సాక్షి, చైన్నె : శ్రీ రామచంద్ర ఇనిస్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ 41వ వ్యవస్థాపక దినోత్సవం, వ్యవస్థాపక ఛాన్సలర్ ఎన్.పి.వి.రామస్వామి ఉడయార్ 91వ జయంతి శుక్రవారం జరిగింది. ఇందులో విద్యార్థులు, అధ్యాపకులు, పరిశోధకులు, సిబ్బందికి స్వర్ణ పతకాలు, నగదు బహుమతులు, పురస్కారాలు అందజేశారు. ఎంబీబీఎస్‌లో ప్రతిభ కనబరిచిన విద్యార్థిని ఎస్.అభినయ నాలుగు స్వర్ణ పతకాలను అందజేశారు. మొత్తం 28 మంది విద్యార్థులకు 38 బంగారు పతకాలు ప్రదానం చేశారు. అలాగే సంస్థకు విశేష సేవలందించిన 282 మంది ఉద్యోగులకు నగదు పురస్కారాలు అందజేసి సత్కరించారు.
జీవితకాల సాఫల్య పురస్కారం
ఎస్‌ఆర్‌ఎంసీ అండ్ ఆర్‌ఐ డీన్–జనరల్ సర్జరీ ప్రొఫెసర్ కె.బాలాజీ సింగ్, రేడియాలజీ ప్రొఫెసర్ జె.డి.రాయ్ సంతోషంకు జీవితకాల సాఫల్య పురస్కారాలు, డాక్టర్ కన్నన్ కార్తీక్ కై లాష్‌కు మెంటరింగ్ ఎక్సలెన్స్ అవార్డు అందజేశారు. ఈ వేడుకల్లో భాగంగా ఛాన్సలర్ వి.ఆర్.వెంకటాచలం సహాయ్ – హోమ్ కేర్ సర్వీసెస్‌ను ప్రారంభించారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన రోగులకు ఇంటి వద్దే డాక్టర్ సంప్రదింపులు, నర్సింగ్ కేర్, ఫిజియోథెరపీ, వృద్ధుల సంరక్షణ, ల్యాబ్ శాంపిల్ కలెక్షన్, ఫార్మసీ డెలివరీ వంటి సమగ్ర వైద్య సేవలు ఈ వేదిక ద్వారా అందనున్నాయి. కార్యక్రమంలో ఛాన్సలర్ వి.ఆర్.వెంకటాచలం, ప్రొ–ఛాన్సలర్ ఆర్.వి.సెంగుట్టువన్, ట్రస్టీ సంయుక్త వెంకటాచలం, వైస్–ఛాన్సలర్ డాక్టర్ ఉమా శేఖర్ తదితరులు పాల్గొన్నారు.


