సాక్షి, చైన్నె : బహిరంగ మార్కెట్‌లో ఉల్లి ధరల పెరుగుదలను కట్టడి చేయడమే లక్ష్యంగా తమిళనాడు ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా రేషన్ దుకాణాల ద్వారా కిలో ఉల్లిపాయలను రూ.35 సబ్సిడీ ధరకే విక్రయించే కార్యక్రమాన్ని మంత్రులు వెంకటరమణన్, గాంధీరాజన్ గురువారం చైన్నెలో ప్రారంభించారు.తొలి విడతగా 8914 రేషన్ దుకాణాలలో ఈ పంపిణీకి శ్రీకారం చుట్టారు. వివరాలు.. రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా ఉల్లి ధర అమాంతంగా పెరుగుతూ వస్తున్నది. ఈ ధరను కట్టడి చేయడానికి సీఎం విజయ్ ఆదేశాలతో మంత్రి వెంకటరమణన్ చర్యలు చేపట్టారు. ఈమేరకు మహారాష్ట్ర నాసిక్ నుంచి నాఫెడ్, ఎన్‌సీసీఎఫ్ సంస్థల ద్వారా తొలి విడతగా 1,000 మెట్రిక్ టన్నుల ఉల్లిపాయలను తమిళనాడు ప్రభుత్వం కొనుగోలు చేసింది.
ఒక కార్డుకు కిలో చొప్పున
పేద, మధ్యతరగతి కుటుంబాలపై ఆర్థిక భారం పడకుండా రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి కిలో చొప్పున రూ.35కే నాణ్యమైన ఉల్లిపాయలను పంపిణీ చేయడానికి చర్యలు తీసుకున్నారు. తొలి విడతగా పట్టణ ప్రాంతాల్లోని రేషన్ షాపులు, వినియోగదారుల సహకార మార్కెట్లు, తమిళనాడు వినియోగదారుల సంస్థ రిటైల్ దుకాణాలు, ఫార్మ్ ఫ్రైష్ దుకాణాలతో కలిపి మొత్తం 8,914 కేంద్రాల ద్వారా ఈ విక్రయాలకు చర్యలు తీసుకున్నారు.
పంపిణీకి శ్రీకారం
చైన్నె టి.టి.కె రోడ్డులోని సహకార సంఘం రేషన్ దుకాణంలో ఆహార శాఖ మంత్రి పి.వెంకటరమణన్, సహకార శాఖ మంత్రి వి.గాంధీరాజన్ ఈ పథకాన్ని అధికారికంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆహార, వినియోగదారుల రక్షణ శాఖ అదనపు కార్యదర్శి పి.అముద తదితరులు పాల్గొన్నారు.


