సాక్షి, చైన్నె : మలేషియాలో సైక్లింగ్, స్పోర్ట్స్ అనుభవపూర్వక పర్యాటకాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో ఫ్‌లై రైడ్ – మలేషియా కోస్టల్ ఎక్స్‌పెడిషన్ 2026 రెండవ విడత కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. టూరిజం మలేషియా చైన్నె పూర్తి మద్దతుతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో భారత్ యూఏఈ నుంచి వచ్చిన 36 మంది సైక్లిస్టులు ఉత్సాహంగా దూసుకెళ్లారు. 350 కిలోమీటర్లకు పైగా సైక్లింగ్ యాత్ర సెప్టెంబర్ 8న జోహోర్ బాహ్రులో ప్రారంభమైంది. ఈ ముగింపు వేడుకలో పాల్గొన్న సైక్లిస్టులకు పతకాలు అందజేశారు. విజిట్ మలేషియా 2026–2027 ప్రచారంలో భాగంగా నిర్వహించిన ఈ యాత్ర ద్వారా మలేషియా సుందరమైన ప్రకృతి దృశ్యాలు, సంస్కృతి ప్రపంచానికి చాటిచెప్పినట్టు టూరిజం మలేషియా చైన్నె డైరెక్టర్ హిషాముద్దీన్ ముస్తఫా తెలిపారు. భారతీయ మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకుని సైక్లింగ్ టూరిజంను అభివృద్ధి చేయడానికి, మలేషియాను ఒక అగ్రశ్రేణి సైక్లింగ్–స్నేహపూర్వక గమ్యస్థానంగా నిలపడానికి ఈ యాత్ర ఎంతగానో దోహదపడిందన్నారు.


