సాక్షి, చైన్నె: డాక్టర్ అగర్వాల్స్ ఐ హాస్పిటల్, దాని పరిశోధనా విభాగమైన ఐ రీసెర్చ్ సెంటర్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ ఆప్తాల్మాలజీ విద్యార్థుల కోసం కల్పవృక్ష –2026 పేరిట 19వ వార్షిక జాతీయ స్థాయి సదస్సును శనివారం నిర్వహించారు. రెండు రోజుల పాటు జరిగే ఈ సీఎమ్‌ఈ సదస్సుకు దేశవ్యాప్తంగా 300 మందికి పైగా యంగ్ డాక్టర్లు, 30 మందికి పైగా ప్రముఖ వైద్య నిపుణులు తరలి వచ్చారు. ఈ కార్యక్రమాన్ని కర్ణాటక ప్రభుత్వ మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ డైరెక్టర్ డాక్టర్ బి.ఎల్. సుజాత రాథోడ్ ప్రారంభించారు. డాక్టర్ అగర్వాల్స్ సంస్థ ప్రతినిధులు డాక్టర్ సుసాన్ జాకబ్, డాక్టర్ ఎస్. సౌందరి, డాక్టర్ దివ్య అశోక్ కుమార్, డాక్టర్ ప్రీతి నవీన్ తదితరులు హాజరయ్యారు. గ్లాకోమా, క్యాటరాక్ట్, కార్నియా, రెఫ్రాక్టివ్, యువెటిస్, స్క్వింట్, న్యూరో ఆప్తాల్మాలజీ, ఆర్బిట్ అండ్ ఓక్యులోప్లాస్టీ వంటి కీలక వైద్య విభాగాలపై ప్రాక్టికల్ వెట్ ల్యాబ్ సెషన్లు, క్లినికల్ కేస్ ప్రెజెంటేషన్లు, క్విజ్ పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ వి. వేలాయుధం కన్సిస్టెంట్ పెర్ఫార్మర్ అవార్డును డాక్టర్ ఎమ్. దివ్య, డాక్టర్ జె. అగర్వాల్ ఎగ్జెంప్లరీ అవార్డు (ఉత్తమ కేస్ ప్రెజెంటేషన్)ను డాక్టర్ ఆర్. దివ్యకు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ సుజాత రాథోడ్, డాక్టర్ సుసాన్ జాకబ్‌లు మాట్లాడుతూ.. కల్పవృక్ష కార్యక్రమం విద్యార్థుల్లో క్లినికల్ పరిజ్ఞానాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంచి భవిష్యత్ నేత్ర వైద్య నిపుణులుగా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు.


