సాక్షి, చైన్నె: పశుసంవర్ధక శాఖకు సంబంధించిన కీలక కేటాయింపులలో కొత్త సంక్షేమ పథకాలను ఆ శాఖ మంత్రి కమలి ప్రకటించారు. గ్రామీణ ఉపాధి, పాడి పరిశ్రమ అభివృద్ధిని లక్ష్యంగా చేసుకుని ప్రభుత్వం పలు నూతన కార్యక్రమాలను ప్రారంభించనున్నట్లు తెలిపారు. మహిళల ఆర్థిక సాధికారత కోసం రూ.110 కోట్ల అంచనా వ్యయంతో’వెట్రి మగళిర్ మేకల పెంపకం పథకంఈ ఏడాది నుంచే అమలులోకి రానున్నదన్నారు. గ్రామీణ మహిళలు శాశ్వత ఆదాయం పొందేందుకు, పాల ఉత్పత్తిని పెంచేందుకు 10 వేల మంది లబ్ధిదారులకు ఉచితంగా పాడి ఆవులను పంపిణీ చేయనున్నామన్నారు. పశువుల వద్దకే నేరుగా వెళ్లి వైద్యసేవలు అందించేందుకు రూ.143 కొత్త సంచార పశు వైద్యశాలలను ప్రారంభించనున్నామని తెలిపారు. పశువుల రక్షణ కోసం కాల్నడై కాప్పోమ్ పేరుతో కొత్త పశువుల ఇన్సూరెన్స్ పథకాన్ని ఈ ఏడాది నుంచి అమలు చేయనున్నామని వివరించారు. తిరుచ్చి జిల్లా మణప్పారైలో రూ.34 కోట్ల వ్యయంతో రోజుకు 30 మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన ఆధునిక సమీకృత మాంసం ప్రాసెసింగ్ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. తిరుప్పూర్ జిల్లా పల్లడంలో రూ.30 కోట్లతో గ్రేడ్–2 బయోలాజికల్ సేఫ్టీ ల్యాబొరేటరీని నెలకొల్పుతామని ప్రకటించారు. చెట్టినాడ్, నడువూర్, చిన్నసేలం పశువుల ఫారాలలో కుందేళ్ల పెంపకాన్ని ప్రోత్సహించే విభాగాలు ఏర్పాటు చేయడంతో పాటు, తిరునెల్వేలి అభిషేక పట్టిలో రూ.71 లక్షలతో పందుల పెంపకం కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. వీధి కుక్కల సంరక్షణను ప్రోత్సహించేలా తమిళనాడు జంతు సంక్షేమ బోర్డు ద్వారా ప్రత్యేక డిజిటల్ పోర్టల్‌ను అందుబాటులోకి తెస్తామన్నారు. పశుసంవర్ధక శాఖలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి త్వరలోనే తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి కమలి అసెంబ్లీ వేదికగా వెల్లడించారు.


