం 24,264 మంది పారిశుధ్య కార్మికులు విధులు నిర్వహిస్తున్నారు. వీరిలో ఎక్కువమంది ఘన వ్యర్థాల నిర్వహణ సేవలు అందించే ప్రైవేట్ సంస్థల పరిధిలోనే పనిచేస్తున్నారు. జిల్లా కలెక్టర్ నిర్ణయించిన వేతనాలను చెల్లించాలని డిమాండ్ చేస్తూ గత ఏడాది ఆగస్టులో కార్మికులు రిప్పన్ భవనం ముందు ఆందోళన చేపట్టారు. ఆ సమయంలో అధికారంలో ఉన్న డీఎంకే ప్రభుత్వం కార్మికులకు పని వేళల్లో మూడు పూటలా ఉచిత భోజన వసతి కల్పించే పథకాన్ని ప్రారంభించారు.శాశ్వత ఉపాధి, కలెక్టర్ వేతనాల అమలు కోసం ఈ ఏడాది సెప్టెంబర్ ప్రారంభంలో కార్మికులు మరలా నిరసనలు చేపట్టారు. ప్రభుత్వం తరఫున మంత్రులు రాజ్‌మోహన్, అధవ్ అర్జున, ఎన్. ఆనంద్, నిర్మల్ కుమార్ తదితరులు కార్మికులతో చర్చలు జరిపారు.
భత్యంగా మార్పు
చర్చల సందర్భంగా కార్పొరేషన్ అందిస్తున్న భోజనం నాసిరకంగా ఉందని, భోజనానికి బదులుగా రోజువారీ అలవెన్స్ రూపంలో నగదు అందించాలని కార్మికులు విన్నవించారు. కార్మికుల కోరికకు సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం, వారి అభ్యర్థన ఆధారంగా రూ. 44.28 కోట్లతో కూడిన ప్రతిపాదనను పరిశీలించి, పారిశుధ్య కార్మికులకు రోజుకు రూ. 50 ఆహార భత్యం చెల్లించేందుకు ఆమోదం తెలపడమే కాకుండా ఉత్తర్వులు జారీ చేసింది.


