ప్లస్‌వన్ విద్యార్థిని ఆత్మహత్య
వేలూరు: లైవ్ గేమ్‌లు చూస్తున్నందుకు తల్లిదండ్రులు మందలించడంతో విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన వేలూరు జిల్లా అరియూరు గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన ఉదయ భార్య మీనాక్షి బీజేపీ మహిళా విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఆమె కుమార్తె మోనికా (16) వేలూరులోని ప్రైవేట్ పాఠశాలలో ప్లస్ వన్ చదువుతుంది. గురువారం ఉదయం ఇంటిలో తన ల్యాప్‌టాప్‌లో ఆన్‌లైన్ వీడియో గేమ్‌లు చూస్తుండడంతో తల్లిదండ్రులు మందలించారు. దీంతో మానసిక వేదనకు గురై రాత్రి ఇంటిలో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గమనించిన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. విషయం తెలుసుకున్న అరియూరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం వేలూరు అడుకుంబరై ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
విద్యార్థి అనుమానాస్పద మృతి
కొరుక్కుపేట: మదురై ప్రాంతంలోని ఆరపాలయం ప్రభుత్వ సహాయక పాఠశాలలో 11వ తరగతి చదువుతున్న విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. దీనిపై విద్యార్థి సంఘాల నేతలు కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసనకు దిగారు. వారిని పోలీసులు అరెస్టు చేశారు. మదురై మున్సిపల్ కార్పొరేషన్ బహు వానవిల్ వీధికి చెందిన యోగలేఖ– కరుప్పస్వామి దంపతుల కుమారుడైన తమిళసెల్వన్ ఆరపాలయం ప్రభుత్వ సహాయక పాఠశాలలో 11వ తరగతి చదువుతున్నాడు. ఈ నెల 6వ తేదీన ఆదివారం సెలవు కావడంతో ఉదయాన్నే క్రికెట్ ఆడటానికి వెళ్తున్నానని తల్లికి చెప్పి ఇంటి నుంచి వెళ్లాడు. మదురైలోని అనైయూర్ మురుగునీటి శుద్ధి కర్మాగారం సమీపంలో ఉన్న అబ్దుల్ కలాం వీధి ప్రాంతంలోని ఒక ముళ్లపొద దగ్గర గల చిన్న నీటి గుంటలో గాయాలతో మృతిచెంది ఉన్నాడు. కుడల్‌పుత్తూరు పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. విద్యార్థి తమిళసెల్వన్ కుటుంబ సభ్యులు మాట్లాడుతూ పథకం ప్రకారం ఎవరో హత్య చేశారని ఆరోపించారు. హత్యకు గురైన విద్యార్థి 95వ సెక్షన్‌లో చేరిన మహిళతో ప్రేమ వ్యవహారంలో ఉన్నాడని, అందుకే అతడిని కొట్టి చంపి ఉండవచ్చన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మృతదేహాన్ని తీసుకోవడానికి కుటుంబ సభ్యులు నిరాకరించారు. శుక్రవారం ఉదయం భారత ప్రజాస్వామ్యం యూత్ యూనియన్, ఇండియన్ స్టూడెంట్స్ యూనియన్‌కు చెందిన 50 మంది కార్యకర్తలు మదురై కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసనకు దిగారు. వారిని పోలీసులు అరెస్టు చేశారు.
వేర్వేరు చోట్ల
రూ.2 లక్షల నగదు చోరీ
తిరువొత్తియూరు : వేర్వేరు ప్రాంతాల్లో రూ.2 లక్షలు చోరీ చేసిన దుండగుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. కేళంబాక్కం సమీపంలోని తయ్యూర్ పెరియానగర్‌కు చెందిన రవిచంద్రన్, కేళంబాక్కం బస్టాండ్ వెనుక ఉన్న కాళియమ్మన్ కోవెల వీధిలో రియల్ ఎస్టేట్ కార్యాలయాన్ని, దాని పక్కనే ఆవిన్ పాలు విక్రయ కేంద్రం నడుపుతున్నారు. గురువారం రాత్రి తాళం వేసి ఇంటికి వెళ్లారు. శుక్రవారం తెల్లవారుజామున పాలు విక్రయించడానికి దుకాణం తెరవగా షట్టర్లు పగులగొట్టి ఉండటం చూసి షాక్‌కు గురయ్యారు. లోపలికి వెళ్లి చూడగా పాల దుకాణంలో ఉన్న రూ.5 వేల నగదు, ఒక సెల్‌ఫోన్, రియల్ ఎస్టేట్ కార్యాలయంలో రూ.1.50 లక్షల నగదు చోరీకి గురైనట్టు గుర్తించారు. సీసీ కెమెరాలను పరిశీలించగా అర్ధరాత్రి ఒంటి గంట ప్రాంతంలో ముసుగులు ధరించిన ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు బైక్‌పై వచ్చి చోరీకి పాల్పడినట్టు తేలింది. దీనిపై కేళంబాక్కం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అసిస్టెంట్ కమిషనర్ జాన్ విక్టర్, క్రైమ్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ కలైసెల్వి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఇదేవిధంగా తిరుప్పోరూర్ రోడ్డు మలైకోవిల్ సమీపంలో అరవింద్ అనే వ్యక్తికి చెందిన మిల్క్ పార్లర్ లాంటి ఆహార దుకాణం తాళాలు పగులగొట్టి రూ.35 వేల నగదును చోరీ చేశారు. దీనిపై తిరుప్పోరూర్ పోలీసులు విచారణ జరుపుతున్నారు.
ఫుట్‌పాత్ ఆక్రమణల
తొలగింపు
తిరువొత్తియూరు: చైన్నె తిరువొత్తియూరు పశ్చిమ ప్రాంతానికి వెళ్లే సబ్‌వే ఉన్న మాణిక్యం నగర్ రోడ్డులోని ఫుట్‌పాత్‌లను ఆక్రమించి ఏర్పాటుచేసిన దుకాణాలను అధికారులు తొలగించారు. ఈ ప్రాంతంలో ఫుట్‌పాత్‌లు ఆక్రమించడంతో కార్పొరేషన్ బస్సులు మలుపు తిరగలేక ట్రాఫిక్ జామ్ అవుతోంది. అలాగే తిరువొత్తియూరు హైవేపై కూడా వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. నడిచే సాధారణ ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కాబట్టి ప్రజలకు ఇబ్బందిగా ఉన్న ఈ ఫుట్‌పాత్ ఆక్రమణలను తొలగించాలని తిరువొత్తియూరు జోనల్ అధికారులకు నిరంతరం అభ్యర్థనలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ జయరామన్ నేతృత్వంలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ప్రకాష్, అసిస్టెంట్ ఇంజినీర్ దురైబాబుతో కూడిన బృందం పోలీసు రక్షణతో అజాక్స్ మాణిక్యం నగర్ ప్రాంతం మొత్తంలో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిస్తున్న రోడ్డు పక్కన ఉన్న దుకాణాలను తొలగించారు. అలాగే దుకాణాల ముందు ఆక్రమించి ఉన్న బోర్డులను తొలగించారు.


