– ప్రారంభించిన అసెంబ్లీ స్పీకర్
జె.సి.డి. ప్రభాకర్
సాక్షి, చైన్నె: చైన్నెలోని ఎంజీఎమ్ హెల్త్‌కేర్ శనివారం న్యూరో రీహ్యాబిలిటేషన్ పై ఒకరోజు సీఎమ్‌ఈ సదస్సు, వర్క్‌షాప్ జరిగింది. దీనిని అసెంబ్లీ స్పీకర్ జె.సి.డి. ప్రభాకర్ ప్రారంభించా రు. ఈ సందర్భంగా న్యూరో రీహ్యాబిలిటేషన్ ప్రాముఖ్యతను వివరిస్తూ రూపొందించిన రీస్టోరింగ్ ఫంక్షన్, రెన్యూయింగ్ హోప్ అనే హ్యాండ్‌బుక్‌ను ఆయన ఆవిష్కరించారు. ఈ పుస్తక రూపకల్పనలో ఎంజీఎమ్ హెల్త్‌కేర్‌కు చెందిన న్యూరోసర్జరీ డైరెక్టర్ డాక్టర్ వి.ఆర్. రూపేష్ కుమార్, రీహ్యాబిలిటేషన్ మెడిసిన్ క్లినికల్ లీడ్ డాక్టర్ ఎ.జె. రాజేంద్రన్, కన్సల్టెంట్ న్యూరోసర్జన్ డాక్టర్ ఎమ్.పి. కవియరసన్ కీలక పాత్ర పోషించారు. ఈ వర్క్‌షాప్‌లో న్యూరాలజిస్టులు, న్యూరోసర్జన్లు, ఫిజియోథెరపిస్టులు, ఆక్యుపేషనల్ థెరపిస్టులు, స్పీచ్ థెరపిస్టులు, క్లినికల్ సైకాలజిస్టులతో సహా 150 మందికి పైగా వైద్య నిపుణులు పాల్గొన్నారు. పక్షవాతం (స్ట్రోక్) నుంచి కోలుకోవడం, ఐసీయూలో న్యూరో రీహ్యాబిలిటేషన్, ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచడం, బ్రెయిన్–కంప్యూటర్ ఇంటర్‌ఫేస్, అత్యాధునిక ఆర్థోటిక్స్ , ప్రోస్థెటిక్స్ పరికరాలు తదితర అంశాలపై 26 మందికి పైగా నిపుణులు ప్రసంగించారు. ఈ సందర్భంగా డాక్టర్ వి.ఆర్. రూపేష్ కుమార్ మాట్లాడుతూ.. నరాల సంబంధిత సమస్యలతో బాధపడే రోగులు తిరిగి స్వతంత్రంగా, గౌరవప్రదంగా జీవించేందుకు వైద్య విధానాల్లో వస్తున్న నూతన మార్పులు, నిపుణుల అనుభవాలు ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు.


