సాక్షి, చైన్నె : చైన్నె రామపురంలోని ఈశ్వరి ఇంజినీరింగ్ కాలేజీలో విద్యార్థుల్లో పరిశోధనలు, నూతన ఆవిష్కరణలు, పారిశ్రామికవేత్తలుగా ఎదిగే నైపుణ్యాలను పెంపొందించే లక్ష్యంతో ఇన్నోవేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. ఎస్‌ఆర్‌ఎం ఈశ్వరి ఇన్నో వేషన్ పేరిట ఏర్పాటు చేసిన ఈ సెంటర్‌ను శుక్ర వారం రాష్ట్ర ఉన్నత విద్యా శాఖ మంత్రి విశ్వనాథన్ ప్రారంభించారు. కార్యక్రమంలో ఎస్‌ఆర్‌ఎం గ్రూప్ ఆఫ్ ఇనిస్టిట్యూషన్స్ చైన్నె, రామపురం–తిరుచ్చి చైర్మన్ ఆర్.శివకుమార్, వైస్–చైర్‌పర్సన్ గీతా శివ కుమార్, కో–చైర్మన్ ఎస్.నిరంజన్, కళాశాల ప్రిన్సిపాల్ పి.దైవ సుందరి తదితరులు పాల్గొన్నారు.
పూర్వ విద్యార్థుల సహకారం
ఈ ఇన్నోవేషన్ సెంటర్ భవన నిర్మాణం, ఎస్‌ఆర్‌ఎం ఈశ్వరి పూర్వ విద్యార్థుల సంఘం రూ.1.5 కోట్ల విరాళం ఇవ్వడం విశేషం. ఇందులో పీసీబీ ల్యాబ్, 3డీ ప్రింటింగ్ ల్యాబ్, మిషనరీ ల్యాబ్, వుడ్ కట్టర్–ఫ్యాబ్ రూమ్ వంటి అధునాతన ప్రత్యేక వసతులు కల్పించారు. విద్యార్థుల కొత్త ఆలోచనలకు అంకురార్పణ చేయడానికి ఈశ్వరి స్టార్టప్ టీఎన్ – ప్రీ–ఇన్‌క్యుబేషన్ సెంటర్‌తో పాటు స్టార్టప్ కాన్‌కేవ్‌లను సైతం ఏర్పాటు చేశారు. అలాగే ఏబీబీ రోబోటిక్స్, సిస్కో, ఒరాకిల్, సీమెన్స్, నోకియా, టయోటా కనెక్టెడ్, టీవీఎస్, బాష్ వంటి ప్రముఖ గ్లోబల్ టెక్నాలజీ కంపెనీలతో కూడిన సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఈ కేంద్రానికి మద్దతుగా నిలవనున్నాయి. ఈ వేడుకలో భాగంగా విద్యార్థులు రూపకల్పన చేసిన ఆవిష్కరణలను ప్రదర్శించారు. ఈ అధునాతన కేంద్రం ద్వారా విద్యార్థులు భవిష్యత్తు సాంకేతికతకు తగినట్లుగా పరిశ్రమలకు సిద్ధమైన నైపుణ్యాలను పొందగలరని యాజమాన్యం పేర్కొంది.


