చైన్నె మెట్రో ఫేజ్‌ 2 కోసం 35 కొత్త మెట్రో రైళ్లు | - | Sakshi
Sakshi News home page

చైన్నె మెట్రో ఫేజ్‌ 2 కోసం 35 కొత్త మెట్రో రైళ్లు

Sep 19 2026 12:58 AM | Updated on Sep 19 2026 12:58 AM

సాక్షి, చైన్నె : చైన్నెలో మెట్రో రైల్‌ రెండో విడత ప్రాజెక్టు పనులు వివిధ మార్గాల్లో వేగంగా కొనసాగుతున్నాయి. ఈ తరుణంలో మెట్రో రైలు సేవల కోసం 35 రైళ్లను సిద్ధం చేశారు. పూందమల్లి నుంచి లైట్‌హౌస్‌ వరకు ఉన్న 4వ మార్గంలో మెట్రో పనులన్నీ దాదాపు పూర్తవుతున్నాయి. పోరూర్‌ జంక్షన్‌ నుంచి పవర్‌ హౌస్‌ వరకు హై–లెవల్‌ లైన్‌ పనులు 92 శాతం పూర్తికాగా, టన్నెల్‌ (సొరంగం) పనులు 54 శాతం మేరకు పూర్తయ్యాయి. అలాగే మాధవరం – సిరుచ్చేరి, మాధవరం– షోళింగనల్లూరు మధ్య పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పూందమల్లి నుంచి వడపళని మార్గంలో మెట్రో రైళ్లను నడపడానికి అవసరమైన 35 కొత్త మెట్రో రైళ్లు చైన్నెకి చేరుకున్నాయి. ప్రస్తుతం వీటిని పూందమల్లిలోని వర్క్‌షాప్‌లో ఉంచి ట్రయల్‌ రన్‌ నిర్వహిస్తున్నారు.

ఆమోదం కోసం ఎదురుచూపు

పూందమల్లి నుంచి పోరూర్‌ వరకు మెట్రో రైలు నడపడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయి, అనుమతులు కూడా లభించాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి అధికారిక ఉత్తర్వులు రాకపోవడంతో గత 4 నెలలుగా ఈ మార్గంలో సేవలు ప్రారంభం కాకపోవడం గమనార్హం. త్వరలోనే ఈ అడ్డంకులు తొలగి సేవలు అందుబాటులోకి వస్తాయని ప్రయాణికులు ఎదురుచూస్తున్నారు.

శివగంగ సమీపంలో

జంట హత్యలు

తిరువొత్తియూరు: శివగంగ సమీపంలోని కురుందాని ప్రాంతంలో జంట హత్యలు కలకలం రేపాయి. కాళాంగై పుదూర్‌కు చెందిన దైవేంద్రన్‌ (35) కోయంబత్తూరు జిల్లా పొల్లాచ్చిలో వైన్‌ బార్‌ నిర్వహిస్తున్నారు. నెల రోజుల క్రితం శివగంగలో ఒక కొత్త కారు కొనుగోలు చేశారు. దాన్ని సర్వీసింగ్‌కు ఇచ్చేందుకు దైవేంద్రన్‌ ఊరికి వచ్చారు. ఆ సమయంలో సిరువేలంగుడికి చెందిన పూపాండియాన్‌, దైవేంద్రన్‌ కొడిగారే కన్మయి (చెరువు) ప్రాంతంలో మద్యం సేవిస్తున్నారు. ఆ సమయంలో మూడు బైక్‌లలో వచ్చిన ఆరుగురు దుండగులు మారణాయుధాలతో వీరిని నరికి హత్య చేశారు. దైవేంద్రన్‌ కొత్త కారును ధ్వంసం చేశారు. ఈ జంట హత్యల కేసులో నిందితులను పట్టుకోవడానికి జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసులు 5 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి విచారణ చేపట్టారు. సీసీ పుటేజీల ఆధారంగా చేపట్టిన దర్యాప్తులో పల్లూరుకు చెందిన బాలమురుగన్‌ (24), ధనరాజ్‌ (19), సంతోష్‌ (19), మదురైకి చెందిన సతీష్‌ కుమార్‌ (25), అలుప్పిళ్లై తాంగియాకు చెందిన కాళీశ్వరన్‌ (23)కు హత్యతో సంబంధం ఉన్నట్లు తేలింది. వారిని అరెస్ట్‌ చేసి విచారించగా విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఘటన జరిగిన రోజు సతీష్‌ కుమార్‌కు, అదే ప్రాంతానికి చెందిన ఒక ముఠాకు కన్మయి (చెరువు) సమీపంలో మద్యం సేవిస్తున్న సమయంలో గొడవ జరిగింది. దీంతో కోపానికి గురైన సతీష్‌ కుమార్‌ వారిని హత్య చేయాలనే ఉద్దేశంతో తన అనుచరులను పిలుచుకుని వచ్చాడు. అంతలోనే ఆ ముఠా అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఆ సమయంలో అదే కన్మయి ప్రాంతంలో మద్యం సేవిస్తున్న దైవేంద్రన్‌, పూపాండియాన్‌ను చూసి వారే తమతో గొడవ పడిన వారని పొరపాటు పడి హత్య చేశారు.

ఆపరేషన్‌ రైల్‌ ప్రహారీ

సాక్షి, చైన్నె : దక్షిణ రైల్వే, చైన్నె డివిజన్‌కు చెందిన రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ సిబ్బంది ఆపరేషన్‌ రైల్‌ ప్రహారీలో భాగంగా కేరళలో దొంగతనానికి పాల్పడి పరారీలో ఉన్న నిందితుడిని అత్యంత చాకచక్యంగా అరెస్ట్‌ చేశారు. కేరళ రాష్ట్రం, కొట్టాయం జిల్లాలోని పాలై పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగిన దొంగతనానికి సంబంధించి నిందితుడు పశ్చిమ బెంగాల్‌కు పారిపోయినట్లు గుర్తించారు. నిందితుడు హౌరా నుంచి చైన్నె వెళ్లే రైలులో ప్రయాణిస్తున్నట్లు కేరళ పోలీసుల నుంచి అందిన సమాచారంతో, ఆర్‌పీఎఫ్‌ సబ్‌–ఇన్‌స్పెక్టర్‌ డి.కార్తికేయన్‌, సిబ్బంది అప్రమత్తమయ్యారు. హౌరా – చైన్నె సెంట్రల్‌ మెయిల్‌ చైన్నె సెంట్రల్‌ స్టేషన్‌లోని 5వ ప్లాట్‌ఫారంకు చేరుకోగానే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతను పశ్చిమ బెంగాల్‌లోని నాదియా జిల్లాకు చెందిన సుఖ్‌చంద్‌ సేఖ్‌గా గుర్తించారు. తాను పాలైలో దొంగతనానికి పాల్పడి బెంగాల్‌కు పారిపోయినట్లు అతను అంగీకరించాడు. అతన్ని పాలై పోలీస్‌ స్టేషన్‌ సబ్‌–ఇన్‌స్పెక్టర్‌ రాజేష్‌కు అప్పగించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement