మద్రాస్ హైకోర్టు తీర్పు
సాక్షి,చైన్నె: కొళత్తూరు అసెంబ్లీ నియోజకవర్గంలో టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు గెలుపును రద్దు చేయాలని కోరుతూ డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ దాఖలు చేసిన పిటిషన్‌ను మద్రాసు హైకోర్టు కొట్టి వేసింది. ఈ మేరకు గురువారం న్యాయమూర్తులు తీర్పు వెలువరించారు.
ఓట్ల లెక్కింపుపై వివాదం
అసెంబ్లీ ఎన్నికలలో ఎన్నికల్లో కొళత్తూర్ స్థానం నుంచి పోటీ చేసిన డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ ఓటమి పాలుకాగా, టీవీకే అభ్యర్థి వి.ఎస్.బాబు విజయం సాధించారు. అయితే, కొళత్తూర్ పరిధిలోని 14 ఈవీఎంలు, వివిపాట్లను జరిపిన తనిఖీల మేరకు, కొన్ని యంత్రాల్లో లోపాలు, అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ స్టాలిన్ హైకోర్టును ఆశ్రయించారు. నియోజకవర్గంలోని అన్ని ఈవీఎంలు, వివిపాట్ స్లిప్పులను తిరిగి లెక్కించాలని, వి.ఎస్.బాబు గెలుపును రద్దు చేసి, తనను విజేతగా ప్రకటించాలని పిటిషన్‌లో కోరారు. స్టాలిన్ తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదిస్తూ, ఫలితాలు వచ్చిన 3 రోజుల్లోనే తాము దరఖాస్తు చేసినప్పటికీ, 45 రోజుల పరిమితి ముగిసిన తర్వాతే అధికారులు యంత్రాలను పరిశీలించారని, అందుకే కోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ఎన్నికల సంఘం తరఫున న్యాయవాదులు వాదిస్తూ.. ఎమ్మెల్యే గెలుపును సవాలు చేయడానికి కేవలం నిబంధనల ప్రకారం ఎన్నికల పిటిషన్ మాత్రమే దాఖలు చేయాలని, ఇటువంటి పిటిషన్లు విచారణకు అర్హమైనవి కావని స్పష్టం చేశారు.
పిటిషన్ హైకోర్టులో కొట్టివేత
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస సుశ్రుత్ అరవింద్ ధర్మాధికారి, జస్టిస్ జి.అరుళ్ మురుగన్లతో కూడిన ధర్మాసనం ఇరు పక్షాల వాదనలు విన్న అనంతరం, ఎం.కే.స్టాలిన్ దాఖలు చేసిన పిటిషన్‌కు చట్టబద్ధత లేదని తేల్చిచెబుతూ దానిని కొట్టివేస్తున్నట్లు గురువారం తీర్పు చెప్పారు. కాగా ఎన్నికల కమిషన్ కారణంగానే అన్ని జాప్యాలు జరిగాయని, అందుకే తాజాగా పిటిషన్ సైతం తిరస్కరణకు గురైనట్టు స్టాలిన్ తరపు న్యాయవాది ఎన్‌ఆర్‌ఇలంగో మీడియాతో మాట్లాడుతూ వివరించారు. అప్పీలు విషయంగా పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందన్నారు.


