సాక్షి, చైన్నె : మధురాంతకం, దారాపురం ఉప ఎన్నికల నియోజకవర్గాల్లో ప్రధాన రాజకీయ పార్టీలైన టీవీకే , డీఎంకే, అన్నాడీఎంకేలు తీవ్ర స్థాయి అనైతిక రాజకీయాలకు పాల్పడుతున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఎం. వీరపాండియన్ తీవ్ర ఆరోపణలు చేశారు. పుదుచ్చేరి లోని తట్టంచవాడి నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థి సలీంకు మద్దతుగా నిర్వహించిన ప్రచారంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మధురాంతకం, ధారాపురం ప్రాంతాల్లో టీవీకే, డీ ఎంకే, ఏఐఏడీఎంకే నాయకులు, కార్యకర్తలు ఇళ్లలో దాక్కుని ఓటర్లకు విచ్చలవిడిగా డబ్బు లు పంచేందుకు సిద్ధమయ్యారని, ఇది ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని మండిపడ్డారు. వామపక్షాలు నైతికతతోనే ఈ ఎన్నికల్లో పోటీ చేసి వారిని ఓడిస్తాయని స్పష్టం చేశారు.
ప్రధాని మోదీకి ప్రశ్నలు: ప్రధాని నరేంద్ర మోదీ తమిళనాడు పర్యటనపై స్పందిస్తూ ఆయన రెండు ప్రధాన విషయాలపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఐక్యరాజ్యసమితిలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రసంగించిన సమయంలో ప్రపంచ దేశాలు వాకౌట్ చేయగా, భారత్ మద్దతు తెలిపిన తీరుపై వివరణ ఇవ్వాలిని డిమాండ్ చేశా రు. అలాగే దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా నుంచి 13 కోట్ల మంది పేర్లను తొలగించారన్న సీఈసీ వ్యాఖ్యలకు ప్రధాని బాధ్యత వహిస్తారో లేదో తెలపాలని పట్టుబట్టారు. కరూర్ తొక్కిసలాట ఘట నపై సీఎం విజయ్ స్వతంత్ర దర్యాప్తుకు ఆదేశించి బాధితులకు పూర్తి న్యాయం చేయాలని కోరారు. బాలికలపై లైంగిక వేధింపుల వీరమణి కేసును చట్టపరంగా ముందడుగు వేయించి, మహిళలకు సమగ్ర రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.
మట్టి దోపిడీ
సాక్షి, చైన్నె: డీఎంకే విప్, మాజీ మంత్రి ఏ.వి. వేలు, ఆయన కుమారుడు కుమారన్ , మరికొందరిపై అవినీతి నిరోధక శాఖ పోలీసుల కేసు నమోదు చేశారు. పార్టీ సమావేశ వేదిక వద్ద ఉన్న గుంతలను పూడ్చడానికి మలప్పంపట్టి సమీపంలోని చెరువు నుండి అక్రమంగా మట్టిని తవ్వితీసి దొంగిలించారని అరప్పోర్ ఇయక్కం అవినీతి నిరోధక పోలీసులకు ఫిర్యాదు చేసింది. చెరువు నుండి మట్టి దొంగతనం చేయడం వల్ల తమిళనాడు ప్రభుత్వ ఖజానాకు రూ. 8.22 కోట్ల మేర నష్టం వాటిల్లిందని ఫిర్యాదులో పేర్కొన్నారు.ఈ కేసు ఆధారంగా అవినీతి నిరోధక శాఖ అధికారులు. వేలు, ఆయన కుటుంబ సభ్యులు, వ్యాపార సంస్థలు , వారితో సంబంధం ఉన్న వ్యక్తుల ఇళ్లలో విస్త్తృత సోదాలు నిర్వహించారు. రూ. 8.22 కోట్ల ప్రభుత్వ ధనం దుర్వినియోగంకు సంబంధించిన ఆధారాలు లభించినట్టు సమాచారం.


