– మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్ ఆదేశాలు
సాక్షి చైన్నె : ఉపసంహరించుకోలేని నిబంధనల ప్రకారం పోలీసు స్టేషన్లు, ఎస్పీ కార్యాలయాల్లోని సీసీ పుటేజీలను 18 నెలల పాటు భద్రపర్చాలని మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్ ఆదేశించింది. మదురై అలంగానల్లూరు సమీపంలోని కల్లనై గ్రామానికి చెందిన సామాజిక కార్యకర్త ఒకరు హైకోర్టు మదురై బెంచ్‌లో ఒక హెబియస్ కార్పస్ పిటీషన్ దాఖలు చేశారు. తన భార్యను ఆగస్టు 28న ఎస్పీ కార్యాలయ పోలీసులు విచారణ పేరుతో అక్రమంగా నిర్బంధించి, మర్నాడు ఒక బూటకపు కేసులో అరెస్ట్ చేసి జైలులో పెట్టారని తెలిపారు. ఆ రెండు రోజులకు సంబంధించిన ఎస్పీ కార్యాలయ సీసీ పుటేజ్‌ను భద్రపరిచేలా ఆదేశించాలని కోరారు. దీనిపై ప్రభుత్వ తరపు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ ఎస్పీ కార్యాలయ సీసీ పుటేజీలను 15 రోజులు మాత్రమే సేవ్ చేయగలమని, కొన్ని కెమెరాలు బడ్జెట్, నిర్వహణ లోపంతో పాడైపోయాయని తెలిపారు. దీన్ని తోసిపుచ్చిన న్యాయమూర్తి మురుగన్, సీసీ పుటేజీలను 15 రోజులే భద్రపరుస్తామనే వాదనను అంగీకరించలేమని తేల్చిచెప్పారు. ఆగస్టు 28, 29 తేదీల్లో ఎస్పీ కార్యాలయ వసతి గృహాలు, క్రైమ్ బ్రాంచ్ భవనాల్లోని సీసీ పుటేజీలను భద్రపరించి కోర్టులో సమర్పించాలని ఆదేశించారు. అలాగే కార్యాలయంలో ఉన్న మొత్తం కెమెరాలు ఎన్ని, పనిచేస్తున్నవి ఎన్ని, చెడిపోయినవి ఎప్పటి నుంచి పాడయ్యాయి వంటి వివరాలను సమర్పించాలని పేర్కొంటూ, తదుపరి విచారణను ఒక వారానికి వాయిదా వేశారు.


