బ్రహ్మాండ సచివాలయం, అసెంబ్లీ | - | Sakshi
Sakshi News home page

బ్రహ్మాండ సచివాలయం, అసెంబ్లీ

Sep 4 2026 2:06 AM | Updated on Sep 4 2026 2:06 AM

న్యూస్‌రీల్‌

రూ.1,200 కోట్లతో నిర్మాణం

అసెంబ్లీలో సీఎం విజయ్‌ ప్రకటన

చైన్నెలో ప్రపంచస్థాయి తమిళనాడు ఒలింపిక్‌ సిటీ

క్రీడా టూరిజం ప్రోత్సాహానికి మోటార్‌ స్పోర్ట్స్‌ సిటీ

మద్రాసు హైకోర్టు ప్రాథమిక భాషగా తమిళం

అసెంబ్లీలో తీర్మానం ఆమోదం

10 వేల పోలీసుల నియామకానికి నిర్ణయం

‘ఈశాన్యం’పై సమీక్ష

సాక్షి, చైన్నె: రాజధాని నగరం చైన్నెలో సెయింట్‌ జార్జ్‌ కోటకు ప్రత్యామ్నాయంగా బ్రహ్మాండ సచివాలయం, అసెంబ్లీ నిర్మాణానికి సీఎం విజయ్‌ నిర్ణయించారు. ఇందుకోసం రూ. 1200 కోట్లు కేటాయించారు. చైన్నెలో ప్రపంచ స్థాయి తమిళనాడు ఒలిపింక్‌ సిటీ రూపకల్పనతో పాటుగా క్రీడా టూరిజం ప్రోత్సాహానికి మోటారు స్పోర్ట్స్‌ సిటీ నిర్మాణానికి నిర్ణయించారు. అలాగే 10 వేల మంది పోలీసుల నియామకానికి ఉత్తర్వులు ఇచ్చారు. ఇందులో 5 వేల మంది మహిళలకు అవకాశం కల్పించనున్నారు. ఇక మద్రాసు హైకోర్టులో మాతృ భాష తమిళం ను ప్రాథమిక భాషగా నిర్ణయిస్తూ అసెంబ్లీలో తీర్మానాన్ని ఆమోదించారు.. శాసనసభ బడ్జెట్‌ సమావేశాల్లో భాగంగా గురువారం సభా నిబంధన 110 ప్రకారం సీఎం విజయ్‌ కీలక ప్రకటన చేశారు.

తమిళనాడు ఒలింపిక్‌ సిటీ

అసెంబ్లీలో సీఎం విజయ్‌ మరో సంచలన ప్రకటన తమిళనాడును క్రీడారంగంలో ప్రపంచపటంలో నిలబెట్టేందుకు ప్రభుత్వం భారీ ప్రణాళికను రూపకల్పన చేసిందన్నారు. రాజధాని చైన్నెలో ప్రపంచస్థాయి ప్రమాణాలతో కూడిన తమిళనాడు ఒలింపిక్‌ సిటీ ని నిర్మించనున్నట్లు ప్రకటించారు. ఒలింపిక్స్‌తో పాటు ఇతర అంతర్జాతీయ క్రీడా పోటీల్లో తమిళనాడు క్రీడాకారులు అత్యధిక సంఖ్యలో పతకాలు సాధించడమే లక్ష్యంగా తమిళనాడు క్రీడా అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ ఒలింపిక్‌ సిటీని రూపకల్పన చేయనున్నామన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా సమీకృత క్రీడా ప్రాంగణాలు, అత్యంత ఆధునిక క్రీడా పరికరాలు అందుబాటులో ఉంచుతామన్నారు. అత్యున్నత స్థాయి శిక్షణ కోసం ప్రత్యేక హై పెర్ఫార్మెన్స్‌ ట్రైనింగ్‌ సెంటర్‌, స్పోర్ట్స్‌ సైన్స్‌ , స్పోర్ట్స్‌ మెడిసిన్‌ కేంద్రాలను ఇక్కడ ఏర్పాటు చేయనున్నామని వివరించారు. దేశీయ, అంతర్జాతీయ క్రీడాకారులు ,కోచ్‌ల కోసం అత్యాధునిక నివాస వసతి గృహాలను నిర్మించి ఇస్తామన్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడా పోటీలను నిర్వహించడంతో పాటు, ఒలింపిక్‌ పతకాలను గెలుచుకోగల ప్రతిభావంతులైన క్రీడాకారులను తీర్చిదిద్దే ప్రపంచస్థాయి వేదికగా ఈ ఒలింపిక్‌ సిటీ నిలుస్తుందని సీఎం విజయ్‌ ఆశాభావం వ్యక్తం చేశారు.

