సాక్షి,చైన్నె: తమిళనాడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన గ్రూప్–1 ప్రిలిమినరీ పరీక్ష రాష్ట్రవ్యాప్తంగా ప్రశాంతంగా ముగిసింది. ఆదివారం జరిగిన ఈ పరీక్షకు దాదాపు 1.65 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈ పరీక్ష ఫలితాలను రాబోయే రెండు నెలల్లో విడుదల చేయనున్నట్లు టీఎన్‌పీఎస్‌సీ ఛైర్మన్ ఎస్.కె. ప్రభాకర్ వెల్లడించారు. డిప్యూటీ కలెక్టర్, గ్రామీణాభివృద్ధి సహాయ సంచాలకులు, వాణిజ్య పన్నుల సహాయ కమిషనర్, సహకార సంఘాల డిప్యూటీ రిజిస్ట్రార్ , కార్మిక సంక్షేమ సహాయ కమిషనర్ వంటి కీలకమైన 46 పోస్టుల భర్తీకి జూన్ 23న నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే.ఈ పోస్టుల కోసం మొత్తం 2,23,440 మంది (వీరిలో 1,44,000 మంది మహిళలు) దరఖాస్తు చేసుకోగా, ఆదివారం ఉదయం 9.30 నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరిగిన జనరల్ నాలెడ్జ్ ప్రిలిమినరీ పరీక్షకు 1,65,828 (74.22%) మంది హాజరయ్యారు. కాగా, 57,612 మంది (25.78%) అభ్యర్థులు గైర్హాజరయ్యారు.
నిఘా నీడలో పరీక్ష
రాష్ట్రవ్యాప్తంగా 38 కేంద్రాలలో ఈ పరీక్ష నిర్వహించగా, ఒక్క చైన్నెలోని 12 కేంద్రాల్లోనే 37,000 మంది అభ్యర్థులు పరీక్ష రాశారు.చేట్‌పట్‌లోని చైన్నె క్రిస్టియన్ కాలేజ్ హయ్యర్ సెకండరీ స్కూల్‌లో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాన్ని టీఎన్‌పీఎస్‌సీ ఛైర్మన్ ఎస్.కె. ప్రభాకర్ ఉదయం 9 గంటలకు వ్యక్తిగతంగా తనిఖీ చేశారు.
అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గ్రూప్–1 ప్రిలిమ్స్ ఫలితాలను రెండు నెలల వ్యవధిలో వెల్లడిస్తామన్నారు. ప్రస్తుతం నోటిఫికేషన్‌లో 46 ఖాళీలను ప్రకటించినప్పటికీ, రానున్న రోజుల్లో ఈ ఖాళీల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. కాగా యూపీఎస్సీ సర్వీసెస్ తరహాలోనే టీఎన్‌పీఎస్‌సీ గ్రూప్–1 కూడా ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ అనే మూడు దశల్లో జరుగుతుందన్నారు. నిబంధనల ప్రకారం, ఒక పోస్టుకు 20 మంది అభ్యర్థుల (1:20) నిష్పత్తిలో ప్రిలిమ్స్ నుండి మెయిన్స్‌కు ఎంపిక చేస్తామన్నారు.ప్రస్తుతమున్న 46 ఖాళీల ప్రకారం చూస్తే 920 మంది అభ్యర్థులు మెయిన్స్ రాసేందుకు అర్హత సాధిస్తారు. ఒకవేళ ఛైర్మన్ తెలిపినట్లుగా ఖాళీల సంఖ్య పెరిగితే, మెయిన్స్‌కు ఎంపికయ్యే అభ్యర్థుల సంఖ్య కూడా పెరుగుతుందని చెప్పవచ్చు.