మోటార్‌ స్పోర్ట్స్‌ సిటీ

అసెంబ్లీలో సీఎం విజయ్‌ మాట్లాడుతూ, తమిళనాడులో క్రీడా రంగాన్ని, టూరిజాన్ని సరికొత్త ఎత్తులకు తీసుకెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో వినూత్న ప్రాజెక్టును సిద్ధం చేసిందన్నారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో ప్రపంచస్థాయి ప్రమాణాలతో మోటార్‌ స్పోర్ట్స్‌ సిటీ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ద్విచక్ర, నాలుగు చక్రాల వాహనాల ఉత్పత్తిలో తమిళనాడు ఇప్పటికే ముందంజలో ఉందని గుర్తు చేస్తూ, చైన్నె సమీపంలోని ఇరుంగాట్టుకోటై (మద్రాస్‌ ఇంటర్నేషనల్‌ సర్క్యూట్‌), కోయంబత్తూరులోని కారి మోటార్‌ స్పీడ్‌ వేలలో ఇప్పటికే ఎఫ్‌–3, ఎఫ్‌–4 కార్‌ రేసింగ్‌ పోటీలు జరుగుతున్నాయని పేర్కొంటూ, : అంతర్జాతీయ మోటార్‌ రేసింగ్‌కు అవసరమైన అత్యాధునిక రేసింగ్‌ ట్రాక్‌లు, శిక్షణా కేంద్రాలు ఇక్కడ అందుబాటులోకి తీసుకురాబోతున్నామన్నారు. ఫార్ములా–1, ఫార్ములా–2, ఫార్ములా–3, ఫార్ములా–4 వంటి అంతర్జాతీయ స్థాయి రేసింగ్‌ పోటీలను నిర్వహించేందుకు వీలుగా మౌలిక వసతులను కల్పిస్తామనివ వివరించారు. ఉపాధి, క్రీడా టూరిజం ప్రాజెక్ట్‌ ద్వారా మోటార్‌ స్పోర్ట్స్‌ వాహనాలు, విడిభాగాల తయారీ పరిశ్రమలు పెరగడమే కాకుండా, క్రీడా టూరిజం ద్వారా పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు, ఆర్థికావృద్ధి సాధ్యమవుతాయని అంచనా వేశామన్నారు. స్థానిక యువతలో ఉన్న రేసింగ్‌ ప్రతిభను గుర్తించి, వారికి సరైన శిక్షణనిచ్చి అంతర్జాతీయ స్థాయి రేసర్లుగా తీర్చిదిద్దడమే ఈ మోటార్‌ స్పోర్ట్స్‌ సిటీ ప్రధాన లక్ష్యంగా పేర్కొన్నారు. క్రీడలు, ఆటోమొబైల్‌ తయారీ రంగాలను సమర్థవంతంగా మేళవించి తమిళనాడును గ్లోబల్‌ రేసింగ్‌ హబ్‌గా మార్చడమే ఈ ప్రాజెక్ట్‌ ధ్యేయమని సీఎం విజయ్‌ ప్రకటించారు.

కొత్త సచివాలయం, అసెంబ్లీ

అసెంబ్లీలో సీఎం విజయ్‌ ప్రసంగిస్తూ, ప్రస్తుతం సచివాలయంగా పనిచేస్తున్న చారిత్రాత్మక సెయింట్‌ జార్జ్‌ కోట కాంప్లెక్స్‌ సుమారు 400 ఏళ్ల నాటిదిగా గుర్తు చేశారు. 107 ఎకరాల విస్తీర్ణం ఉన్న ఈ కాంప్లెక్స్‌లో రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో కేవలం 4 ఎకరాలు మాత్రమే ఉందన్నారు. మిగిలిన స్థలం భారత రక్షణ శాఖ, పురావస్తు శాఖ పరిధిలో ఉండటంతో ఆధునికీకరణకు లేదా విస్తరణకు తీవ్ర ఆటంకాలు ఏర్పడుతున్నాయని వివరించారు. 1978లో నిర్మించిన నామక్కల్‌ కవిజ్ఞర్‌ మాళిగై, సెయింట్‌జార్జ్‌ కోట కాంప్లెక్స్‌లలో స్థలం సమస్య తాజాగా జఠిలమైనట్టు తెలిపారు. 30కి పైగా ప్రభుత్వ శాఖలు, 6,000 మందికి పైగా సిబ్బంది పని చేస్తుండటంతో తీవ్ర స్థలాభావ సమస్య ఎదురవుతోందని, రాబోయే 100 ఏళ్ల అవసరాలను, భవిష్యత్‌ పరిపాలనావృద్ధిని దృష్టిలో ఉంచుకుని కొత్త సచివాయలం నిర్మాణానికి నిర్ణయం తీసుకున్నామన్నారు. అన్ని ప్రభుత్వ శాఖలను ఒకే ప్రాంగణంలోకి తీసుకువచ్చి సమర్థవంతమైన పాలనను అందించడమే దీని ముఖ్య ఉద్దేశంగా ప్రకటించారు. కొత్త కాంప్లెక్స్‌లో అసెంబ్లీతో పాటు గ్రీన్‌ బిల్డింగ్‌ ప్రమాణాలు, అగ్నిమాపక రక్షణ, దివ్యాంగులకు ప్రత్యేక వసతులు, విశాలమైన పార్కింగ్‌, సమావేశ మందిరాలు, ప్రజల కోసం ప్రత్యేక సేవా కేంద్రాలు ఏర్పాటు చేయనున్నామన్నారు.ప్రస్తుతం ఉన్న చారిత్రక సెయింట్‌ జార్జ్‌ కోట భవనాలను రాబోయే తరాల కోసం వారసత్వ చిహ్నాలుగా భద్రపరుస్తామని ప్రకటించారు. ఈ ప్రతిపాదనతో తమిళనాడు పాలనాపరమైన మౌలిక సదుపాయాలలో ఒక కొత్త అధ్యాయం కానుందని సీఎం విజయం తెలిపారు.

5 వేల మంది మహిళా పోలీసులు

అసెంబ్లీలో సీఎం విజయ్‌ 59 కీలక అంశాలకు సంబంధించిన ప్రకటనలు చేశారు. శాసనసభలో పోలీసు, అగ్నిమాపక, అత్యవసర సేవల శాఖల పద్దులపై జరిగిన చర్చలో భాగంగా సీఎం విజయ్‌ ఈ ప్రకటనలు చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను పటిష్టం చేయడం, పోలీసు శాఖను సాంకేతికంగా బలోపేతం చేయడం, సిబ్బంది సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ఈ కేటాయింపులు చేశారు. ఈ ఏడాది 5,000 మంది మహిళాల సహా మొత్తం 10,000 మంది పోలీసులను నియమించనున్నామని, రాబోయే 5 ఏళ్లలో దశలవారీగా 10,000 పోలీస్‌ స్టేషన్లలో 29,108 అదనపు కానిస్టేబుల్‌ పోస్టులను సృష్టిస్తామని వివరించారు. ఇదిలా ఉండగా అసెంబ్లీలో సీఎం విజయ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను మాట్లాడటం లేదు..మాట్లాడటం లేదని పేర్కొంటున్నారని, సోమవారం అన్ని వివరాలను మాట్లాడుతానని, ఎవ్వరూ బయటకు పారి పోకుండా ఉంటే చాలు..! అని చమత్కరించారు.

హైకోర్టులో ప్రాథమిక భాషగా ‘తమిళం’:

మద్రాస్‌ హైకోర్టులో అధికారిక , ప్రాథమిక భాషగా తమిళాన్ని గుర్తించాలని డిమాండ్‌ చేస్తూ తమిళనాడు శాసనసభలో సీఎం విజయ్‌ ప్రవేశపెట్టిన ప్రత్యేక తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. మద్రాస్‌ హైకోర్టులో వాదనలు, దరఖాస్తులతో పాటు ఇచ్చే తీర్పులు, ఉత్తర్వులు , ఆదేశాలన్నీ తమిళ భాషలోనే అందించేలా అవసరమైన మౌలిక వ్యవస్థను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 348(2) , అధికార భాషల చట్టం (1963) సెక్షన్‌ 7 ప్రకారం రాష్ట్ర గవర్నర్‌ ద్వారా పంపే ప్రతిపాదనలపై కేంద్ర ప్రభుత్వం తక్షణమే తగిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఈ తీర్మానం ద్వారా ఒత్తిడి తెచ్చారు. జిల్లా కోర్టుల్లో ఇప్పటికే తమిళం వాడుకలో ఉందని, స్థానిక భాషలో వాదనలు జరిగితే సాధారణ ప్రజలకు న్యాయ ప్రక్రియ సులభంగా అర్థమవుతుందని సీఎం పేర్కొన్నారు. హైకోర్టు న్యాయమూర్తులు, న్యాయవాదులు , కోర్టు సిబ్బందికి లీగల్‌ తమిళం అనువాదంలో ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని ప్రతిపాదించారు. ఈ డిమాండ్‌ ఏ ఇతర భాషకూ వ్యతిరేకం కాదని, కేవలం తమిళ భాషకు దక్కాల్సిన చట్టపరమైన గుర్తింపు కోసమేనని సీఎం విజయ్‌ స్పష్టం చేశారు. సభలోని అన్ని రాజకీయ పార్టీల సభ్యులు మద్దతు తెలపడంతో ఈ చారిత్రాత్మక తీర్మానం శాసనసభలో ఏకగ్రీవంగా ఆమోదించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement